ప్రారంభం కాని ఎంసెట్ వెబ్ ఆప్షన్లు
ABN , First Publish Date - 2020-10-19T08:54:51+05:30 IST
ప్రారంభం కాని ఎంసెట్ వెబ్ ఆప్షన్లు

కొత్త కోర్సుల నమోదులో జేఎన్టీయూ ఆలస్యం
నేటి నుంచి అందుబాటులోకి
హైదరాబాద్, అక్టోబరు 18(ఆంధ్రజ్యోతి): ఎంసెట్ వెబ్ కౌన్సిలింగ్‌లో కీలకమైన ఆప్షన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభం కాలేదు. ఈ ఏడాది ప్రారంభించే కొత్త కోర్సుల అనుమతులకు సంబంధించిన అంశం ప్రభుత్వం వద్ద కొన్ని వారాలుగా పెండింగ్‌లో ఉండగా.. దీనిపై ప్రభుత్వం శనివారం రాత్రి నిర్ణయం తీసుకుంది. కాలేజీల వారీగా కోర్సులు, వివరాలతో కూడిన జీవోను కూడా శనివారం రాత్రి విడుదలచేసింది. కంప్యూటర్ సైన్స్ విభాగంలో కొత్తగా 6 కోర్సులను అనుమతించిన ప్రభుత్వం.. దరఖాస్తు చేసిన 78 ఇంజినీరింగ్ కాలేజీలకు 18,210 సీట్లు కేటాయించింది. ఈ వివరాలను జేఎన్టీయూ ఆన్‌లైన్‌లో నమోదు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఉత్తర్వులు వెలువరించిన వెంటనే వర్సిటీ ఈ ప్రక్రియను ప్రారంభించినప్పటికీ ఆదివారం సాయంత్రం వరకు పూర్తవ్వలేదు.
దీంతో ఇప్పటికే ప్రాసెసింగ్ ఫీజు, స్లాట్ బుకింగ్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తిచేసి ఆప్షన్ల ఎంపిక కోసం ఎదురుచూస్తు న్న విద్యార్థులు ఆదివారం ఆప్షన్లు ఎంపిక చేయలేకపోయారు. సాంకేతి క సమస్యల కారణంగా వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కాలేదని విద్యార్థులు భావించగా.. దీనిపై సాంకేతిక విద్యాశాఖ వివరణ ఇచ్చిం ది. కొత్త సీట్ల వివరాల నమోదు ప్రక్రియ దాదాపు పూర్తయిందని సోమవారం నుంచి ఆప్షన్లు ఎంపిక చేసుకోవచ్చని ఎంసెట్ ప్రవేశాల ప్రక్రియ బాధ్యతలు నిర్వహిస్తున్న సాంకేతిక విద్యాశాఖ ఉన్నతాధికారి తెలిపారు. శనివారం నాటికి 55,812మంది ప్రాసెసింగ్ ఫీజు చెల్లించగా.. 43,721 మంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్నారు.
176 ఇంజినీరింగ్ కాలేజీల్లో 97,741 సీట్లు
యూనివర్సిటీలు, ప్రైవేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2020-21 విద్యా సంవత్సరంలో మొత్తం 97,741 సీట్లు ఉన్నాయని, కన్వీనర్ కోటాలో 69,365 సీట్లు ఉన్నాయని సాంకేతిక విద్యాశాఖ వెల్లడించింది. ఈ ఏడాది కొత్త కోర్సుల అనుమతులను ప్రభుత్వం శనివారం ప్రకటించిన అనంతరం వాటితో కలిపి మొత్తం సీట్ల వివరాలను సాంకేతిక విద్యాశాఖ ఆదివారం ఓ ప్రకటనలో తెలిపింది.