మా ఊరికి రావద్దు
ABN , First Publish Date - 2020-03-24T09:17:57+05:30 IST
‘‘బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు. దయ చేసి ఎవరూ రావొద్దు. అందరూ ఈ నిబంధన పాటించాల్సిందే’’ కరోనా భయంతో తెలంగాణ వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీలు చేస్తున్న

బయటి వారికి ప్రవేశం లేదు.. పలు పంచాయతీల్లో బోర్డుల ఏర్పాటు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
పాలకుర్తి, మార్చి 23: ‘‘బయటి వ్యక్తులకు ప్రవేశం లేదు. దయ చేసి ఎవరూ రావొద్దు. అందరూ ఈ నిబంధన పాటించాల్సిందే’’ కరోనా భయంతో తెలంగాణ వ్యాప్తంగా పలు గ్రామ పంచాయతీలు చేస్తున్న తీర్మానమిది. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి పంచాయతీ పాలక కార్యవర్గం కర్ఫ్యూ ఉల్లంఘించినవారికి రూ. 500 జరిమానా విధించాలని తీర్మానించింది. గ్రామంలోకి ఎవరూ రాకుంటే వ్యాధి వచ్చే అవకాశమే లేదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సర్పంచ్ దుర్గం జగన్ తెలిపారు. గ్రామంలోకి వచ్చే దారులను బండలు, కర్రలతో మూసివేసి బోర్డు ఏర్పాటు చేశారు. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం తుంగతుర్తి, ఇనుపాముల గ్రామాల సర్పంచ్‌లు కూడా స్వచ్ఛందంగా కఠిన నిబంధనలను అమల్లోకి తెచ్చారు.
తమ గ్రామంలోకి ఇతర గ్రామస్థులను అనుమతించేది లేదని ఆయా గ్రామాల సర్పంచ్‌లు కొండ సరితసైదులు, జాల వెంకటరెడ్డి స్పష్టం చేస్తున్నారు. గ్రామ శివారుల్లో రోడ్డుకు అడ్డంగా కంప వేయించారు. తప్పనిసరి పరిస్థితులో ఇతర గ్రామస్థులు రావాల్సి వస్తే వారి గ్రామ పంచాయితీ కార్యదర్శి నుంచి అనుమతి పత్రం తీసుకురావాలని తెలిపారు. మెదక్ జిల్లా కొల్చారం మండలం వరిగుంతం గ్రామస్తులు ఇతరులెవరూ గ్రామంలోకి రాకుండా రోడ్డుకు అడ్డంగా బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఆదిలాబాద్ జిల్లా -మహారాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న జైనథ్, బేల, తలమడుగు, తాంసి, భీంపూర్, బోథ్ మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు తమ గ్రామానికి రావద్దంటూ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 31 వరకు ఎవరికి ప్రవేశం లేదంటూ హెచ్చరికలు చేస్తున్నారు.
వికారాబాద్ జిల్లా నవాబుపేట మండల పరిధిలోని గంగ్యాడ గ్రామానికి చెందిన 15 మంది 20 రోజుల క్రితం కాశీ, నేపాల్‌కు వెళ్లి సోమవారం స్వగ్రామానికి తిరిగివచ్చారు. వారిని గ్రామస్థులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న మండల అధికార యంత్రాంగం, వైద్య సిబ్బంది గ్రామానికి చేరకుని వారికి పరీక్షలు నిర్వహించి, కరోనా లక్షణాలు లేవని గ్రామస్థులకు నచ్చజెప్పారు. సంగారెడ్డి జిల్లా నాగల్‌గిద్ద మండలం కర్‌సగుత్తి చెక్ పోస్టు తెలంగాణ సరిహద్దులో సోమవారం దుబాయి నుంచి ముంబాయి మీదుగా వస్తున్న 32 మందిని పోలీసులు అడ్డుకున్నారు నిజామాబాద్ జిల్లాకు చెందిన 32 మంది దుబాయ్ నుంచి ముంబైకి చేరుకొని అక్కడి నుంచి ట్రావెల్ బస్సు మాట్లాడుకుని వస్తున్నారు. బస్సును చెక్ పోస్టు వద్ద ఆపి పోలీసులు తనిఖీలు నిర్వహించగా, తమకు ముంబాయి విమానశ్రయంలో కరోనా పరీక్షలు నిర్వహించారని, తమకు వైరస్ సోకలేదని నిర్ధారించారన్నారు. పోలీసులు వారి స్వగ్రామం పిట్లం పంపించేశారు.