ఇక ‘ఈ-ఆఫీస్’... సోమవారం నుంచే అమలులోకి
ABN , First Publish Date - 2020-07-11T03:15:39+05:30 IST
రాష్ట్ర కార్యాలయాల్లో ఇక కాగితాలు, ఫైళ్ళు ఉండవు. అంతా ఎలక్ట్రానిక్‌మయమే. కార్యకలాపాలన్నీ ‘ఆన్‌లైన్’లోనే. ఇందుకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తెలంగాణ ప్రభుత్వం... ఇక సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ‘ఈ-ఆఫీస్’ ప్రారంభం కానుంది. రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి మండల కార్యాలయాల వరకు ఇక అంతా ఆన్‌లైన్ లోనే సంబంధిత ప్రక్రియలన్నీ నడవనున్నాయి.

హైదరాబాద్ : రాష్ట్ర కార్యాలయాల్లో ఇక కాగితాలు, ఫైళ్ళు ఉండవు. అంతా ఎలక్ట్రానిక్‌మయమే. కార్యకలాపాలన్నీ ‘ఆన్‌లైన్’లోనే. ఇందుకు సంబంధించి ఇప్పటికే పూర్తిస్థాయిలో కసరత్తు చేసిన తెలంగాణ ప్రభుత్వం... ఇక సోమవారం నుంచి పూర్తి స్థాయిలో ‘ఈ-ఆఫీస్’ ప్రారంభం కానుంది. రాష్ట్ర స్థాయి కార్యాలయాల నుంచి మండల కార్యాలయాల వరకు ఇక అంతా ఆన్‌లైన్ లోనే సంబంధిత ప్రక్రియలన్నీ నడవనున్నాయి.
ఈ క్రమంలో... ఇప్పటికే చాలా విభాగాలలో నోడల్ అధికారులను, టెక్నికల్ అసిస్టెంట్‌లను నియమించారు కూడా. మరోవైపు... ఆన్‌లైన్‌లో ఫైళ్ల నిర్వహణకు సంబంధించిన శిక్షణ కూడా ప్రారంభమైంది. ఈ- ఆఫీస్ పని విధానంలో కాగితంతో పని ఉండదు. ఉద్యోగులు, అధికారులు తమ మధ్య ఫైళ్ల బదలాయింపు కోసమో లేక చర్చించడం కోసం ప్రత్యేకంగా భేటీ కావాల్సిన అవసరముండదు. కంప్యూటర్ స్కీృన్‌పై ఫైల్ చూసుకొంటూ ఇంటర్‌కమ్ ఫోన్‌లో చర్చించుకోవాల్సి ఉంటుంది.
ఈ-ఆఫీస్ పని విధానం ఇలా...
ఈ-ఆఫీస్ విధానంలో మొదట పిటిషన్లు ఇన్‌వార్డ్ సెక్షన్‌కు వస్తాయి. అక్కడ రికార్డ్ అసిస్టెంట్ వాటిని స్కానింగ్ చేస్తారు. స్కానింగ్ చేసిన పిటిషన్‌కు నంబర్ ఇచ్చి సంబంధిత సర్క్యులేషన్ ఆఫీసర్‌కు ఆన్‌లైన్ లో పంపుతారు. సర్క్యులేషన్ ఆఫీసర్ దానిని సంబంధిత సెక్షన్ ఆఫీసర్‌కు పంపుతారు. సెక్షన్ ఆఫీసర్ ఆ ఫైల్‌లోని అంశాన్ని చూసే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్‌కు అసైన్ చేస్తారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ ఆ పిటిషన్‌ను సెక్రటేరియట్ మాన్యువల్ ప్రకారం పరిశీలించి, నోట్‌ఫైల్ రాసి, తిరిగి సెక్షన్ ఆఫీసర్‌కు పంపుతారు. సెక్షన్ ఆఫీసర్ నోట్‌ఫైల్‌ను పరిశీలించి అంతా సవ్యంగా ఉంటే పై అధికారి(అసిస్టెంట్ సెక్రటరీ)కి పంపిస్తారు. లేదా ఏవైనా మార్పులు చేర్పులు ఉంటే వెనక్కు పంపించి మళ్లీ ఆన్‌లైన్‌లోనే సరిచేయిస్తారు. అసిస్టెంట్ సెక్రెటరీ ఆ ఫైలును డిప్యూటీ సెక్రటరీకి గానీ, అడిషనల్ సెక్రటరీ కానీ ఆ శాఖలో ఎవరుంటే వారికి పంపిస్తారు.
