పద్మ మన నిట్‌ విద్యార్థినే..

ABN , First Publish Date - 2020-11-07T09:35:48+05:30 IST

అమెరికాలో మిచిగాన్‌ రాష్ట్రం నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ పక్షాన ప్రతినిధుల సభకు ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన మహిళల్లో ఒకరైన పద్మ కుప్పకు వరంగల్‌తో అనుబంధం ఉంది

పద్మ మన నిట్‌ విద్యార్థినే..

అమెరికా ఎన్నికల్లో ప్రతినిధుల సభకు ఎన్నిక

నిట్‌లో 1982-86లో ఇంజనీరింగ్‌ పూర్తి 


హన్మకొండ, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి) :  అమెరికాలో మిచిగాన్‌ రాష్ట్రం నుంచి డెమోక్రాటిక్‌ పార్టీ పక్షాన ప్రతినిధుల సభకు ఎన్నికైన భారతీయ సంతతికి చెందిన మహిళల్లో ఒకరైన పద్మ కుప్పకు వరంగల్‌తో అనుబంధం ఉంది. ఆమె వరంగల్‌ నిట్‌లో 1982-86లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. ఇటీవల జరిగిన నిట్‌ వజ్రోత్సవాలకు కూడా ఆమె హాజరయ్యారు. అమెరికా ఎన్నికల్లో ఈసారి భారతీయ సంతతికి చెందిన 18 మంది గెలుపొందారు. రాష్ట్రస్థాయి ఎన్నికల్లో 13 మంది విజయం సాధించగా వారిలో ఐదుగురు మహిళలే కావడం గమనార్హాం. వీరిలో పద్మ కుప్ప ఒకరు. పద్మ అమెరికాలో క్రియాశీల రాజకీయాల్లో చురుకుగా పాలుపంచుకుంటున్నారు. మెంబర్‌ ఆఫ్‌ మిచిగాన్‌ హౌస్‌ ఆఫ్‌ రిప్రెంజంటేటివ్స్‌గా ఎన్నిక కావడం ఇది రెండోసారి. పద్మ కుప్ప ఇండో అమెరికన్‌. మిచిగాన్‌ ప్రతినిధుల సభకు ఎన్నికయిన తొలి భారతీయ వలసదారు. మిచిగాన్‌లో అసిస్టెంట్‌ విప్‌గా నియమితులయ్యారు. పద్మ వయసు 55  సంవత్సరాలు, ఆమెకు భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. 1965 ఆగస్టు 10న ఇండియాలోని బిలాయ్‌లో జన్మించిన ఆమె 1991 నుంచి ప్రతినిధుల సభలో డెమెక్రటిక్‌ పార్టీ సభ్యురాలుగా కొనసాగుతున్నారు. 


వివిధ హోదాల్లో..

గతంలో క్రిస్లర్‌ కార్పొరేషన్‌, ట్రాయ్‌ సిటీలో ఇంజనీర్‌గా పనిచేశారు. రెండు సంవత్సరాలకు పైగా ట్రాయ్‌ ప్లానింగ్‌ కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఎనర్జీ కమిటీ, స్థానిక పాలన, మునిసిపల్‌ ఆర్థిక సంఘంలో సభ్యురాలిగా కూడా సేవలందించారు. మిచిగాన్‌ రౌండ్‌ టేబుల్‌ ఫర్‌ డైవర్సిటీబో బోర్డు సభ్యురాలిగా, అలాగే ట్రాయ్‌ హిస్టారికల్‌ సొసైటీ ప్రెసిడెంట్‌గా కూడా పనిచేశారు. ట్రాయ్‌ ఏరియా ఇంటర్‌ఫెయిత్‌ గ్రూపును స్థాపించి ప్రజలకు విశిష్టమైన సేవలందించారు.


రాజకీయాల్లో క్రియాశీలకంగా..

2018 నవంబరు 6న జరిగిన సాధారణ ఎన్నికల్లో 41వ జిల్లా నుంచి డాగ్‌ టైజ్‌పై విజయం సాధించి మిచిగాన్‌ ప్రతినిధుల సభలో అడుగుపెట్టారు. అప్పుడామె స్వల్ప మెజారిటీతో గెలుపొందినా.. ఈసారి తన ఆధిక్యతను పెంచుకున్నారు. ఇటీవల నవంబరు 3న జరిగిన ఎన్నికల్లో తన ప్రత్యర్థి ఆండ్రూ సోస్నోస్కిపై 5,601 ఓట్ల తేడాతో 42వ జిల్లా హౌస్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్‌గా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో  మొత్తం 55,545 ఓట్లలో సోస్నోస్కికి 24,967 ఓట్లు (44.9 శాతం) రాగా పద్మకు 30,578 (55.1 శాతం) ఓట్లు వచ్చాయి. 


పద్మ కుప్ప నాలుగేళ్ల వయసప్పుడే తల్లిదండ్రులతో కలిసి అమెరికాకు వెళ్లిపోయారు. 1970లో లాంగ్‌ ఐలాండ్‌లో కిండర్‌గార్టెన్‌లో చేరారు. 1981లో తన కుటుంబ సభ్యులతో కలిసి తిరిగి భారతదేశానికి వచ్చారు. ఇక్కడే పాఠశాల, విద్య, ఇంటర్‌ పూర్తిచేశారు. నిట్‌లో 1988లో మెకానికల్‌లో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన తర్వాత న్యూయార్క్‌కు వెళ్లిపోయారు. పద్మ ఆమె భర్త, ఇద్దరు పిల్లలు 1998 నుంచి మిచిగాన్‌ రాష్ట్రంలోని ట్రాయ్‌ నగరంలో నివాసముంటున్నారు. పద్మ వృత్తిరీత్యా యాల్లీ ఫైనాన్షియల్‌ కంపెనీలో బిజినెస్‌ ఎనలిస్టుగా పనిచేస్తున్నారు. 

Updated Date - 2020-11-07T09:35:48+05:30 IST