కేంద్రం చెప్పినట్టే!

ABN , First Publish Date - 2020-06-01T08:29:17+05:30 IST

కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ సడలింపులను యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అంతర్రాష్ట్ర రాకపోకలకు

కేంద్రం చెప్పినట్టే!

  • అంతర్రాష్ట్ర రవాణాకు  పచ్చజెండా
  • 7వ తేదీ  వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌
  • కట్టడి ప్రాంతాల్లో నెలాఖరు వరకూ ఆంక్షలు
  • రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ
  • రాత్రి 8 గంటల వరకూ దుకాణాలు తెరవచ్చు
  • సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఉత్తర్వులు జారీ
  • హైదరాబాద్‌లో సిటీ బస్సులు, మెట్రోకు నో
  • 8 నుంచి హోటళ్లు, మాల్స్‌, ఆలయాలు ఓపెన్‌ ?

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్‌ సడలింపులను యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా అంతర్రాష్ట్ర రాకపోకలకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఇక నుంచి ఇతర రాష్ట్రాలకు వెళ్లేందుకు, అక్కడి నుంచి రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రత్యేకంగా ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. రాష్ట్రంలో 7వ తేదీ వరకూ లాక్‌డౌన్‌ను పొడిగించాలని, కేంద్రం సూచన మేరకు కట్టడి ప్రాంతాల్లో నెలాఖరు వరకూ ఆంక్షలు అమలు చేయాలని నిర్ణయించింది. లాక్‌డౌన్‌  సడలింపులపై కేంద్రం మార్గదర్శకాలు జారీ చేసిన నేపథ్యంలో సీఎం కేసీఆర్‌ ఆదివారం ప్రగతి భవన్‌లో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇతర అధికారులతో సమావేశమయ్యారు.


రాష్ట్రవ్యాప్తంగా 7వ తేదీ వరకూ లాక్‌డౌన్‌  పొడిగించాలని, కట్టడి ప్రాంతాల్లో నెలాఖరు వరకూ అమలు చేయాలని సీఎం ఆదేశించారు. కేంద్రం ఆదేశాల ప్రకారం కట్టడి ప్రాంతాలు మినహా ఇతర చోట్ల సడలింపులను అమలు చేయాలని, రాత్రి 9 నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ అమలు చేయాలని సూచించారు. అన్ని ప్రాంతాల్లో రాత్రి 8 గంటల వరకు దుకాణాలు తెరిచి ఉంచేందుకు అనుమతివ్వాలని పేర్కొన్నారు. రాత్రి పూట కర్ఫ్యూ వేళలు, దుకాణాలు తెరిచి ఉంచే సమయం, అంతర్రాష్ట్ర రవాణా, ప్రయాణాలపై నియంత్రణ తొలగింపునకు సంబంధించి సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు.


మెట్రో, సిటీ బస్సులకు నో

రాష్ట్రంలో 4వ విడత లాక్‌డౌన్‌  ఆదివారంతో ముగిసింది. ఈ నేపథ్యంలోనే కేంద్రం సూచనల మేరకు మరిన్ని సడలింపులను ప్రభుత్వం ప్రకటించింది. వాస్తవానికి గత నెల 18న ఇచ్చిన సడలింపులతో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వ్యాపార సంస్థలు తెరుచుకున్నాయి. రెడ్‌జోన్లు మినహా అన్ని ప్రాంతాల్లో ప్రజా రవాణాకు అనుమతించారు. అయితే, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో కరోనా తీవ్రత దృష్ట్యా జిల్లాల నుంచి వచ్చే బస్సులను నగర శివార్ల వరకే అనుమతించారు. గత నెల 27న తీసుకున్న నిర్ణయం మేరకు ఎంజీబీఎస్‌ వరకూ బస్సులు నడుస్తున్నాయి. ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేందుకు రాత్రి వేళలోనూ ఆటోలకు అనుమతించారు. కానీ, హైదరాబాద్‌ పరిధిలో ఇప్పటి వరకూ సిటీ బస్సులు, మెట్రో రైళ్లకు ఇంకా అనుమతి ఇవ్వలేదు.


నుంచి హోటళ్లు, మాల్స్‌?

కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా 8వ తేదీ నుంచి రాష్ట్రంలోని హోటళ్లు, మాల్స్‌, ప్రార్థనా మందిరాలు తెరుచుకునే వీలుంది. దశల వారీ సడలింపులతో ఇప్పటికే అనేక వ్యాపార, వాణిజ్య సంస్థలు తెరుచుకున్నప్పటికీ కొన్ని మాత్రం పూర్తి స్థాయిలో మూసి ఉన్నాయి. వీటిలో హోటళ్లు, మాల్స్‌, ప్రార్థనా మందిరాలు 8వ తేదీ నుంచి తెరుచుకునే అవకాశం ఉంది. అయితే, తాజా ఉత్తర్వుల్లో వీటిపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఫంక్షన్‌  హాళ్లు, జిమ్‌లు, సినిమాహాళ్లపై మరికొంత కాలం నిషేధం కొనసాగించే అవకాశం ఉందని తెలిసింది. కాగా, ప్రభుత్వ నిర్ణయం నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురంలో ఏర్పాటు చేసిన అంతర్రాష్ట్ర చెక్‌పోస్టును ఎత్తివేసేందుకు కసరత్తు జరుగుతోంది. 

Updated Date - 2020-06-01T08:29:17+05:30 IST