దుబ్బాకలో ట్రబుల్‌ షూటర్‌

ABN , First Publish Date - 2020-09-17T08:12:30+05:30 IST

దుబ్బాకలో ట్రబుల్‌ షూటర్‌

దుబ్బాకలో ట్రబుల్‌ షూటర్‌

మకాం వేసిన మంత్రి హరీశ్‌ రావు

అభివృద్ధి పనులు, అసంతృప్తులపై దృష్టి

మీకు నేనున్నానంటూ స్థానికులకు భరోసా


దుబ్బాక, సెప్టెంబరు 16: బిహార్‌ ఎన్నికలతోపాటే దుబ్బాక ఉప ఎన్నికకూ నోటిఫికేషన్‌ రానుంది! ఇక్కడ గెలుపు కోసం అన్ని పార్టీలూ ఇప్పటికే పావులు కదుపుతున్నాయి! అందుకే, ట్రబుల్‌ షూటర్‌ రంగంలోకి దిగారు! దుబ్బాకలో మంత్రి హరీశ్‌ రావు మకాం వేశారు. కరోనాను జయించి వచ్చిన ఆయన.. మంగళవారం వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. బుధవారం దుబ్బాకలో వీధి వీధి తిరిగి, సిమెంటు రహదారుల నిర్మాణానికి, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. నియోజక వర్గంలోని 19 గ్రామ పంచాయతీ భవనాలకు బుధవారం పరిపాలన అనుమతులను తెచ్చారు. ప్రతి గ్రామ పంచాయతీ భవనాన్ని సుమారు రూ.20 లక్షలతో నిర్మించేందుకు చర్యలు చేపట్టారు. ‘‘మీకు నేనున్నా. మీ మీద ఈగ వాలనివ్వను. ఇన్నాళ్లూ జరిగిందేదో జరిగింది. ఇకపై అలాంటి పరిస్థితి రానివ్వను’’ అంటూ పరిస్థితులను చక్కదిద్దే కార్యక్రమాన్ని ఉధృతం చేశారు. నిజానికి, ఆదివారం నుంచే గ్రామ సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజా ప్రతినిఽధులతో ఫోన్‌ ద్వారా మాట్లాడిన ఆయన.. ఆయా గ్రామాల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.


అసమ్మతులు, పార్టీ పరిస్థితులపై ఆరా తీశారు. నియోజకవర్గంలోని కిందిస్థాయి కార్యకర్త నుంచి, ఎన్నికల్లో ప్రభావితం చేయగల ప్రముఖులందరితో చర్చిస్తూ, తన వ్యూహాలకు పదును పెడుతున్నారు. గ్రామాల్లో వెల్లువెత్తిన అసంతృప్తులు, అసమ్మతులకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. దుబ్బాక మండలానికి చెందిన నాయకులను స్వయంగా తన వాహనంలో ఎక్కించుకుని వెళ్లి, పార్టీకి నష్టం జరగకుండా చూడాలని బుజ్జగించారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ, తన మీద భరోసా పెట్టండని చెబుతూ అభివృద్ధి భరోసా తనదేనని ప్రజలకు నమ్మకం కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారు. మూడు రకాల వ్యూహాలను రూపొందించి ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో ఆగిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయించేలా పురమాయిస్తునే, అభివృద్ధి ఫలాలను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా వ్యూహ రచన చేస్తున్నారు. కొంతమంది నాయకులను రామాయంపేటలోని ఒక ఫంక్షన్‌ హాల్‌కు పిలిచి, అక్కడే సమావేశమయ్యారు. ఉప ఎన్నికలో గెలుపు బాధ్యతను తానే భుజాన వేసుకుని సాగుతున్నానంటూ కార్యకర్తల్లో జోష్‌ నింపే ప్రయత్నం చేస్తున్నారు. అభ్యర్థిని ఇప్పటి వరకు ప్రకటించకపోయినా.. తానే అభ్యర్థిగా సుడిగాలి పర్యటనలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. వార్డుకు ఇద్దరేసి ఇన్‌చార్జులతో పార్టీ కార్యకలాపాలను ఉధృతం చేశారు.


Updated Date - 2020-09-17T08:12:30+05:30 IST