‘గుడ్డు’ గుబేలు మంటోంది

ABN , First Publish Date - 2020-10-04T21:29:12+05:30 IST

కోడిగుడ్ల ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. గత రెండు వారాలుగా కోడిగుడ్ల ధరలు పెరుగుతూపోతున్నాయి.

‘గుడ్డు’ గుబేలు మంటోంది

హైదరాబాద్‌: కోడిగుడ్ల ధరలు సామాన్యులకు అందకుండా పోతున్నాయి. గత రెండు వారాలుగా కోడిగుడ్ల ధరలు పెరుగుతూపోతున్నాయి. మూడు నెలల క్రితం రిటైల్‌ ధర ఒక గుడ్డుకు 4.50 రూపాయలు కాగా కరోనా సమయంలో 5 రూపాయలకు చేరింది. తర్వాత కరోనా నివారణకు ఇమ్యూనిటీ పెంచుకోవడానికి కోడిగుడ్లు దోహదం చేస్తాయన్న ప్రచారం పెరిగిపోవడంతో కోడిగుడ్ల వినియోగం విపరీతంగా పెరిగింది. దీంతో అధికశాతం మంది నిత్యం కోడిగుడ్లను తమ ఆహారంగా భాగం చేసుకుంటున్నారు. కోడిగుడ్డు ఆరోగ్యానికి మేలుచేస్తుందని, పిల్లలూ, పెద్దలూ రోజుకో గుడ్డు తినాలని వైద్యులు కూడా సలహా ఇస్తున్నారు. ఈకారణంగా కూడా కోడిగుడ్ల వినియోగం బాగా పెరిగింది. తాజాగా హోల్‌సేల్‌ మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు డజన్‌కు 66 రూపాయలకు చేరింది. రిటైల్‌ మార్కెట్‌ అయితే ఒక గుడ్డు 6 రూపాయలకు అమ్ముతున్నారు.


కరోనాకు ముందు మార్చి నెల వరకూ తెలంగాణ రాష్ట్రంలో కోడిగుడ్ల వినియోగం రోజుకు కోటిన్నర నుంచి రెండు కోట్లు ఉండగా ప్రస్తుతం  రాష్ట్రంలో మూడు నుంచి మూడున్నర కోట్ల వినియోగం అవుతున్నట్టు తేలింది. అంటే దాదాపు 80శాతం జనాభా రోజూ గుడ్లను వినియోగిస్తున్నట్టు తేలింది. గతంలో పేదవాడి ఆహారంగా ఉన్న గుడ్డు ఇప్పుడు అన్నివర్గాలు ఎంతో ఇష్టంగా తీసుకుంటున్నారు. దీంతో వీటికి డిమాండ్‌ రోజు రోజుకూ పెరుగుతోంది. ప్రస్తుతం కోడిగుడ్లకు పెరుగుతున్న ఆదరణ చూస్తుంటే ఒక్కో గుడ్డు ఏడు రూపాయలకు చేరినా ఆశ్చర్య పోవద్దని ఓ వ్యాపారి అభిప్రాయం వ్యక్తం చేశారు. 

Updated Date - 2020-10-04T21:29:12+05:30 IST