బోర్డుల పరిధిలోకి ప్రాజెక్టులు వద్దు
ABN , First Publish Date - 2020-12-11T09:13:23+05:30 IST
సాగునీటి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావద్దని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గత అపెక్స్ సమావేశంలో నిర్ణయించిన
కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటును పరిశీలించండి
కేంద్రాన్ని కోరనున్న ముఖ్యమంత్రి కేసీఆర్
నోట్ సిద్ధం చేస్తున్న సాగునీటి అధికారులు
హైదరాబాద్, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): సాగునీటి ప్రాజెక్టులను బోర్డుల పరిధిలోకి తీసుకురావద్దని కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే గత అపెక్స్ సమావేశంలో నిర్ణయించిన మేరకు కృష్ణా నీటి పంపకాల కోసం కొత్త ట్రైబ్యునల్ ఏర్పాటుకు చర్యలను తీసుకోవాలని కోరనుంది. సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ఈ అంశాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని ఇరిగేషన్ అధికారులు సిద్ధం చేస్తున్నారు. గోదావరి, కృష్ణా బోర్డుల పరిధి, అధికారాలను నిర్ణయించడానికి వీలుగా వర్కింగ్ మ్యాన్యువల్స్‌ను ఖరారు చేయాలని కేంద్రం భావిస్తున్న విషయం తెలిసిందే. ఈ మ్యాన్యువల్స్‌కు సంబంధించి ముసాయిదాను ఇప్పటికే రూపొందించారు.
ఈ డ్రాఫ్ట్ ప్రస్తుతం కేంద్రం పరిశీలనలో ఉంది. ఈ ముసాయిదాను నోటిఫై చేస్తే బోర్డులకు సంబంధించిన వర్కింగ్ మ్యాన్యువల్స్ ఖరారు ప్రక్రియ ప్రారంభమైనట్టుగానే భావించాల్సి ఉంటుంది. ఆ మ్యాన్యువల్స్‌లో పలు అంశాలను చేర్చారు. ముఖ్యంగా బేసిన్‌లో ఉన్న ప్రాజెక్టుల నియంత్రణ బోర్డుల పరిధిలోకి వెళ్లనుంది. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ వంటి కీలకమైన ప్రాజెక్టులన్నీ బోర్డు పరిధిలోకి వెళ్లనున్నాయి. దాంతో ఈ ప్రాజెక్టులకు సంబంధించి నిర్వహణ, నీటి విడుదల వంటి కీలకమైన నిర్ణయాలను బోర్డు అధికారులే పర్యవేక్షించాల్సి ఉంటుంది. అయితే దీనిని తెలంగాణ ప్రభుత్వం మొదటి నుంచీ వ్యతిరేకిస్తోంది.
ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు లేవని, దాంతో వర్కింగ్ మ్యాన్యువల్స్‌ను ఖరారు చేస్తే, సాంకేతికంగా అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. అయినప్పటికీ రాష్ట్ర అభ్యంతరాలను కేంద్రం పట్టించుకోవడం లేదు. ఈ వర్కింగ్ మ్యాన్యువల్స్ ఖరారుకే మొగ్గు చూపుతోంది. ఈ నిర్ణయం కారణంగా ఇప్పటికే ఉన్న ప్రాజెక్టులతో పాటు, నిర్మాణ దశలో ఉన్న ప్రాజెక్టులకు కూడా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో బోర్డుల వర్కింగ్ మ్యాన్యువల్స్‌ను ఇప్పుడే నిర్ణయించవద్దని కేంద్రాన్ని మరోసారి కోరాలని రాష్ట్రం నిర్ణయించింది. ఈ వర్కింగ్ మ్యాన్యువల్స్ ఖరారు ద్వారా ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయనే విషయంలో రాష్ట్రం ఒక నివేదికను రూపొందిస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీ పర్యటనలో సీఎం కేసీఆర్.. కేంద్ర జలశక్తి మంత్రి దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది. అవసరమయితే కేంద్ర మంత్రికి లేఖ ఇవ్వాలని సీఎం భావిస్తున్నట్టు తెలిసింది.
అలాగే కృష్ణా బేసిన్‌కు సంబంధించి కొత్త ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ట్రైబ్యునల్‌ను ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం-2014 ప్రకారం ఏర్పాటు చేశారు. ఈ చట్టం ద్వారా రాష్ట్రానికి సరైన న్యాయం జరగదని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. దీని స్థానంలో జల వివాద చట్టం ప్రకారం ట్రైబ్యునల్‌ను ఏర్పాటు చేయాలని చాలా కాలం నుంచి డిమాండ్ చేస్తోంది.
ఇదే విషయాన్ని అపెక్స్ కౌన్సిల్ సమావేశంలోనూ రాష్ట్రం ప్రస్తావించింది. దీనిని మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తోంది. అలాగే ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలను కూడా సీఎం తన పర్యటనలో ప్రస్తావించే అవకాశం ఉంది.