ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల మాయలో పడొద్దు : సీపీ

ABN , First Publish Date - 2020-12-27T04:48:31+05:30 IST

ఆన్‌లైన్‌ ఇన్‌స్టంట్‌ లోన్స్‌ యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ సూచించారు.

ఆన్‌లైన్‌ లోన్‌ యాప్‌ల మాయలో పడొద్దు : సీపీ
వీడియో ఆవిష్కరిస్తున్న సీపీ

వరంగల్‌ అర్బన్‌ క్రైం, డిసెంబర్‌ 26 : ఆన్‌లైన్‌ ఇన్‌స్టంట్‌ లోన్స్‌ యాప్‌లతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వరంగల్‌ ఇన్‌చార్జి పోలీసు కమిషనర్‌ ప్రమోద్‌కుమార్‌ సూచించారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ సైబర్‌క్రైం విభాగం ఆధ్వర్యంలో లోన్‌ యాప్‌లపై రూపొందించిన వాట్సప్‌ వీడియోను శనివారం సీపీ  ఆవిష్కరించి మాట్లాడారు. సులువుగా రుణాలు ఇస్తున్నట్లు సోషల్‌ మీడియాలో వస్తున్న ప్రకటనలను ప్రజలు నమ్మి మోసపోవద్దన్నా రు. సామాన్యులు, వ్యాపారస్థులు ఈ యాప్‌లకు ఆకర్షితులై, అనంతరం యాప్‌ల నిర్వాహకులు పెట్టే ఇబ్బందులతో ప్రాణాలమీదుకు తెచ్చుకుంటున్నారన్నారు. ఆర్‌బీఐ గుర్తింపు పొందిన బ్యాంకులు, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీల నుంచి మాత్రమే రుణాలు పొందాలని సూచించారు.  రుణాల విషయంలో ఎవరైనా వేధింపులకు గురిచేస్తే 100 డయల్‌కు ఫోన్‌చేయాలని సీపీ తెలిపారు.


ఘటన స్థలంలో సదానందం, కమల్‌ మృతదేహాలు

రోడ్డు ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న ఆర్టీసీ బస్సు

ఎల్కతుర్తి, డిసెంబరు 26 : కుటుంబసభ్యులతో కలిసి ఓ శుభకా ర్యానికి బైక్‌పై వెళ్తున్న వారిని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టిన ప్రమాదంలో తండ్రి, కొడుకు మృతి చెందారు. మండలంలోని దామెర గ్రామానికి చెందిన కడారి సదానందం (38) భార్య స్వర్ణలత, కుమారుడు కమల్‌ అలియాస్‌ మిన్ను (7), కుమార్తె చిన్నుతో కలిసి ద్విచక్ర వాహనంపై జిల్లాలోని ధర్మసాగర్‌ మండలం సోమదేవరపల్లి గ్రామానికి బయలుదేరారు. ఈ క్రమం లో కాజీపేట వైపునకు వెళ్తున్న హన్మకొండ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు వీరి బైక్‌ను దామెర శివారులో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో సదానందంతో పాటు, కమల్‌ బస్సు వెనుక టైరు కింద నలిగి అక్కడిక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో స్వర్ణలత, చిన్ను ప్రాణాలతో బయటపడ్డారు. ఇంటి నుంచి బయలు దేరిన కొద్దిసేపటికే జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రీ, కొడుకులు మృతి చెందడంతో గ్రామంలో ఒక్కసారిగా విషాద చాయలు అలుముకున్నాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Updated Date - 2020-12-27T04:48:31+05:30 IST