బయటికి రావొద్దు.. ప్రజలందరూ సహకరించండి : రాచకొండ సీపీ
ABN , First Publish Date - 2020-03-23T23:12:39+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ చేపట్టిందని..

హైదరాబాద్ : కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వం లాక్ డౌన్ చేపట్టిందని.. ఇందుకు ప్రజలందరూ సహకరించాలని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. రాచకొండ కమిషనరేట్ పరిధిలో ఐదుగురు మించి ప్రజలు రోడ్ల మీదుకు రావడానికి వీల్లేదని, ప్రభుత్వం రవాణా వ్యవస్థ మొత్తం పూర్తిగా రద్దు చేసిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు రాకుండా చెక్ పోస్టులను ఏర్పాటు చేశామని.. మన దేశంలో కరోనా రోగుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోందన్నారు.
బయటికి రావొద్దు..
‘మన రాష్ట్రంలో వ్యాధిని నివారించడానికి ప్రతి ఒక్కరు ముందుకు రావాలి. ఈ రోజు నుంచి ఈ నెల 31 వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 2 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందులో ఒకటి చైతన్యపూరి, మరొకటి నాచారం పీఎస్ లిమిట్స్ లో నమోదయ్యాయి. ఎమర్జెన్సీ సేవలు మినహాయింపు ఇవ్వడం జరిగింది. రద్దీ ప్రాంతాలకు ప్రజలు దూరంగా ఉండాలి. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 వరకు ఎవ్వరూ ఇంట్లో నుంచి బయటకు రావడానికి వీల్లేదు. ప్రభుత్వం సూచించిన పద్ధతులను అందరూ పాటించాలి. సోషల్ మీడియాలో రూమర్లు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. మొత్తం ఇప్పటి వరకు నాలుగు కేసులు నమోదు చేశాం. ప్రజలందరూ రాచకొండ పోలీసులకు సహకరించాలి’ అని సీపీ మీడియాకు వెల్లడించారు.