బంగారు తెలంగాణ అంటే అప్పులు చేయడమేనా?

ABN , First Publish Date - 2020-07-18T07:31:40+05:30 IST

‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ. 70 వేల కోట్ల అప్పు ఉంటే.. మీ పదేళ్ల పాలన పూర్తయ్యేనాటికి రూ. ఆరు లక్షల కోట్ల అప్పు చేస్తారా? బంగారు తెలంగాణ అంటే అప్పుల తెలంగాణగా మార్చడమేనా? ఎన్నో గొప్ప పనులు చేశామని రొమ్ము విరుచుకుని చెప్పే.. తండ్రి, కొడుకు, అల్లుడు

బంగారు తెలంగాణ అంటే అప్పులు చేయడమేనా?

  • పదేళ్లలో 6 లక్షల కోట్ల అప్పులు చేస్తారేమో?: భట్టివిక్రమార్క 
  • ప్రజలు పట్టించుకోకుంటే చిప్పగతే: జగ్గారెడ్డి
  • కరోనా కట్టడిలో సర్కారు విఫలం: విజయశాంతి


హైదరాబాద్‌, జూలై 17(ఆంధ్రజ్యోతి): ‘‘తెలంగాణ ఏర్పాటుకు ముందు రూ. 70 వేల కోట్ల అప్పు ఉంటే.. మీ పదేళ్ల పాలన పూర్తయ్యేనాటికి రూ. ఆరు లక్షల కోట్ల అప్పు చేస్తారా? బంగారు తెలంగాణ అంటే అప్పుల తెలంగాణగా మార్చడమేనా? ఎన్నో గొప్ప పనులు చేశామని రొమ్ము విరుచుకుని చెప్పే.. తండ్రి, కొడుకు, అల్లుడు.. శక్తికి మించిన అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరించాలి’’ అని సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క అన్నారు. రాష్ట్ర అప్పులపైన సత్వరమే శ్వేతపత్రం విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీ మీడియా పాయింట్లో శుక్రవారం పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డితో కలిసి ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి రాష్ట్రానికి ఉన్న అప్పులు రూ. 68,950 కోట్ల మేరకు ఉంటే.. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అది రూ. 2 లక్షల కోట్లకు చేరిందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాటేసరికి కార్పొరేషన్ల రుణాలు రూ. 80 వేల కోట్లతో కలుపుకొని రూ. 3.15 లక్షల కోట్లకు చేరనుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుల పరిస్థితిని చూస్తుంటే.. వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి మొత్తం 6 లక్షల కోట్ల భారం రాష్ట్రంపైన ఈ ప్రభుత్వం పెట్టనుందని ఆరోపించారు.


అంటే రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి నెత్తినా రూ. 1.50 లక్షల రుణ భారం ఉండబోతోందన్నారు. కేంద్రంతో పోలిస్తే రాష్ట్ర తలసరి ఆదాయం రూ. 94 వేలు అధికంగా ఉందని, అయినా అప్పులు ఎందుకు మితిమీరిపోతున్నాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. కరోనా సమయంలో పేదలకు ఎలాంటి వైద్యసదుపాయాలు అందించాలన్నదానిపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం.. కొత్త సచివాలయం కట్టడానికి బయలు దేరిందని విమర్శించారు. సీఎం కేసీఆర్‌ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తూ కొంపలు ముంచుతున్నారని, ప్రజలు పట్టించుకోవాలని, లేదంటే నాలుగేళ్ల తర్వాత అందరికి చిప్పగతి తప్పదని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. విపక్షాలపై విమర్శలు చేస్తున్న  మంత్రులు తలసాని, శ్రీనివా్‌సగౌడ్‌ చెంచాగిరీ మానుకొని ప్రజల్ని కరోనా నుంచి కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని హితవు పలికారు. కరోనా బాధితులను కాపాడంతో ప్రభుత్వం విఫలమైందని టీపీసీసీ ప్రచార కమిటీ చైర్‌పర్సన్‌ విజయశాంతి ఆరోపించారు.  దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కాంగ్రె్‌సను కరోనా కంటే డేంజర్‌ అని మంత్రులు వ్యాఖ్యానించడం సరికాదని మాజీ ఎంపీ వి. హన్మంతరావు అన్నారు. 


స్పీక్‌ అప్‌ తెలంగాణలో పాల్గొనాలి: ఉత్తమ్‌ 

కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాన్ని ప్రశ్నిస్తూ శనివారం సామాజిక మాధ్యమాల్లో తలపెట్టిన ‘స్పీక్‌ అప్‌’ ప్రచార కార్యక్రమంలో పార్టీ నేతలు, కార్యకర్తలందరూ పాల్గొనాలని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి పిలుపునిచ్చారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని, పరీక్షలను పెంచాలని తదితర డిమాండ్లతో స్పీక్‌ అప్‌ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్‌ తెలిపారు. 

Updated Date - 2020-07-18T07:31:40+05:30 IST