దుబ్బాక కాక

ABN , First Publish Date - 2020-10-27T08:44:39+05:30 IST

సోదాలు.. అరెస్టులు.. లాఠీచార్జిలతో సిద్దిపేట అట్టుడికింది. దాదాపు పది గంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు బంధువుల ఇంట్లో

దుబ్బాక కాక

అరెస్టులు.. తోపులాట.. లాఠీచార్జి.. సిద్దిపేటలో ఉద్రిక్తత

రఘునందన్‌ బంధువుల ఇంట్లో పోలీసుల సోదాలు

ఒకరి ఇంట్లో రూ.18.67 లక్షలు దొరికాయని వెల్లడి

పోలీసులే డబ్బు తెచ్చి పెట్టారన్న బీజేపీ కార్యకర్తలు

కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట.. లాఠీచార్జి

హుటాహుటిన సిద్దిపేటకు బయలుదేరిన సంజయ్‌

మార్గమధ్యంలో అడ్డగింత.. అరెస్టు.. గాయాలు

అటు నుంచి అటే కరీంనగర్‌కు తరలింపు

కరీంనగర్‌లో దీక్షకు దిగిన సంజయ్‌..

ఆయనకు అమిత్‌ షా ఫోన్‌.. పరిస్థితిపై ఆరా

ఆ వెంటనే సిద్దిపేటకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

నేడు ఈసీకి ఫిర్యాదు చేయాలని నిర్ణయం

18.67 లక్షలు స్వాధీనం చేసుకున్నాం

దుబ్బాక ఎన్నికలో పంచడానికే తెచ్చారు

12.80 లక్షలు బీజేపీ కార్యకర్తలు ఎత్తుకెళ్లారు

టీఆర్‌ఎస్‌ నేత ఇంట్లోనూ తనిఖీ చేశాం: సీపీ

సిద్దిపేట సీపీపై చర్యలు తీసుకోవాల్సిందే

పార్లమెంటులో ప్రివిలేజ్‌ మోషన్‌ ఇస్తా

ప్రధాని, రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తా: సంజయ్‌

ఎవరి ఇళ్లలో డబ్బు దొరికినా నాదేనా? రఘునందన్‌


సిద్దిపేట/హైదరాబాద్‌/కరీంనగర్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): సోదాలు.. అరెస్టులు.. లాఠీచార్జిలతో సిద్దిపేట అట్టుడికింది. దాదాపు పది గంటలపాటు తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు బంధువుల ఇంట్లో పోలీసుల సోదాల నుంచి బీజేపీ అధ్యక్షుడు సంజయ్‌ అరెస్టు వరకూ హైడ్రామా చోటు చేసుకుంది. సోమవారం మధ్యాహ్నం.. పోలీస్‌, రెవెన్యూ అధికారులు కలిసి రఘునందన్‌రావు బంధువులు సురభి రాంగోపాల్‌రావు, సురభి అంజన్‌రావు ఇళ్లలో తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో రఘునందన్‌రావు మామ అయిన రాంగోపాల్‌రావు ఇంట్లో ఎటువంటి నగదు లభ్యం కాకపోగా.. సురభి అంజన్‌రావు ఇంట్లో రూ.18.67 లక్షల నగదు లభ్యమైనట్లు ప్రకటించారు. ఆ నగదుతో బయటకు వస్తుండగా.. బీజేపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. పోలీసులే ఇంట్లో డబ్బులు పెట్టి.. లభ్యమైనట్లు చెబుతున్నారంటూ వాగ్వాదానికి దిగారు. మరోవైపు తనిఖీల విషయం తెలుసుకున్న బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు కూడా అక్కడికి చేరుకొని.. నోటీసులివ్వకుండా తనిఖీలు చేయడమేంటని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో ఉద్రిక్తతకు దారితీసింది. పలువురు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు.సంజయ్‌ అరెస్టు.. గాయాలు.. దీక్ష సిద్దిపేట సంఘటన గురించి తెలుసుకున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌.. అక్కడికి వచ్చేందుకు కరీంనగర్‌ నుంచి బయలుదేరారు. సిద్దిపేట శివారులో ఆయనను పోలీసులు అడ్డుకున్నారు.


