దుబ్బాక బీజేపీలో కలవరం.. ముఖ్యనేతను సస్పెండ్ చేసిన బండి సంజయ్
ABN , First Publish Date - 2020-10-07T23:53:13+05:30 IST
దుబ్బాక బీజేపీలో కలవరం మొదలైంది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన దుబ్బాక బీజేపీ నాయకుడు తోట కమలాకరరెడ్డిని

హైదరాబాద్: దుబ్బాక బీజేపీలో కలవరం మొదలైంది. పార్టీ ఆదేశాలను ఉల్లంఘించి, క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడిన దుబ్బాక బీజేపీ నాయకుడు తోట కమలాకరరెడ్డిని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సస్పెండ్ చేశారు. దుబ్బాక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుపై కమలాకరరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రఘునందన్‌రావుకు టికెట్ ఇవ్వడం సరికాదని, దీనిపై అధిష్టానం పునరాలోచించాలని ఆయన కోరారు. ఈ వ్యాఖ్యలను బీజేపీ అధిష్టానం సీరియస్‌గా తీసుకుంది. దీంతో పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని కమలాకరరెడ్డిపై బీజేపీ వేటు వేసింది.
దుబ్బాక ఉప ఎన్నికకు బీజేపీ అభ్యర్థిగా రఘునందన్‌రావును ఆ పార్టీ ఖరారు చేసిన విషయం తెలిసిందే. వివిధ రాష్ట్రాల్లో జరగనున్న ఎన్నికలకు సంబంధించి పార్టీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసిన బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్.. దుబ్బాకకు రఘునందన్ పేరునూ ప్రకటించారు. ఇంతకుముందే రఘునందన్ అభ్యర్థిత్వంపై సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్న రాష్ట్ర పార్టీ నాయకత్వం.. అధిష్ఠానానికి ఆయన ఒక్కడి పేరును మాత్రమే సిఫారసు చేసింది.
అయితే ఉపఎన్నిక వేళ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం పార్టీకి తీరని నష్టమని పలుపురు బీజేపీ నేతలు అభిప్రాయపడుతున్నారు. టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొవాలంటే సమిష్టగా పని చేయాలని నేతలు చెబుతున్నారు. భిన్నాభిప్రాయలుంటే చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప.. ఇలాంటి సమయంలో కమలాకరరెడ్డిని సస్పెండ్ చేయడం ఏమిటని కొందరు నేతలు చర్చించుకుంటున్నారు.