వలస కూలీలను అక్కడ దించేసి...

ABN , First Publish Date - 2020-05-18T09:23:07+05:30 IST

త్వరలో సొంతూర్లకు వస్తామన్న ఆనందం వలస కూలీల్లో ఆవిరవుతోంది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మన వలస కూలీలను అక్కడి అధికారులు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నా సరిహద్దుల్లోనే వదిలేస్తున్నారు

వలస కూలీలను అక్కడ దించేసి...

  • కూలీల బాధ్యతను వదిలించుకుంటున్న రాష్ట్రాలు

బోధన్‌, లఖ్‌నవు, మే 17: త్వరలో సొంతూర్లకు వస్తామన్న ఆనందం వలస కూలీల్లో ఆవిరవుతోంది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన మన వలస కూలీలను అక్కడి అధికారులు ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నా సరిహద్దుల్లోనే వదిలేస్తున్నారు. అక్కడ నుంచి స్వస్థలాలకు వెళ్లేందుకు రవాణా లేకపోవడంతో కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడికి వెళ్లాలో తెలియక మూల్లెమూటలతో చెట్ల కింద ఉంటున్నారు. అన్నం, నీళ్లు లేక ఆకలితో అలమటిస్తున్నారు. నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ మండలం సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ ద్వారా నిత్యం వందల సంఖ్యలో వలస కూలీలు మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుంచి ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ ప్రాంతాలకు ప్రత్యేక వాహనాల్లో తరలివస్తున్నారు.  వీరందరినీ సాలూర వద్ద వదిలేసి వెళ్లిపోతుండగా, స్వగ్రామాలకు చేరుకునేందుకు అవస్థలు పడుతున్నారు. మహారాష్ట్రలోని పుణె, ఔరంగాబాద్‌, లాథూర్‌, జాల్నా తదితర పారిశ్రామిక ప్రాంతాలకు వెళ్లిన వలస కూలీలు స్వగ్రామాలకు తిరుగు ప్రయాణమవుతున్నారు. తెలంగాణలోని వరంగల్‌, కరీంనగర్‌, సిరిసిల్లా, హైదరాబాద్‌తోపాటు ఏపీలోని విశాఖపట్టణం, విజయవాడ ప్రాంతాలకు చెందిన కూలీలు స్వగ్రామాలకు చేరుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సాలూర అంతర్రాష్ట్ర చెక్‌పోస్ట్‌ వద్ద మహారాష్ట్ర అధికారులు వారిని వదిలివెళుతుండగా కొందరు కాలినడకన, మరికొందరు ట్రక్కులు, లారీల్లో స్వగ్రామాలకు వెళుతున్నారు. ఇతర రాష్ట్రాల్లోనూ కూలీల కష్టాలు కొనసాగుతున్నాయి. మహారాష్ట్ర నుంచి యూపీకి ట్రక్కులో వచ్చిన మూడు రోజులకు విక్రమ్‌ అనే 60 ఏళ్ల వ్యక్తి మృతిచెందాడు.  పస్తుల కారణంగా అనారోగ్యంతో అతడు మరణించినట్లు చెబుతున్నారు. యూపీలోని మధురలో కాలి బాటన వచ్చే కూలీలకు అనుమతి నిరాకరించారు. దీంతో వారు బారికేడ్లను తోసుకొని జిల్లాలోకి ప్రవేశించారు. 

Updated Date - 2020-05-18T09:23:07+05:30 IST