ఎన్నికల విధులు మాకొద్దు!

ABN , First Publish Date - 2020-11-26T08:36:53+05:30 IST

జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తోన్న శిక్షణకు దాదాపు 65 శాతం మంది ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు హాజరుకాలేదు.

ఎన్నికల విధులు మాకొద్దు!

 పీఓ, ఏపీఓలు శిక్షణకు 65 శాతం మందే హాజరు

 షోకాజ్‌ నోటీసు ఇచ్చినా మారని తీరు

 మినహాయింపు కోసం క్యూ కడుతోన్న ఉద్యోగులు

హైదరాబాద్‌ సిటీ, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో నిర్వహిస్తోన్న శిక్షణకు దాదాపు 65 శాతం మంది ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు హాజరుకాలేదు. గ్రేటర్‌లోని 150 వార్డుల్లో 9,101 పోలింగ్‌ కేంద్రాలున్నాయి. ఒక్కో పోలింగ్‌ కేంద్రానికి నలుగురు చొప్పున 36 వేలు, కొవిడ్‌ నేపథ్యంలో 25 శాతం రిజర్వ్‌తో కలిపి 45 వేల సిబ్బంది అవసరం. నగరం, శివారు జిల్లాల్లోని పలు విభాగాలకు చెందిన ఉద్యోగులకు ఇప్పటికే ఎన్నికల విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు.


గత రెండు రోజులుగా గ్రేటర్‌ హైదరాబాద్‌కు సంబంధించి సర్కిళ్లలో, జిల్లాల్లోని ఉద్యోగులకు అక్కడే శిక్షణ ఇచ్చారు. ఈ నేపథ్యంలో ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు 25 వేల మంది వరకు శిక్షణకు రావాల్సి ఉండగా.. రెండు రోజుల్లో కలిపి దాదాపు 65 శాతంలోపే హాజరయ్యారని తెలిసింది. మొదటి రోజు గైర్హాజరైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని షోకాజ్‌ నోటిసు ఇచ్చినా.. రెండో రోజు బుధవారం ఆశించిన స్థాయిలో పీఓ, ఏపీఓలు శిక్షణకు రాలేదు. పోలింగ్‌కు మరో ఐదు రోజులు మాత్రమే సమయమున్న నేపథ్యంలో ఏం చేయాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు.



జీహెచ్‌ఎంసీ ఆఫీసుకి ఉద్యోగుల క్యూ

ఎన్నికల విధులకు హాజరు కావాలన్న సందేశం వెళ్లిన అనంతరం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయానికి వివిధ విభాగాల ఉద్యోగులు క్యూ కట్టారు. అనారోగ్యం, ఇతరత్రా కారణాలు చూపి ఎన్నికల విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. కొవిడ్‌-19 బారిన పడిన వారు, ప్రసూతి సెలవులో ఉన్న మహిళా ఉద్యోగులు, దివ్యాంగులకు ఎన్నికల విధుల నుంచి మినహాయింపునిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ వర్గాలు చెబుతున్నాయి.


ఉన్నత స్థాయిలో అనుమతి ఉంటే, ప్రత్యేక పరిస్థితుల్లో కొందరికి మినహాయింపు ఇస్తున్నామన్నారు. వందలాది మంది ఉద్యోగులకు మినహాయింపునిస్తుండడం, చాలా మంది శిక్షణకు హాజరు కాని నేపథ్యంలో పోలింగ్‌ రోజున అవసరమైనంతమంది సిబ్బంది అందుబాటులో ఉంటారా? అన్న ఆందోళన అధికారుల్లో ఉంది. ఈ నేపథ్యంలో అదనపు సిబ్బంది సమీకరణపై అధికారులు దృష్టి సారించారు.


Updated Date - 2020-11-26T08:36:53+05:30 IST