అనుమానపు విత్తనాలపై మనమూ దృష్టిసారించాలి- డా. కేశవులు
ABN , First Publish Date - 2020-08-01T21:24:52+05:30 IST
అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో గుర్తుతెలియని విత్తనాల ప్యాకెట్‌లు ప్రజలకు పార్శిల్ రూపంలో వస్తున్నాయని, వీటిపట్ల ఆయా దేశాలు ఆందోళనకు గురవుతున్న నేపధ్యంలో మన దేశంలోనూ ఇలాంటి సంఘటనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఐఎస్‌టిఎ) ఉపాధ్యక్షులు, తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశవులు పేర్కొన్నారు.

హైదరాబాద్: అమెరికాతో పాటు మరికొన్ని దేశాల్లో గుర్తుతెలియని విత్తనాల ప్యాకెట్‌లు ప్రజలకు పార్శిల్ రూపంలో వస్తున్నాయని, వీటిపట్ల ఆయా దేశాలు ఆందోళనకు గురవుతున్న నేపధ్యంలో మన దేశంలోనూ ఇలాంటి సంఘటనలపై దృష్టిసారించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ విత్తన పరీక్ష ప్రమాణాల సంస్థ (ఐఎస్‌టిఎ) ఉపాధ్యక్షులు, తెలంగాణ విత్తన సంస్థల మేనేజింగ్ డైరెక్టర్ డా. కేశవులు పేర్కొన్నారు. ఎక్కడైనా అనుమానం ఉన్నవిత్తన ప్యాకెట్‌లు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. అక్రమ రవాణా ద్వారా వచ్చిన ఈ గుర్తింపులేని విత్తనాల ద్వారా చీడపీడలు వ్యాప్తిచెందడమే కాకుండా విషపు కలుపు మొక్కల విత్తనాలుమన దేశ వ్యవసాయంలోకి ప్రవేశించి, వ్యవసాయ అనుబంధ రంగాలతో పాటు, మానవ ఆరోగ్యం, పర్యావరణంపై కూడా తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు.
ఈ విషయంలో అన్నిరాష్ర్టాల వ్యవసాయశాఖలు, విత్తన సంస్థలు, విత్తన కంపెనీలు, విత్తనోత్పత్తి దారులు, రైతులు, జాతీయ సంస్థలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్ కేశవులు పేర్కొన్నారు. అదే విధంగా సీడ్‌క్యాపిటల్ ఆఫ్‌ఇండియాగా పిలువ బడే హైదరాబాద్ చుట్టుపక్కల అనేక విత్తన కంపెనీలు, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్‌లు నెలకొని ఉండడం వల్ల ఈ రకం గుర్తింపు లేని విత్తనాలువచ్చే అవకాశం ఉందన్నారు. విత్తన కంపెనీలు ఈ విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
మన దేశంలోకి ఆనవాయితీగా కొన్నిపంటల విత్తనాలు ఇతర దేశాల నుంచి ఎగుమతి, దిగుమతి చేసుకోవడం జరుగుతుందన్నారు. పలుదేశాల్లో గుర్తింపులేని అనుమానపు విత్తన ప్యాకెట్‌లు కలకలం రేపుతున్న ఇలాంటి సమయంలో మన దేశంలోనూ ప్రజలు, విత్తనోత్పత్తి దారులు, విత్తన సంస్థలు, విత్తన అసోసియేషన్‌లు, వ్యవసాయశాఖ, రైతులు జాతీయ సంస్థలు అప్రమత్తంగా ఉండి, తగిన ముందు జాగ్రత్తలు తీసుకునేలా భారత ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్తానని ఆయన తెలిపారు.