సర్కారు చెప్పిందే చేయాలి

ABN , First Publish Date - 2020-02-12T08:40:40+05:30 IST

‘గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. అయినా గ్రామాల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతలు వారు ...

సర్కారు చెప్పిందే  చేయాలి

  • వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండొద్దు
  • గ్రామాలను బాగు చేసే బాధ్యత కలెక్టర్లదే
  • సహాయంగా ఉండటానికే అదనపు కలెక్టర్లు
  • పల్లె ప్రగతి నిరంతరం కొనసాగుతుంది
  • గ్రామాల్లో మార్పు రాకపోతే.. ఊరుకోం
  • అన్నింట్లో ముందు.. అక్షరాస్యతలో వెనుకే
  • 15 రోజుల్లో పంచాయతీరాజ్‌ సమ్మేళనం
  • నెలాఖరులోగా పట్టణ ప్రగతి కార్యక్రమం
  • కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌

అధికార యంత్రాంగం అంతటికీ ఒకే ప్రాధాన్యం ఉండాలి. ఒక టీమ్‌ లాగా పనిచేయాలి. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యంతో విధులు నిర్వర్తించాలి. కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, కంటివెలుగు.. ఇవన్నీ పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే ఆశయం నుంచి పుట్టుకొచ్చినవి. వీటిని కలెక్టర్లు అమలు చేయాల్సిందే. 

సీఎం కేసీఆర్‌


హైదరాబాద్‌, ఫిబ్రవరి 11 (ఆంధ్రజ్యోతి): ‘గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం చేయాల్సిందంతా చేసింది. అయినా గ్రామాల్లో మార్పు రాకపోతే ప్రభుత్వం చూస్తూ ఊరుకోదు. ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చేలా పనిచేయించే బాధ్యతను కలెక్టర్లు తీసుకోవాల్సిందే’ అని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. తాను కూడా ఆకస్మిక పర్యటనలు చేస్తానని, ఏ గ్రామం అనుకున్న విధంగా లేకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం రూపొందించిన పథకాలను అమలు చేయడమే జిల్లా యంత్రాంగం బాధ్యత. అంతే తప్ప.. ఎవరికీ వ్యక్తిగత ప్రాధాన్యాలు ఉండరాదు. విస్తృత మేధోమథనం, అసెంబ్లీలో విస్తృత చర్చ, విషయ నిపుణులతో సంప్రదింపులు జరిపి ప్రభుత్వం వాస్తవిక దృష్టితో చట్టాలు తెచ్చింది. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలనే అధికార యంత్రాంగం అమలు చే యాలి’ అని కేసీఆర్‌ అన్నారు. మంగళవారం ప్రగతిభవన్‌లో జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో సీఎం సమావేశమయ్యారు. మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తోపాటు కీలక  అధికారులు హాజరయ్యారు. ఉదయ 11 నుంచి రాత్రి 10 గంటల వరకు సుదీర్ఘంగా జరిగిన ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రాథమ్యాలు, బాధ్యతలను ముఖ్యమంత్రి వివరించారు. అవి..


వ్యక్తిగత ప్రాథమ్యాలు వద్దు..

