తహసీల్దార్ల డబుల్‌ రోల్‌

ABN , First Publish Date - 2020-10-03T10:59:48+05:30 IST

కొత్త రెవెన్యూ చట్టం అమలు, వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. భూ పరిపాలనలో సమగ్ర మార్పులకు శ్రీకారం ..

తహసీల్దార్ల డబుల్‌ రోల్‌

ఉదయం రిజిస్ట్రేషన్‌, మధ్యాహ్నం రెవెన్యూ విధులు

తహసిల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లకు రంగం సిద్ధం

దసరా తర్వాత ప్రారంభం కానున్న ప్రక్రియ 

కార్యాలయాలకు చేరుకున్న పరికరాలు


రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల బాధ్యతలను తహసీల్దార్‌ కార్యాలయాలు చేపట్టేందుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయాల్లో ప్రస్తుతం ఉన్న సిబ్బంది, ఫర్నిచర్‌, కంప్యూటర్‌ సామగ్రి తదితర వివరాలను సీసీఏఏ అధికారులు ఇదివరకే తీసుకున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ల కోసం ఒక్కో తహసీల్దార్‌ కార్యాలయానికి రూ.10లక్షలు కేటాయించారు. అయితే ఇప్పటికే 20రకాలు సేవలందిస్తున్న తహసీల్దార్లకు వ్యవసాయ భూముల రిజిస్టే్ట్రషన్‌ బాధ్యత కూడా అప్పగించడంతో వారిపై మరింత పనిభారం పెరగనుంది. ఉదయం రిజిస్ర్టార్‌గా.. మధ్యాహ్నం తహసీల్దార్‌గా డబుల్‌ రోల్‌ చేయాల్సి ఉంటుంది. 


హన్మకొండ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): కొత్త రెవెన్యూ చట్టం అమలు, వీఆర్‌వో వ్యవస్థను రద్దు చేసిన ప్రభుత్వం.. భూ పరిపాలనలో సమగ్ర మార్పులకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా సబ్‌రిజిస్ట్రార్‌ కార్యాలయాల పరిధిని తగ్గించింది. ఇక మీదట ఈ కార్యాలయాల్లో వ్యవసాయేతర భూములను మాత్రమే రిజిస్టర్‌ చేసేలా అధికారాలను కుదించింది. వ్యవసాయ భూముల నమోదు బాధ్యతను తహసీల్దార్లకు అప్పగించింది. దీంతో అన్ని తహసీల్దార్‌ కార్యాలయాలు రిజిస్ట్రేషన్‌ కార్యాలయాలుగా మారబోతున్నాయి. ఈ ఏర్పాట్ల కోసం ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు రాష్ట్రంలో మొత్తం రిజిస్ట్రేషన్ల ప్రక్రియను నిరవధికంగా నిలిపివేసింది. ఆ కార్యాలయాలకు సెలవు ప్రకటించింది.


రెండేళ్ల క్రితం ప్రయోగాత్మకంగా..

రాష్ట్రవ్యాప్తంగా రెండేళ్ల కిందట ప్రయోగాత్మకంగా 30తహసీల్దార్‌ కార్యాలయాల్లో భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించగా, ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఆరు చోట్ల చేపట్టారు. ఇప్పుడు అన్ని చోట్లా ఇది అందుబాటులోకి రానున్నది. 2018 ఏప్రిల్‌లో సీఎం కేసీఆర్‌ కొత్త రిజిస్ట్రేషన్‌ విధానంపై సమీక్షించారు. తహసీల్దార్‌ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్లు ప్రారంభించాలని ఆదేశించారు. రిజిస్ట్రేషన్ల విషయంలో పెద్దగా సమస్యలు రాలేదు. తహసీల్దార్లకు ప్రభుత్వ భూములు, నిషేధిత ఆస్తులు, వివాదాస్పద భూములపై పూర్తి అవగాహన ఉంటుందని, దీంతో రిజిస్ట్రేషన్లు పక్కాగా ఉంటాయని సీఎం భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్లపై శిక్షణ ఇచ్చారు. ఇక ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్‌ పోర్టల్‌, ధరణి పోర్టల్‌ను అనుసంధానం చేయనున్నారు. 


దసరా తర్వాత..

అన్ని తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఈనెల 3 నుంచి వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం మొదట నిర్ణయించింది. అయితే సాంకేతిక కారణాలతో ఆ ప్రక్రియను దసరా తర్వాతే ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని భూముల వివరాలన్నింటినీ ఇప్పటికే ధరణి ప్రాజెక్టు కింద ఆన్‌లైన్‌ చేశారు. వ్యవసాయ భూములకు ఆకుపచ్చ రంగు పట్టాదారు పాస్‌పుస్తకం, వ్యవసాయేతర భూములకు మెరూన్‌ రంగు పట్టా పుస్తకాలు ఇస్తారు. 


ముమ్మరంగా ఏర్పాట్లు

ఉమ్మడి జిల్లాలో 75 తహసీల్దార్‌ కార్యాలయాలు ఉన్నాయి. వరంగల్‌ అర్బన్‌లో 11, వరంగల్‌ రూరల్‌లో 16, జనగామలో 12, మహబూబాబాద్‌లో 16, ములుగులో 9, జయశంకర్‌భూపాలపల్లి జిల్లాలో 11 ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఉన్న 75 తహసీల్దార్‌ కార్యాలయాల్లో ఆరు మినహా 69 ఆఫీస్లులకు ఇప్పటికే కంప్యూటర్లు, స్కానర్లు, ప్రింటర్లు, సీసీ కెమెరాలు వచ్చాయి.  తహసీల్దార్‌ కార్యాలయాల్లో ధరణి సేవల నేపథ్యంలో ప్రింటర్లు, స్కానర్లు ఇప్పటికే పనిచేస్తున్నాయి. ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయంలో ప్రస్తుతం రెండు డెస్క్‌టాప్‌ కంప్యూటర్లు, రెండు సీసీ కెమెరాలు, ప్రింటర్‌ టెలివిజన్‌, వెబ్‌ కెమెరా, ఫింగర్‌ప్రింట్‌ బయోమెట్రిక్‌, స్కానర్‌ను పంపిస్తున్నారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ కార్యకలాపాలు నిర్వహించేందుకు ప్రతీ తహసీల్దార్‌ కార్యాలయాల వద్ద ఒక దస్తా వేజు లేఖరిని నియమించనున్నారు. ఇందుకోసం రాత పరీక్ష నిర్వహించి అర్హులను ఎంపిక చేయనున్నట్టు తెలుస్తోంది.


పెరగనున్న భారం

తహసీల్దార్లకు కొత్తగా రిజిస్ట్రేషన్‌ బాధ్యతలు అప్పగించడంతో వారు ఇటు సబ్‌రిజిస్ట్రార్‌, అటు తహసీల్దార్‌ సేవలను వేర్వేరుగా అందించాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఉదయం సబ్‌రిజిస్ట్రార్‌గా మధ్యాహ్నం నుంచి తహసీల్దార్‌గా విధులు నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు ప్రత్యేక గది అవసరం ఉండడంతో ఇబ్బందులు తప్పేలా లేవు. కొన్ని తహసీల్దార్‌ కార్యాలయాలు శిథిలావస్థలో ఉన్నాయి. మరికొన్ని కార్యాలయాల్లో గదుల కొరత ఉంది. ఇటువంటి కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ల నిర్వహణకు ప్రత్యేక గది కేటాయింపు కష్టంగా మారనుంది. 

Updated Date - 2020-10-03T10:59:48+05:30 IST