దీంతో పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో సంజయ్‌ను బలవంతంగా అరెస్టు చేయగా.. ఆయన ప్రతిఘటించారు. ఈ సందర్భంగా మరోసారి సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి చోటు చేసుకుంది. పోలీసుల అరెస్టు సమయంలో సంజయ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. చివరికి, ఆయనను అరెస్టు చేసి కరీంనగర్‌కు తరలించారు. దాంతో, కరీంనగర్‌లోని తన కార్యాలయంలో సోమవారం రాత్రి ఒంటరిగానే సంజయ్‌ దీక్షకు దిగారు. తన కార్యాలయం గది లోపలికి వెళ్లి తాళం వేసుకున్నారు. తనను అక్రమంగా అదుపులోకి తీసుకొని గొంతుపట్టి నెట్టేసిన పోలీసులు, అందుకు కారకులైన సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌పై వెంటనే కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. దుబ్బాకలో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని, బీజేపీ అభ్యర్థి ఇంట్లో, బంధువుల ఇళ్లలో అక్రమంగా డబ్బులు పెట్టి వేధిస్తున్న సంఘటనలపై విచారణ జరిపించాలని డిమాండ్‌ చేశారు. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ భారీగా పోలీసులను మోహరించడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.


సంజయ్‌కు అమిత్‌ షా ఫోన్‌.. ఆరా.. సిద్దిపేటకు కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

సిద్దిపేటలో అరెస్టులు, లాఠీచార్జిలపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఆరా తీశారు. కరీంనగర్‌లో దీక్షలో ఉన్న బండి సంజయ్‌కు ఫోన్‌ చేశారు. సిద్దిపేటలో జరిగిన ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాగా సిద్దిపేట ఘటనపై మంగళవారం చీఫ్‌ ఎలక్టోరల్‌ ఆఫీసర్‌ను కలిసి ఫిర్యాదు చేయాలని బీజేపీ నేతలు నిర్ణయించారు. ఇక, సిద్దిపేటలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో రాత్రి 9 గంటలకు కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌ రెడ్డి హుటాహుటిన అక్కడకు చేరుకున్నారు. సురభి అంజన్‌రావు నివాసానికి వెళ్లి పరిశీలించారు. రఘునందన్‌రావుతో మాట్లాడారు. 


బట్ట కాల్చి మీదేస్తున్నారు: రఘునందన్‌

దేశంలో ఎవరి ఇళ్లలో డబ్బులు దొరికినా తనకు సంబంధించినవేననడం సమంజసం కాదని దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు అన్నారు. తనను వందసార్లు చెక్‌ చేశారని, ఇంకా వందసార్లు చెక్‌ చేసినా తాను ఫెయిర్‌గానే ఉన్నానని తెలిపారు. బట్ట కాల్చి మీదేస్తున్నారని మండిపడ్డారు. హైదరాబాద్‌లోని తన ఇంట్లో కూడా తనిఖీలు చేసుకోవచ్చని సూచించారు. తన కూతురు, అల్లుడు ఇద్దరు డాక్టర్లేనని, వారిని కూడా పనిచేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు. తనిఖీలు చేస్తున్నట్లు పోలీసులు నోటీసు ఇవ్వలేదని, పైగా డబ్బులను బీజేపీ కార్యకర్తలు అపహరించారంటూ  ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనకు సంబంధంలేని ఇంట్లో తనిఖీలు చేశారని, పోటీ చేయకుండా తప్పించేందుకు కుట్ర పన్నారని ఆరోపించారు. 


