దుబ్బాక ఉప ఎన్నిక.. ‘తెలంగాణ భవిష్యత్తు’

ABN , First Publish Date - 2020-10-07T07:58:03+05:30 IST

దుబ్బాక ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ తాను బుధవారం నుంచి అక్కడే అందుబాటులో ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దుబ్బాక

దుబ్బాక ఉప ఎన్నిక..  ‘తెలంగాణ భవిష్యత్తు’

నేటి నుంచి దుబ్బాకలోనే: ఉత్తమ్‌


హైదరాబాద్‌/సిద్దిపేట, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దుబ్బాక ఉప ఎన్నిక పూర్తయ్యే వరకూ తాను బుధవారం నుంచి అక్కడే అందుబాటులో ఉంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు. దుబ్బాక ఉప ఎన్నిక కేవలం ఒక అభ్యర్థికి సంబంధించిన ఎన్నిక కాదని, తెలంగాణ భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నిక అని పేర్కొన్నారు. ఈ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ అధికార దుర్వినియోగానికి పాల్పడితే ఎదురించడానికి కాంగ్రెస్‌ దేనికైనా సిద్ధంగా ఉందన్నారు.


మంగళవారం జూమ్‌ యాప్‌ ద్వారా పార్టీ నేతలు, కార్యకర్తలు, మీడియాతో ఉత్తమ్‌ మాట్లాడారు. దుబ్బాక కాంగ్రెస్‌ అభ్యర్థికి ఓట్లు వేయాలని ప్రతి ఒక్కరికీ విజ్ఞప్తి చేస్తున్నానని, కల్వకుంట్ల కుటుంబానికి తగిన గుణపాఠం చెప్పే సమయం వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టే ప్రజా వ్యతిరేక నిర్ణయాలపై రాష్ట్రం అంతటా మౌఖిక ప్రచారం చేయాలని పార్టీ శ్రేణులకు సీఎల్పీ నేత భట్టివిక్రమార్క సూచించారు. దుబ్బాకలో పక్కా ప్రణాళికతో కలిసి వెళదామని, భేషజాలకు వెళ్లకుండా ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా పనిచేయాలని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.


ఈ సమావేశంలో ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, మాజీ మంత్రి గీతారెడ్డి, పొన్నం ప్రభాకర్‌, సిద్దిపేట డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి పాల్గొన్నారు. కాగా, దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ఎన్నారైల సేవలను వినియోగించుకునేందుకు టీ పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ ఎన్నారై కమిటీని ప్రకటించారు. సిద్దిపేట పట్టణవాసి, లండన్‌లో ఉంటున్న గంప వేణుగోపాల్‌ చైర్మన్‌గా వివిధ దేశాలకు చెందిన ఏడుగురితో కమిటీని ఏర్పాటు చేశారు. 


Read more