కలెక్టర్లు వ్యక్తిగతప్రాథమ్యాలు ఎంచుకోవద్దు. రాష్ట్ర స్థాయి నుంచి కింది స్థాయి వరకు ఒకే ప్రాధాన్యం తో ఒక టీమ్‌లాగా పనిచేయాలి. కేసీఆర్‌ కిట్స్‌, కల్యాణలక్ష్మి, కంటివెలుగు వంటి పథకాలు పేదల కష్టాలు, కన్నీళ్లను దూరం చేయాలనే సమున్నత ఆశయం నుంచి పుట్టుకొచ్చినవే. వీటిని కలెక్టర్లు అమలు చేయాల్సిందే. కలెక్టర్ల వ్యవస్థను బలోపే తం చేసేందుకే వారికి అండగా అడిషనల్‌ కలెక్టర్లను నియమించాం. వారిలో ఒకరిని పూర్తిగా స్థానిక సంస్థలకు కేటాయించాం. జిల్లా స్థాయిలో ప్రభుత్వ ప్రతినిధిగా కలెక్టర్లు వ్యవహరించాలి. కలెక్టర్లపై ప్రభు త్వం ఎంతో నమ్మకం ఉంచింది. అదే సందర్భంలో కలెక్టర్లకు ఎంతో బాధ్యత ఉంది. గతంలో 112 కమిటీలకు కలెక్టర్లు చైర్మన్‌గా వ్యవహరించేవారు. ఇప్పుడు వాటిని 26 విభాగాలుగా మా ర్చాం.


దీనివల్ల పని ఒత్తిడి తగ్గుతుంది. తెలంగాణ రాష్ట్రం అనేక రంగాల్లో అగ్రగామిగా ఉన్నప్పటికీ అక్షరాస్యతలో వెనుకబడింది. తెలంగాణను సంపూర్ణ అక్షరాస్యత కలిగిన రాష్ట్రంగా మార్చేందుకు కలెక్టర్లు ప్రతినబూనాలి. గ్రామాల్లో అందరినీ అక్షరాస్యులుగా మార్చే బాధ్యతను సర్పంచులకు అప్పగించాలి. తమ జిల్లాను పూర్తి అక్షరాస్యత సాధించిన జిల్లాగా మార్చే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలి. ఎస్సీ, ఎస్టీల్లో అక్షరాస్యతను పెంచేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల నుంచే ప్రారంభం కావాలి.


15 రోజుల్లో పంచాయతీరాజ్‌ సమ్మేళనం

రానున్న 15 రోజుల్లో జిల్లా స్థాయిలో ‘పంచాయతీరాజ్‌ సమ్మేళనం’ నిర్వహించాలి. సర్పంచులు, గ్రామ కార్యదర్శులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలను ఆహ్వానించాలి. గ్రామాలను అభివృద్ధి చేసుకునే పద్ధతి వివరించాలి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్‌పర్సన్లను పిలవాలి. 10 రోజుల్లోగా గ్రామాల రూపురేఖలు మార్చాలని చెప్పాలి. మొత్తంగా 25 రోజుల్లో గ్రా మాల పరిస్థితిలో మార్పు రావాలి. ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాం. గ్రామాలను బాగా ఉంచుకునే వారికి అవార్డులు, ప్రోత్సాహకాలు ఉంటాయి. పల్లె ప్రగతి కార్యక్రమం నిరంతరం సాగాలి.


పల్లెల్లో విరివిగా మొక్కలు పెంచాలి. గ్రామాల్లో పరిశుభ్రత వెల్లివిరియాలి. పాడుబడ్డ బావులను, పాత బోరుబావులను పూడ్చాలి. ఈ పనులను గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో కలెక్టర్లు జరిపించాలి. ఆదర్శ పల్లెలు తెలంగాణలోనే ఉన్నాయనే పేరు రావాలి. శ్మశానవాటికలు, ఖనన వాటికలు, డంపింగ్‌ యార్డులు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో పర్యటించినప్పుడు అత్యవసర, అత్యంత ప్రాధాన్యం కలిగిన పనులకు ప్రతి కలెక్టర్‌ వద్ద రూ.కోటి చొప్పున అందుబాటులో ఉంచుతాం. 


గ్రామాభివృద్ధికి అన్ని చర్యలు..

