టెన్షన్‌ పెడుతున్న కరోనా.. నిద్దరోతున్న డ్రగ్‌ కంట్రోల్‌..!

ABN , First Publish Date - 2020-03-24T10:49:47+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది.. పోలీసులు మొదలు, రెవెన్యూ, పురపాలికలు, నగర పాలికలు, వైద్య

టెన్షన్‌ పెడుతున్న కరోనా.. నిద్దరోతున్న డ్రగ్‌ కంట్రోల్‌..!

నియంత్రణపై పట్టింపేలేని సిబ్బంది.. పనిచేసేదొకచోట.. ఉండేది హైదరాబాద్‌లో

‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించడంతో కదిలిన ఉన్నతాధికారులు

జిల్లాలను వీడొద్దని ఆదేశిస్తా: డ్రగ్‌ కంట్రోలర్‌ ప్రీతి మీనా

హైదరాబాద్‌, మార్చి 23 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా కరోనా ఘంటికలు మోగుతున్న నేపథ్యంలో.. రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ నెల 31 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించింది.. పోలీసులు మొదలు, రెవెన్యూ, పురపాలికలు, నగర పాలికలు, వైద్య ఆరోగ్యం తదితర శాఖల సిబ్బంది రోడ్లపైనే ఉంటున్నారు. కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయితే.. ఇలాంటి విపత్క ర పరిస్థితుల్లో చురుకుగా పనిచేయాల్సిన ఔషధ నియంత్రణ మండలి(డ్రగ్‌ కంట్రోల్‌) మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మెడికల్‌ షాపుల్లో మాస్కులు, శానిటైజర్ల ధరలను పెంచి విక్రయిస్తున్నా.. పట్టించుకునే నాథుడు కరువయ్యాడు. అడపాదడపా పోలీసు శాఖ చర్యలు తీసుకుంటున్నా.. డ్రగ్‌ కంట్రోల్‌ విభాగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.


వారు ఉండేది హైదరాబాద్‌లోనే...

ఔషధ నియంత్రణ మండలిలో పనిచేసే ఉన్నతాధికారుల తీరుపై వారి కింద పనిచేసే సిబ్బందే బాహాటంగా విమర్శిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలకు డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్‌, అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్లు విభాగాధిపతులుగా పనిచేస్తున్నారు. కరోనా విజృంభిస్తున్నా.. వారిలో సింహభాగం హైదరాబాద్‌కే పరిమితమయ్యారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లా డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్‌ 8 నెలల క్రితం చార్జి తీసుకున్నా.. ఇప్పటి వరకు భౌతికంగా ఆ జిల్లాలో ఉన్న రోజులను వేళ్లమీదే లెక్కించవచ్చని ఆ విభాగం సిబ్బంది చెబుతున్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ అధికారి హైదరాబాద్‌ ఎల్‌బీనగర్‌లో, ఉమ్మడి ఖమ్మం అధికారి హైదరాబాద్‌ మోతీనగర్‌లో ఉంటూ.. వారానికి ఒకట్రెండుసార్లు మాత్రం తమ కార్యాలయాలకు వెళ్తూ.. ‘మమ’ అనిపించేస్తున్నారు. అదేవిధంగా.. ఉమ్మడి కరీంనగర్‌, నిజామాబాద్‌ జిల్లాల అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్లు మలక్‌పేట్‌లో, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అధికారి మియాపూర్‌లో, ఉమ్మడి మెదక్‌ అసిస్టెంట్‌ డ్రగ్‌ కంట్రోలర్‌ ఎస్‌ఆర్‌నగర్‌లో ఉంటున్నారు.  


రాజధానిలోనూ అంతే..

ఇక హైదరాబాద్‌లో ఉంటున్న అధికారులు కూడా తూతూమంత్రంగా విధులకు హాజరవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నాలుగు డిప్యూటీ డ్రగ్‌ కంట్రోలర్ల పోస్టులు కూడా ఇన్‌చార్జిలతో కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లో ఏడీసీగా ఉన్న అధికారిని నిజామాబాద్‌ డీడీసీగా, మహబూబ్‌నగర్‌ ఏడీసీని వరంగల్‌ డీడీసీగా కొనసాగిస్తున్నారు. ఉన్నతాధికారులు నెలకోసారి సమీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. ఇటీవల సమీక్షల ఊసేలేకుండా పోయింద నే విమర్శలు ఉన్నాయి. అత్యవసర సేవలకు సంబంధించి ఏ విభాగం, శాఖలో లేనంతగా సిబ్బంది కొరత డ్రగ్‌ కంట్రోల్‌ను పట్టి పీడిస్తోంది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సర్కారు గత ఏడాది ఈ విభాగాన్ని ప్రక్షాళన చేసినా.. కొందరు అధికారులు జిల్లాలకు చెందిన సిబ్బందిని ‘వర్క్‌ పర్మిట్‌’ పేరుతో హైదరాబాద్‌కు పిలిపించారు. వారు ఏసీబీ కేసుల్లో చిక్కడం గమనార్హం. 


జిల్లాల్లో ఉండాల్సిందే: ప్రీతి మీనా, డ్రగ్‌ కంట్రోలర్‌

జిల్లాల్లో ఉండాల్సిన అధికారులు హైదరాబాద్‌ లో తిష్టవేయడంపై ఔషధ నియంత్రణ మండలి కంట్రోలర్‌ ప్రీతి మీనాను ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా.. దీనిపై తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‘‘జిల్లాల అధికారులెవరూ అక్కడి హెడ్‌క్వార్టర్లు వీడి వెళ్లకూడదని ఆదేశాలు జారీ చేస్తాం. నిజానికి మాస్కులు, శానిటైజర్లు వంటివి తూనికలు-కొలతల విభాగం, పౌరసరఫరాల శాఖ పరిధిలో ఉండేవి. కరోనా నేపథ్యంలో వాటిని డ్రగ్‌కంట్రోల్‌ పరిధిలోకి తీసుకొస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి వాటి ధరల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నాం.’’ అని వివరించారు.

Read more