దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థి నర్సారెడ్డి?
ABN , First Publish Date - 2020-10-05T01:49:19+05:30 IST
దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ మూడు పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించేదు.
దుబ్బాక: దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపే ధ్యేయంగా టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలో పనిచేస్తున్నాయి. అయితే ఇప్పటివరకు ఈ మూడు పార్టీలు తమ అభ్యర్థులను ఇంకా ప్రకటించేదు. అయితే ఆశావాహులు మాత్రం ఆయా పార్టీలతో జోరుగా మంతనాలు జరుపుతున్నారు. అయితే దుబ్బాక కాంగ్రెస్ అభ్యర్థిగా నర్సారెడ్డి పేరు దాదాపు ఖరారైనట్లు సమాచారం. సోమవారం అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడిగా తూముకుంట నర్సారెడ్డి ఉన్నారు. దుబ్బాక ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలిచితీరాలని, కాంగ్రెస్ నేతలందరూ దుబ్బాకలోనే ఉండాలని తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణికం ఠాగూర్ ఆ పార్టీ నేతలను ఆదేశించారు. దుబ్బాకలో యువనేతలతో టీమ్స్ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు. నేతలు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పుడు కష్టపడితే 2023లో ప్రభుత్వం తమదేనని మాణికం ఠాగూర్ ధీమా వ్యక్తం చేశారు.
దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి అకాల మరణంతో ఉపఎన్నిక అనివార్యమైంది. ఆగస్టు 6న ఆయన చనిపోవడంతో ఆరునెలల్లో కొత్త ఎమ్మెల్యేను ఎన్నుకోవాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఉప ఎన్నిక ఆలస్యమవుతుందని భావించినప్పటికీ ఎన్నికల కమిషన్ మాత్రం కాస్త ముందుగానే స్పందించింది. మంగళవారం నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
టీఆర్‌ఎస్ టిక్కెట్ తనకేనని ‘చెరుకు’ ప్రచారం
మాజీ మంత్రి ముత్యంరెడ్డి తనయుడు అయిన చెరుకు శ్రీనివాస్‌రెడ్డి విస్తృతంగా గ్రామాల్లో ప్రచారం సాగిస్తున్నారు. టీఆర్‌ఎస్ నుంచే పోటీ చేస్తున్నానని చెబుతున్నారు. అయితే టీఆర్‌ఎస్ నుంచి సోలిపేట వారసులా? లేక చెరుకు శ్రీనివాస్ రెడ్డి ఉంటారా అనేది ప్రశ్నార్థకంగా ఉంది. మరో రెండు రోజుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థిత్వం ఖరారు కానున్నట్టు తెలుస్తున్నది.
బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు?
దుబ్బాక ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా సీనియర్ నేత ఎం.రఘునందన్‌రావు పేరు ప్రాథమికంగా ఖరారైందని నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎంపీ ఏపీ జితేందర్‌రెడ్డి ప్రకటించారు. పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటన లాంఛనమే అని చెప్పారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్ శ్రేణులు బీజేపీనే తమ ప్రధాన ప్రత్యర్థిగా భావిస్తున్నారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థిని అధికారికంగా ప్రకటించనప్పటికీ ఆ పార్టీ నియమించిన ఇన్‌చార్జులు మాత్రం తమ అభ్యర్థి రఘునందన్‌రావుగానే ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో సుమారు 80 శాతం గ్రామాల్లో రఘునందన్‌రావు పర్యటించారు.