గ్రామాల అభివృద్ధికి అన్ని చర్యలూ తీసుకున్నాం. కొత్తగా జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీల ఏర్పాటు ద్వారా పరిపాలనా విభాగాలు చిన్నవయ్యాయి. ఇది పల్లెలను బాగు చేసుకోవడానికి సానుకూల అంశం. పల్లెల అభివృద్ధికి నెలకు రూ.339 కోట్ల ఆర్థిక సంఘం నిధులను విడుదల చేస్తు న్నాం. అన్ని గ్రామాలకు గ్రామ కార్యదర్శులను నియమించాం. ఎంపీవోలు, ఎంపీడీవోలు, డీఎల్‌పీవో, డీపీవో, జడ్పీ సీఈవో పోస్టులన్నింటినీ భర్తీ చేశాం. పంచాయతీ సిబ్బంది వేతనాలు పెంచాం. గ్రామాల్లో ట్రాక్టర్లను సమకూర్చుకునే అవకాశం కల్పిం చాం. విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకునే అధికారం కలెక్టర్లకు ఇచ్చాం.


డీజిల్‌ వాహనాలు తగ్గించాలి..

సముద్రం ఒడ్డున లేని నగరాల్లో కాలుష్యం పెరిగే అవకాశాలు ఎక్కువ. ఢిల్లీకి అదే సమస్య ఉంది. ఇప్పుడు నివాసయోగ్యమైన నగరాల జాబితాలో ముందున్న హైదరాబాద్‌ను మనం నిర్లక్ష్యం చేస్తే కాలుష్య కాసారం అవుతుంది. కాబట్టి నగరంలో కాలుష్య నివారణకు ఇప్పటి నుంచే ప్రణాళిక రూపొందించి అమ లు చేయాలి. డీజిల్‌ వాహనాలు తగ్గించి, ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్య పెంచాలి. రాష్ట్రంలో మునిసిపల్‌ కార్పొరేషన్లను 6 నుంచి 13కు పెంచుకున్నాం. మునిసిపాలిటీల సంఖ్యను 68 నుంచి 128 చేసుకున్నాం. మొత్తం 141 పట్టణ స్థానిక సంస్థలకు నిధులు కూడా సమకూరుస్తాం. హైదరాబాద్‌ నగరానికి నెలకు రూ.78 కోట్ల చొప్పున, మిగతా పట్టణాలు, నగరాలకు రూ.70 కోట్ల చొప్పున విడుదల చేస్తాం. వీటితోపాటు, స్థానికంగా సమకూరే నిధులతో పట్టణాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. 


మునిసిపల్‌ సమ్మేళనం.. 

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా పట్టణాలు, నగరాల్లో చేపట్టాల్సిన చర్యలపై అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల కలెక్టరేట్లలో మునిసిపల్‌ సమ్మేళనం నిర్వహించాలని సీఎం కేసీఆర్‌ కలెక్టర్లను ఆదేశించారు. ఈ సమ్మేళనానికి మేయర్లు, చైర్‌ పర్సన్లు, కార్పొరేషన్లు, కౌన్సిలర్లు, కమిషనర్లను పిలిచి, శిక్షణ ఇవ్వాలన్నారు. పట్టణ ప్రగతి కార్యక్రమాని కన్నా ముందే అన్ని వార్డుల్లో కమిటీలను నియమించాలన్నారు. బడ్జెట్‌ సమావేశాలకు ముందే అంటే ఈ నెలాఖరులోగా పట్టణ ప్రగతి కార్యక్రమం అమలు చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. పట్టణాలకు రెండు కిలోమీటర్ల దూరంలో వాకింగ్‌కు అనుగుణంగా పార్కులను అభివృద్ధి చేయాలి. వ్యాధులకు కారణమవుతున్న పందుల నివారణలో వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. పందులను పోషిస్తూ జీవించే వారికి ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. పట్టణ ప్రగతి కోసం వార్డుకు ఒకరు చొప్పున అధికారిని ఇన్‌చార్జి నియమించాలి. గుట్టలు, కొండల మీద గుడిసెలు, ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్న వారికి పట్టాలు ఇవ్వాలి.


