3-4 నెలల్లో కరోనా మందు?
ABN , First Publish Date - 2020-04-21T09:52:50+05:30 IST
కరోనాను అరికట్టే వ్యాక్సిన్ రావడానికి మరో ఏడాది పట్టినా.. మూడు, నాలుగు నెలల్లో నివారణకు మందులు వచ్చే అవకాశం ఉంది.

వ్యాక్సిన్ రావడానికి ఏడాది పట్టొచ్చు
న్యూయార్క్‌లో వైద్యుల్లో పెరుగుతున్న కేసులు
ఆంధ్రజ్యోతితో న్యూజెర్సీలోని ది వ్యాలీ
హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ ఈదర శ్రీనివాస్
కరోనాను అరికట్టే వ్యాక్సిన్ రావడానికి మరో ఏడాది పట్టినా.. మూడు, నాలుగు నెలల్లో నివారణకు మందులు వచ్చే అవకాశం ఉంది. అప్పటి వరకు జాగ్రత్తలు తీసుకోవడమే వైరస్ వ్యాప్తిని తగ్గించేందుకు ఉన్న ఏకైక మార్గం అంటున్నారు న్యూజెర్సీలోని ది వాలీ హాస్పిటల్‌లో ఐసీయూ విభాగం డైరెక్టర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఈదర శ్రీనివాస్. 1985లో గుంటూరులో మెడిసిన్ పూర్తిచేసి మూడు దశాబ్దాలుగా న్యూజెర్సీలో వైద్య సేవలందిస్తున్న ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడారు. ఆ విశేషాలు..
న్యూయార్క్‌లో కరోనా తీవ్రస్థాయిలో ఉన్నట్టుంది?
ఇక్కడ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. గత వారంతో పోలిస్తే కేసుల తీవ్రత తగ్గినా, న్యూయార్క్‌లో ఇప్పటికీ రోజుకు మూడు, నాలుగు వేల కొత్త కేసులు వస్తున్నాయి. ఈ నెల ప్రారంభం నుంచే ఇక్కడ లాక్‌డౌన్ అమలు చేస్తున్నారు. మార్చిలో కేసులు పెరుగుతున్నా నిర్ధారణ పరీక్షలు జరపడంలో యంత్రాంగం విఫలమైంది. దాంతో వైరస్ విజృంభించి వేలాదిమందిని బలిగొంది.
మైదానాల్లో తాత్కాలిక బెడ్లు ఏర్పాటుచేశారనే వార్తలున్నాయి?
మొన్నటివరకు అదే పరిస్థితి నెలకొంది. కేసుల సంఖ్య క్రమంగా తగ్గడంతో ఇప్పుడు ఆస్పత్రులలోనే వైద్యసేవలు అందిస్తున్నాం.
దీర్ఘకాలిక వ్యాధులున్న వారి పరిస్థితి ఏంటి?
దీర్ఘకాలిక జబ్బులున్న వారు కోలుకొనేందుకు సమయం పడుతోంది. వెంటిలేషన్ మీదకు వెళ్లి.. బతుకుతున్న వారి సంఖ్య తక్కువ. ఇక్కడ ఎక్కువగా నల్ల జాతీయులు కరోనా బారిన పడుతున్నారు.
కోలుకున్న వారు గతంలోలా ఆరోగ్యంగా ఉంటున్నారా?
కొవిడ్ నుంచి కోలుకుని ఇంటికెళ్లిన కొద్దిరోజుల తరువాత మూర్ఛ, పక్షవాతం, హృద్రోగం వంటి సమస్యలతో కొందరు మళ్లీ ఆస్పత్రుల్లో చేరుతున్నారు. వైద్యులకు ఇది ఆందోళన కలిగించే అంశం.
అక్కడి వైద్యులు, ఆరోగ్య సిబ్బంది పరిస్థితి ఎలా ఉంది?
రెండు నెలలుగా అహర్నిశలూ పనిచేస్తున్నారు. ఒక పల్మనాలజిస్ట్ కరోనా సోకి మరణించింది. న్యూయార్క్ అంతటా వైద్యులు, సిబ్బందిలో క్రమంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే కొన్నాళ్లకు వైద్యులు, సిబ్బంది కొరత తీవ్రమవుతుందేమో.
కొవిడ్ ఎప్పటిలోగా తగ్గుతుందని నిపుణులు భావిస్తున్నారు?
వైరస్ ఇప్పటిలో దారికొస్తుందనే విశ్వాసం వైద్యుల్లో కనిపించడం లేదు. వ్యాక్సిన్ రావడానికి ఏడాది కాలం పట్టినా, మూడు నాలుగు నెలల్లో మందులు అందుబాటులోకి వస్తాయనే నమ్మకం ఉంది.
కొన్ని రాష్ట్రాల్లో లాక్‌డౌన్ ఎత్తివేయాలని ఉద్యమిస్తున్నారు కదా?
భారత్‌లో వలె అమెరికాలో పూర్తి లాక్‌డౌన్ విధించడం సాధ్యం కాదు. న్యూయార్క్ మినహా ఇతర రాష్ట్రాల్లో కేసులు తక్కువగా ఉండటంతో ఆంక్షలు ఎత్తివేయాలని అక్కడ ఉద్యమాలు చేస్తున్నారు.
భారత్‌లో లాక్‌డౌన్ ఎప్పటివరకూ ఉండాలంటారు?
మరో రెండు మూడు నెలలు స్వీయ నియంత్రణ తప్పకపోవచ్చు. లాక్‌డౌన్ ఎత్తేశాక కేసుల తీవ్రత ఎలా ఉంటుందనే అంశం మీద భవిష్యత్ ఆధారపడి ఉంటుంది.
- స్పెషల్ డెస్క్