కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి

ABN , First Publish Date - 2020-06-23T09:36:13+05:30 IST

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. కరోనా నివారణలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ

కరోనా పట్ల అప్రమత్తంగా ఉండండి

హైదరాబాద్‌, జూన్‌ 22(ఆంధ్రజ్యోతి): కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో సూచించారు. కరోనా నివారణలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని విమర్శించారు. కొవిడ్‌ చికిత్సను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో టీఆర్‌ఎస్‌ కోవర్టులు ఉన్నారంటూ మాజీ ఎంపీ వి.హన్మంతరావు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌లోని ఆస్పత్రిలో కరోనా చికిత్స తీసుకుంటున్న వీహెచ్‌ సోమవారం ఆడియో సందేశాన్ని విడుదల చేశారు. కొందరు ఢిల్లీలో కూర్చుని పెత్తనం నడిపిస్తూ వాస్తవ పరిస్థితులను అధిష్ఠానానికి చెప్పనివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు సందర్శన కార్యక్రమాన్ని అడ్డుకుని.. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సహా పార్టీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేయడం అప్రజాస్వామికమని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ అన్నారు. కరోనా ఉధృతిపైన అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్‌ను టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఓ ప్రకటనలో కోరారు.


యూఏఈలోని కార్మికులను రప్పించండి: సీఎంకు ఉత్తమ్‌, భట్టి, శశిధర్‌రెడ్డి లేఖ

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లో చిక్కుకుపోయిన తెలంగాణ వలస కార్మికులను చార్టెడ్‌ విమానాల్లో హైదరాబాద్‌కు పంపేందుకుగాను షార్జా ఇండియన్‌ అసోసియేషన్‌కు సాధారణ అనుమతి ఇవ్వాలని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మర్రి శశిధర్‌రెడ్డి, ఎన్నారై సెల్‌ నేత వినోద్‌కుమార్‌ సోమవారం సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌కు చార్టెడ్‌ విమానాలు నడిపేందుకుగాను సాధారణ అనుమతి కోసం ఈ నెల 6న షార్జా ఇండియన్‌ అసోసియేషన్‌ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాసిందని గుర్తు చేశారు. యూఏఈలో చిక్కుకున్న తెలంగాణ కార్మికులు తిరిగి రావడానికి వీలుగా హైదరాబాద్‌కు చార్టెడ్‌ విమానాలు నడిపేందుకు షార్జా ఇండియన్‌ అసోసియేషన్‌కు అనుమతి ఇవ్వాలంటూ సీఎం కేసీఆర్‌ను కోరారు.

Updated Date - 2020-06-23T09:36:13+05:30 IST