పేదల ఆత్మగౌరవానికి ప్రతీక

ABN , First Publish Date - 2020-12-17T08:57:51+05:30 IST

‘‘రూ.130 కోట్ల విలువైన ఆస్తిని మీ చేతుల్లో పెడుతున్నాం.. రేపటి నుంచి ఇది మీది.. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి బాధ్యత మీ అందరిపై

పేదల ఆత్మగౌరవానికి ప్రతీక

సకల హంగులతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు..

దేశంలో ఎక్కడా ఇలాంటి పథకం లేదు’

నాణ్యతలో రాజీ పడకుండా ఇళ్ల నిర్మాణం

సీఎంవోలో ఉన్న లిఫ్టులే ఇక్కడా ఉన్నాయి

130 కోట్ల ఆస్తి మీ చేతుల్లో పెడుతున్నాం

జాగ్రత్తగా చూసుకోవాల్సింది మీరే: కేటీఆర్‌

వనస్థలిపురంలో డబుల్‌ ఇళ్ల ప్రారంభోత్సవం


హైదరాబాద్‌ సిటీ/మన్సూరాబాద్‌,  డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ‘‘రూ.130 కోట్ల విలువైన ఆస్తిని మీ చేతుల్లో పెడుతున్నాం.. రేపటి నుంచి ఇది మీది.. దీన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి బాధ్యత మీ అందరిపై ఉంది’’ అని  మంత్రి కేటీఆర్‌ అన్నారు. వనస్థలిపురంలోని జైభవానీ నగర్‌ రైతుబజార్‌ వద్ద నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల సముదాయాన్ని మంగళవారం ఆయన ప్రారంభించారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి, జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌, ఎల్‌బీనగర్‌ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకేశ్‌కుమార్‌, రంగారెడ్డి కలెక్టర్‌ అమయ్‌కుమార్‌తో కలిసి లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందజేశారు. అక్కడ ఏర్పాటు చేసిన సభలో కేటీఆర్‌ మాట్లాడారు. జై భవానీనగర్‌లోని రెండు ఎకరాల ప్రభుత్వ స్థలంలో పేదలు కొన్నేళ్లుగా గుడిసెలు వేసుకొని, అపరిశుభ్ర వాతావరణంలో నివసిస్తున్నారని, వారందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని వనస్థలిపురం కార్పొరేటర్‌ జిట్టా రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారన్నారు.


దీనిపై వెంటనే స్పందించిన సీఎం కేసీఆర్‌.. ఇక్కడ పేదలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వాలని నిర్ణయించారన్నారు. అనుకున్న విధంగానే 3 బ్లాకులు, 9 అంతస్థుల్లో 324 ఇళ్లను ప్రభుత్వం నిర్మించిందని పేర్కొన్నారు. ప్రైవేట్‌ బిల్డర్లు కట్టిన ఇళ్లు ఎంత నాణ్యంగా ఉంటాయో, అవే ప్రమాణాలతో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు నిర్మించి, సకల సౌకర్యాలతో పేదలకు అందజేస్తున్నామని వెల్లడించారు. రెండు బెడ్‌రూంలు, హాల్‌, కిచెన్‌, రెండు బాత్రూంలతో ఒక్కో ఇల్లు 560 చదరపు అడుగుల్లో ఉంటుందని, రూ.9లక్షల ఖర్చుతో నిర్మాణం చేశామని పేర్కొన్నారు. ఇదే ఇళ్లను ప్రైవేట్‌ అపార్టుమెంట్‌లో కొనుగోలు చేస్తే రూ.50లక్షలకు పైగా ఉంటుందన్నారు.సీఎంవోలో ఏ లిఫ్ట్‌నైతే ఉపయోగిస్తున్నారో.. ఇక్కడ కూడా అదే లిఫ్ట్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు. 72 ఏళ్ల స్వత్రంత భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పథకం అమలు కావడం లేదని.. తెలంగాణ సీఎం కేసీర్‌కు మాత్రమే ఇది సాధ్యమైందని అన్నారు. ముఖ్యమంత్రి ముందు జాగ్రత్తతతో ఆలోచించి ప్రతి బ్లాక్‌ గ్రౌండ్‌ ఫ్లోర్‌లో దుకాణాల సముదాయాన్ని ఏర్పాటు చేయించారని, వాటిని కిరాయికి ఇవ్వడం ద్వారా వచ్చే ఆదాయంతో ఆయా బ్లాకుల్లోని లిఫ్ట్‌ మెయింటెనెన్స్‌, ఇతర పారిశుద్ధ్య, అభివృద్ధి పనులు చేపట్టే వెసులుబాటు ఉంటుందన్నారు. లబ్ధిదారులు ఎవరూ మెయింటెనెన్స్‌ కోసం పైసా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదని అన్నారు. త్వరలోనే లబ్ధిదారులతో కలిసి ఒక సొసైటీ ఏర్పాటు చేయాలని కార్పొరేటర్‌కు కేటీఆర్‌ సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా రూ.9,714 కోట్లతో డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తోందని తెలిపారు. 


కేటీఆర్‌ను కలిసేందుకు దివ్యాంగురాలి పోరాటం

వనస్థలిపురంలో డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి కేటీఆర్‌ను కలిసేందుకు ఓ దివ్యాంగురాలు పోలీసులతో పోరాటం చేసింది. స్థానిక ఎన్టీఆర్‌నగర్‌కు చెందిన దివ్యాంగురాలు ఉమారాణి నాలుగేళ్ల కిందట డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కోసం దరఖాస్తు చేసుకుంది. కేటీఆర్‌ వస్తున్నారని తెలుసుకొని తన ఐదేళ్ల కూతురితో కలిసి వచ్చింది. కేటీఆర్‌ తిరిగి వెళ్తుండగా.. అక్కడ కూర్చున్న వారందరినీ పోలీసులు పక్కకు పంపించే ప్రయత్నం చేశారు.


కానీ.. తాను కేటీఆర్‌ను కలవాలంటూ ఉమారాణి అక్కడే ఉండిపోయింది. మహిళా పోలీసులు పక్కకు తోసేసే ప్రయత్నం చేయడంతో.. ఆమె తీవ్రంగా ప్రతిఘటించింది. తోపులాటలో చంటి పిల్ల గట్టిగా ఏడ్వడంతో గమనించిన మేయర్‌ బొంతు రామ్మోహన్‌.. పోలీసులను నిలువరించారు. ఎట్టకేలకు కేటీఆర్‌ను కలిసిన ఆమె.. తన గోడు వెళ్లబోసుకుంది. ఆమె వద్ద నుంచి దరఖాస్తు తీసుకున్న కేటీఆర్‌ తప్పకుండా ఇల్లు ఇప్పిస్తానని సముదాయించారు. 

Updated Date - 2020-12-17T08:57:51+05:30 IST