పట్టణాల్లో రూ. 5లక్షల వరకు విలువ గల పనులను కలెక్టరు అనుమతితో చేపట్టవచ్చు. ఇళ్లపై వేలాడే విద్యుత్‌ తీగలను తొలగించాలి. పట్టణాల్లోనూ జనాభాను బట్టి నర్సరీలు ఏర్పాటు చేయాలి. గ్రామాలు, పట్టణాల్లో వంద శాతం పన్నులు వసూలు చేయాలి. కాగా, పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్లు తట్టలు మోయడం, సైకిళ్లు తొక్కడం, చీపుర్లు పట్టి ఊడ్చడం లాంటి పనులతో చీప్‌ పాపులారిటీ కోసం ప్రయత్నించొద్దు. బడ్జెట్‌ సమావేశాలకు ముందే పట్టణ ప్రగతి కార్యక్రమం నిర్వహించాలి.


కలెక్టర్లకు వైర్‌లెస్‌ సెట్లు..

కలెక్టర్లు ఇతర అధికారులతో సంప్రదింపులకు వీలుగా వైర్‌లెస్‌ సెట్లు సమకూర్చాలని నిర్ణయించాం. గ్రామాల్లో,పట్టణాల్లో చార్జ్‌డ్‌ అమౌంటు(విధిగా చేయాల్సిన ఖర్చు)ను అడిషనల్‌ కలెక్టర్లు నిర్ధారించాలి. డీపీవో, డీఎల్‌పీవో, ఎంపీవో, గ్రామ కార్యదర్శులతో అడిషనల్‌ కలెక్టర్లు నిత్యం సమావేశమవుతూ, ఎప్పటికప్పుడు పరిస్థితి ని పర్యవేక్షిస్తుండాలి. అన్ని పట్టణాల్లో విధిగా పబ్లిక్‌ టాయిలెట్స్‌ నిర్మించాలి. ఇందుకు ప్రభుత్వ కార్యాలయాల స్థలాలను వినియోగించాలి. అన్ని పట్టణాల్లో వెజ్‌/నాన్‌వెజ్‌ మార్కెట్లు నిర్మించాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు విడుదలయ్యే నిధుల వినియోగానికి సంబంధించి ఎప్పటికప్పుడు యుటిలైజేషన్‌ సర్టిఫికెట్లు(యూసీ) పంపడం ప్రాధాన్యతాంశం గా కలెక్టర్లు గుర్తించాలి. ప్రత్యామ్నాయం చూపించకుండా వీధుల వెంట షాపులు నిర్వహించేవారిని, టాక్సీ స్టాండ్లను, ఫుట్‌పాత్‌లపై వ్యాపారులను బలవంతంగా తరలించవద్దు.


సీఎం ఆదేశం... అప్పటికప్పుడే ఉత్తర్వులు

ప్రతీ కలెక్టర్‌ వద్ద అభివృద్ధి పనుల కోసం రూ.కోటి నిధిని అందుబాటులో ఉంచుతామని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉదయం ప్రకటించగానే.. సాయంత్రమే ఆ నిధులను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. ప్రణాళిక శాఖ జీవో జారీ చేసింది. జిల్లాకు రూ.కోటి చొప్పున రూ.33 కోట్ల నిధులను 33 జిల్లాల కలెక్టర్ల కోసం విడుదల చేస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి రామకృష్ణారావు జీవో జారీ చేశారు. 


అటవీ భూవివాదాలను నేనే పరిష్కరిస్తా..