వాళ్లు చూసిన తరువాత ఫైనల్‌గా శాఖాధిపతి అయిన కార్యదర్శి/ముఖ్య కార్యదర్శి/ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వద్దకు ఆ ఫైలు చేరుతుంది. వీళ్లు ఫైల్‌ను అప్రూవల్ చేస్తే జీవో లేదా సర్క్యులర్ జారీ అవుతుంది. తుది ఉత్తర్వులు... కార్యదర్శి పేరున విడుదలచేసే అధికారి దగ్గరకు వెళతాయి. సదరు అధికారి కార్యదర్శి పేరున ఉత్తర్వులు జారీచేస్తారు. ఒక్కోసారి సమస్య తీవ్రతను బట్టి ఫైల్ సీఎస్ వరకు, సీఎస్ నుంచి సీఎం వరకు వెళుతుంది. కొన్ని ఫైళ్లు సచివాలయంలో రెండు, మూడు శాఖలతో సంబంధం కలిగి ఉంటాయి. ఆయాశాఖల మధ్య ఫైల్ సర్క్యులేషన్ కావాల్సి ఉంటుంది. దీనికి ఆయా సెక్షన్ అధికారుల ద్వారా ‘ఆన్‌లైన్’లో ఫైళ్లను ఆయా శాఖలకు పంపుతారు. వాటిని ఆయా శాఖల కార్యదర్శులు పరిశీలించి తగిన నిర్ణయం తీసుకొని వెనక్కు పంపుతారు.
కాగా... ఈ ప్రక్రియలో భాగంగా... ప్రతీ ఉద్యోగికి ప్రత్యేక ఐడీ, పాస్‌వర్డ్
లను కేటాయిస్తారు.
అవి సదరు ఉద్యోగి, అధికారి మాస్టర్ డాటాకు లింక్ అయి ఉంటాయి. దీంతో ఎక్కడా ఆ ఫైల్‌ను దారి తప్పించడానికి ఎవ్వరికీ అవకాశముండదు. అలాగే సదరు ఉద్యోగికి నెట్ కనెక్షన్ ఉంటే చాలు... ఇంటినుంచైనా పనిచేయవచ్చు. కరోనా వైరస్ విజృంభిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ నెల(జూలై) 31 వ తేదీ వరకు సచివాలయంతోపాటు ఇతర ప్రభుత్వ శాఖల ఉద్యోగులను 50 శాతం మాత్రమే రొటేషన్ పద్ధతితో హాజరుకావాలని ఆదేశించిన విషయం తెలిసిందే. మిగిలిన వారికి... ఇంటి వద్ద నుంచి పనిచేసేందుకు ఈ-ఆఫీస్ విధానం ఉపయోగంగా ఉంటుంది. ఆఫీస్‌కు వచ్చిన ఉద్యోగులు కూడా భౌతికదూరం పాటించేందుకు ఈ పద్ధతి దోహదపడుతుందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాల్లో కూడా ఇదే విధానం...
జిల్లాల్లో వచ్చిన పిటిషన్‌లు కూడా స్కాన్ చేసిన తరువాత తాసిల్దార్ నుంచి ఆర్డీవో, అడిషనల్ కలెక్టర్, కలెక్టర్ వరకు వెళతాయి. వివిధ శాఖలకు చెందిన పిటిషన్‌లు ఆయా శాఖల అధికారుల ద్వారా కలెక్టర్ వరకు చేరతాయి. కొన్ని నేరుగా కలెక్టర్ కార్యాలయానికే వస్తాయి. అక్కడ ఇన్‌వార్డ్ సెక్షన్‌లో స్కానింగ్ చేసి, సంబంధిత ఆఫీస్ సూపరింటెండెంట్‌కు ఫైల్‌ను పంపిస్తారు. సూపరింటెండెంట్... సెక్షన్ క్లర్క్‌కు పంపించి ఫైల్‌ను పుటప్ చేయిస్తారు. ఆ ఫైల్ సెక్షన్ క్లర్క్ నుంచి సూపరింటెండెంట్‌కు అక్కడి నుంచి అడిషనల్ కలెక్టర్‌కు, ఆపై కలెక్టర్‌కు చేరుతుంది. ఇదంతా ఆన్‌లైన్‌లోనే జరుగుతుంది.
ఫైళ్లను ఎక్కడి నుంచైనా తనిఖీ చేయవచ్చు...
ఆన్‌లైన్ విధానంలో ఫైళ్ల స్థితిగతులను పైఅధికారులు ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకునే వీలుంటుంది. అధికారులు... తమ మొబైల్ ఫోన్‌లోనే ఫైల్‌ను ట్రాక్ చేయవచ్చు. ఎక్కడైనా ఫైల్ ఆలస్యమైతే అందుకుగల కారణాలపై ఉన్నతాధికారులకు వివరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ విధానంలో ఫైల్ వేగంగా కదులుతుందని ఓ సీనియర్ అధికారి చెప్పారు. అత్యవసరమనుకున్న ఫైల్‌ను అసిస్టెంట్ సెక్షన్ అధికారి నుంచి కార్యదర్శి వరకు అరగంటలో పంపవచ్చు. అంత వేగంగా ఫైళ్లను క్లియర్ చేసే అవకాశం ‘ఈ-ఆఫీస్’ విధానంలో ఉంటుంది.