టీఆర్‌ఎస్‌ పతనం దుబ్బాక నుంచే: సంజయ్‌

టీఆర్‌ఎస్‌ పతనం దుబ్బాక నుంచే మొదలవుతుందని బీజేపీ అఽధ్యక్షుడు బండి సంజయ్‌ హెచ్చరించారు. దుబ్బాకలో వచ్చే ఫలితాలే 2023 ఎన్నికల్లో కూడా పునరావృతం అవుతాయని, బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆయన చెప్పారు. రఘునందన్‌రావు బంధువుల ఇళ్లపై పోలీసులు దాడులను తీవ్రంగా ఖండించారు. పోలీసుల చర్య అప్రజాస్వామికమని,. ఎన్నికల నియమావళికి విరుద్ధమని అన్నారు. పోలీసుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి ఫాంహౌస్‌, ప్రగతి భవన్‌ నుంచి డబ్బులు పంపిస్తూ దుబ్బాకలో పంపిణీ చేస్తుంటే పోలీసులు ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో పోలీసులు రజాకార్ల పాలనను తలపింపజేస్తున్నారని ఆరోపించారు. సిద్దిపేట సీపీపై పార్లమెంట్‌ స్పీకర్‌కు ప్రివిలేజ్‌ నోటీసు ఇస్తున్నానని, కేంద్ర నాయకత్వానికి, రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి ఫిర్యాదు చేస్తానని తెలిపారు. నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కరీంనగరఠ్‌కు వచ్చి సంజయ్‌కి సంఘీభావం తెలిపారు. కాగా, దుబ్బాకలో పోలీసులు గులాబీ చొక్కాలు వేసుకున్నట్లుగా ప్రవర్తిస్తున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని, పోలీసు వాహనాల్లోనే టీఆర్‌ఎస్‌ నేతలు డబ్బులు పంపుతున్నారని ఆరోపించారు. పార్టీ స్టార్‌ క్యాంపెయినర్‌గా ఎన్నికల సంఘం గుర్తింపు కార్డు కూడా ఇచ్చిన సంజయ్‌ని ముందస్తు అరెస్టు చేయడమేంటని ప్రశ్నించారు. కాగా, ఎంపీ అయిన బండి సంజయ్‌ పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సిద్దిపేట సీపీని వెంటనే సస్పెండ్‌ చేయాలని నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌కు దుబ్బాక ఓటమి భయం పట్టుకుందని మాజీ ఎంపీ జి.వివేక్‌ అన్నారు. కాగా, రాష్ట్రంలో పోలీసులు టీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు ఆరోపించారు. 


సంజయ్‌ అరెస్టు అప్రజాస్వామికం: పవన్‌కల్యాణ్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని, దుందుడుకు చర్య అని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ అన్నారు. పోలీసుల చర్యలు పలు సందేహాలకు తావిచ్చేలా ఉన్నాయని, బీజేపీ అభ్యర్థిని, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేయడం గర్హనీయమని పేర్కొన్నారు.


రఘునందన్‌ బంధువే అంజన్‌రావు: సీపీ జోయల్‌ డేవిస్‌

తనిఖీల్లో రూ.18.67లక్షలు లభ్యమైన సురభి అంజన్‌రావు.. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు బంధువని సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ జోయల్‌ డేవిస్‌ తెలిపారు. సోమవారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. పట్టుబడ్డ నగదులో నుంచి రూ.5.87 లక్షలను బీజేపీవారు అపహరించారని, వారిని వీడియోల్లో గుర్తించి కేసులు నమోదు చేస్తామని చెప్పారు. దుబ్బాక ఎన్నికలో ఖర్చు చేయడం కోసమే జితేందర్‌రావు అనే వ్యక్తి తన వద్ద ఈ డబ్బులు పెట్టారని అంజన్‌రావు చెప్పినట్లు సీపీ తెలిపారు. అపహరణకు గురైన డబ్బు మినహా మిగితా నగదును సీజ్‌ చేసినట్లు వివరించారు. రఘునందన్‌రావు సుమారు 250 మందితో కలిసి ఘటనా స్థలం వద్దకు వచ్చారని తెలిపారు. అంజన్‌రావు ఇంటికన్నా ముందు టీఆర్‌ఎ్‌సకు చెందిన సిద్దిపేట మునిసిపల్‌ చైర్మన్‌ రాజనర్సు ఇంట్లో కూడా తనిఖీ చేశామన్నారు. ఫిర్యాదుల ఆధారంగానే ఈ సోదాలు నిర్వహించామన్నారు. అయితే ఆ తరువాత బీజేపీ వారు ఎత్తుకెళ్లిందే రూ.12.80 లక్షలని, తాము సీజ్‌ చేసింది రూ.5.87 లక్షలని పేర్కొంటూ సీపీ ప్రకటన విడుదల చేశారు. 

Updated Date - 2020-10-27T08:44:39+05:30 IST