అటవీ, రెవెన్యూ శాఖల మధ్య భూ వివాదాలను పరిష్కరించాలి. పోడు భూముల సమస్య పరిష్కారం కావాలి. ఇందుకోసం ప్రభుత్వం కార్యక్రమం తీసుకుంటుంది. నేనే స్వయంగా ఆయా జిల్లాల్లో పర్యటించి, పోడు భూముల సమస్యకు చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంటాను. అస్తవ్యస్తంగా ఉన్న భూ రికార్డుల నిర్వహణను సరిదిద్దాల్సిన బాధ్యత కలెక్టర్లదే. రెవెన్యూ అజమాయిషీ కలెక్టర్ల చేతిలోనే ఉంటుంది. ఇప్పుడు కలెక్టర్లుగా పని చేస్తున్న యువ ఐఎఎస్‌ అధికారులే రేపు రాష్ర్టానికి కార్యదర్శులుగా, శాఖాధిపతులుగా పనిచేస్తారు. కాబట్టి వీరికి విషయ పరిజ్ఞానం పెరగడం రాష్ట్రానికి మంచిది. మంచి విధానాలు అమలవుతున్న ఇతర దేశాల పర్యటనలకు పంపాలి. ఉత్తమ పద్థతులు, విధానాలను అధ్యయనం చేసి, తెలంగాణలో అమలు చేయాలి’ అని సీఎం కేసీఆర్‌ అన్నారు. కాగా పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, హరితహారం సహా ఇతర అంశాలపై సీనియర్‌ అధికారులు, కలెక్టర్లు తమ అభిప్రాయాలు చెప్పారు. పీసీసీఎఫ్‌ శోభ తెలంగాణకు హరితహారం, అడవుల పునరుద్ధరణపై మాట్లాడారు. మునిసిపల్‌ అడ్మినిరేస్టషన్‌ కమిషనర్‌ సత్యనారాయణ కొత్త మునిసిపల్‌ చట్టంపై వివరణ ఇచ్చారు. సీఎం కేసీఆర్‌ పలు సూచనలు చేశారు.


40 వేల కోట్లతో సంక్షేమం..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక చాలా తక్కువ వ్యవధిలోనే అనేక రంగాల్లో అద్భుత ప్రగతి సాధించాం. సంక్షేమ రంగంలో దేశంలోనే రాష్ట్రం నంబర్‌వన్‌గా ఉంది. తొలినాళ్లలో తీవ్ర విద్యుత్‌ సంక్షోభం ఉండేది. దీనిని అధిగమించాం. మిషన్‌ భగీరథతో ప్రజల తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. భారీ నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణం వల్ల సాగునీటి వసతి ఏర్పడుతున్నది. ఇప్పు డు మన ముందున్న అత్యంత ప్రాధాన్యంతో కూడిన పని.. పల్లెలు, పట్టణాలు పచ్చదనం, పరిశుభ్రతతో వెల్లివిరియడం. అడవుల్లో కలప స్మగ్ల్లింగును అరికట్టడానికి కలెక్టర్లు కఠినంగా వ్యవహరించాలి.


హైదరాబాద్‌, గద్వాల, కరీంనగర్‌, జనగామ, వరంగల్‌ అర్బన్‌, యాదాద్రి, సూర్యాపేట, నారాయణపేట, సంగారెడ్డి జిల్లాల్లో అడవుల శాతం చాలా తక్కువగా ఉంది. అక్కడి కలెక్టర్లు సామాజిక అడవులు పెంచడానికి ఎక్కువ ప్రాధాన్యంఇవ్వాలి. పంచాయతీరాజ్‌ శాఖలో ఖాళీలన్నీ భర్తీ చేశాం. ఇంకా ఎక్కడైనా ఖాళీలు ఏర్పడితే వెంటనే అక్కడ వేరొకరిని నియమించే అధికారం కలెక్టర్లకు ఇస్తున్నాం. పల్లె ప్రగతిలాగే త్వరలోనే పట్టణ ప్రగతి కార్యక్రమం కూడా ప్రభుత్వం ప్రారంభిస్తుంది. మునిసిపల్‌ శాఖలోనూ అన్ని ఖాళీలను భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఖాళీలపై ఆ శాఖ నివేదిక ఇవ్వాలి.

Updated Date - 2020-02-12T08:40:40+05:30 IST