పవర్‌ హౌస్‌లూ బోర్డుకే!

ABN , First Publish Date - 2020-10-27T09:58:34+05:30 IST

కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులే కాదు.. వాటి పరిధిలోని జల విద్యుత్తు కేంద్రాలు కూడా బోర్డు పరిధిలోకి రానున్నాయి.

పవర్‌ హౌస్‌లూ బోర్డుకే!

జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ..

ప్రాజెక్టుల నిర్వహణపై బోర్డుకే అధికారం

బడ్జెట్‌ను రెండు రాష్ట్రాలు భరించాలి

వర్కింగ్‌ మ్యానువల్స్‌ విధివిధానాలు ఖరారు

కేంద్రానికి ముసాయిదా సమర్పణ


హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): కృష్ణా నదిపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టులే కాదు.. వాటి పరిధిలోని జల విద్యుత్తు కేంద్రాలు కూడా బోర్డు పరిధిలోకి రానున్నాయి. రిజర్వాయర్లు, బ్యారేజీలు, వాటి ప్రధాన కాల్వలు సమస్తం బోర్డు పరిధిలోకి తేవాలని కేంద్రం భావిస్తోంది. ఈ మేరకు గోదావరి, కృష్ణా బోర్డుల అధికారులు వర్కింగ్‌ మాన్యువల్స్‌కు సంబంధించిన ముసాయిదాను శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు సమాచారం. ఈ ముసాయిదాను కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేయాల్సి ఉంది. అనంతరం అమలులోకి తీసుకువచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో తెలంగాణ ప్రభుత్వం తీవ్ర  అభ్యంతరం వ్యక్తం చేస్తున్నందున కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఇప్పటి వరకూ బోర్డులకు ఎలాంటి అధికారాలు లేకపోవడంతో అవి ఇచ్చే ఆదేశాలను, సూచనలను రాష్ట్రాలు పట్టించుకోవడం లేదనే వాదన ఉంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని బోర్డు పరిధిని నిర్ణయించే వర్కింగ్‌ మాన్యువల్స్‌ను ఖరారు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిపై అపెక్స్‌ కౌన్సిల్‌లోనూ చర్చ జరిగింది. అయితే, నీటి కేటాయింపులు పూర్తి స్థాయిలో జరిగే వరకూ బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్స్‌ను ఖరారు చేయవద్దని తెలంగాణ కోరగా.. కేంద్రం అందుకు అంగీకరించలేదు. రాష్ట్ర పునర్విభజన చట్టం-2014లోని సెక్షన్‌-85 ప్రకారం బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్స్‌ను ఖరారు చేసే అధికారం తమకు ఉందని ప్రకటించింది.


వీటిని ఖరారు చేస్తామని అపెక్స్‌ కౌన్సిల్‌ సమావేశంలో కేంద్ర మంత్రే స్వయంగా ప్రకటించారు. అందులో భాగంగానే బోర్డుల వర్కింగ్‌ మాన్యువల్స్‌కు సంబంధించిన ముసాయిదాలపై అధికారులు మూడు, నాలుగు రోజులుగా కసరత్తు చేసి తుదిరూపు ఇచ్చారు. తాజాగా దీనిని కేంద్రానికి పంపించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఇందులో పేర్కొన్న అంశాలు అమలైతే.. ప్రాజెక్టులపై పూర్తి అధికారాలు బోర్డుల చేతుల్లోకి వెళ్లనున్నాయి. ప్రాజెక్టుల్లో పనిచేసే ఇంజనీర్లు, ఇతర ఇబ్బంది కూడా బోర్డు పరిధిలోకి వస్తారు. నిర్వహణకు అవసరమైన నిధులను సమకూర్చే బాధ్యత మాత్రం రెండు రాష్ట్రాలదే.


కృష్ణా బోర్డు పరిధిలో

జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌, పులిచింతల ప్రాజెక్టుల్లోని జల విద్యుత్‌ కేంద్రాలతో పాటు బేసిన్‌లోని ప్రధాన ప్రాజెక్టులన్నీ కృష్ణా బోర్డు పరిధిలోకి రానున్నాయి. జూరాల నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు కృష్ణా నదిపై అన్ని ప్రాజెక్టులను బోర్డు అధికారులే పర్యవేక్షిస్తారు. అన్ని ప్రాజెక్టులపై ఏర్పాటు చేసే టెలిమెట్రీ యంత్రాలు బోర్డు పరిధిలోకి వస్తాయి. ప్రాజెక్టులకు సంబంధించిన నిర్వహణ, నీటి విడుదల, విద్యుత్తు ఉత్పత్తి వంటి సమస్త అధికారాలు బోర్డు పరిధిలోకి రానున్నాయి. వదరలు వచ్చే సమయంలో కూడా బోర్డు అధికారులు ఇచ్చే ఆదేశాలు, సూచనలనే ప్రాజెక్టు ఇంజనీర్లు పాటించాల్సి ఉంటుంది.

Updated Date - 2020-10-27T09:58:34+05:30 IST