హరితహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

ABN , First Publish Date - 2020-07-10T10:24:33+05:30 IST

నగరంలో హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అధికారులను హెచ్చరించారు.

హరితహారాన్ని నిర్లక్ష్యం చేయొద్దు

కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు 


 వరంగల్‌ అర్బన్‌ కలెక్టరేట్‌, జూలై 9 : నగరంలో హరితహారాన్ని నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని  కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అధికారులను హెచ్చరించారు. నగరపాలక సంస్థ పరిధిలో మొక్కలు నాటడంలో వెనుకబడి ఉన్నారని అసహనం వ్యక్తం చేశారు. గురువారం కలెక్టరేట్‌లోని మినీ సమావేశ మందిరంలో మునిసిపల్‌ కమిషనర్‌ పమేల సత్పతితో కలిసి ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో 36 లక్షల మొక్కలు నాటాల్సి ఉండగా ఇప్పటి వరకు ఆశించిన ప్రగతి సాధించలేక పోయారని, మొక్కలు నాటే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు.


ఒక్కో వార్డులో కనీసం రోజుకు 500 మొక్కలు నాటినప్పుడే లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు.  పట్టణంలో 25 మంకి ఫుడ్‌కోర్టులను ఏర్పాటు చేయాలని, హెచ్‌ఎండీఏ నుంచి కార్పొరేషన్‌కు కేటాయించిన 2.80 లక్షల మొక్కలను వారం రోజుల్లో తెప్పించాలన్నారు.  ఎస్సార్‌ఎస్పీ కాల్వల ఖాళీ స్థలాలను గుర్తించి ఆ ప్రదేశాల్లో మొక్కలు నాటించాలన్నారు.  


ఉపాధి హామీ అనుసంధాన పనులు పూర్తిచేయాలి 

ఉపాధి హామీతో అనుసంధానం చేసిన ఆర్‌ అండ్‌ బీ, పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌ శాఖల ద్వారా గుర్తించిన పనులను పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హన్మంతు అన్నారు. ఉపాధి హామీ అనుసంధాన పురోగతిపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మండల స్థాయిలో సెల్ఫ్‌ ఆఫ్‌ వర్క్‌లో గుర్తించిన పనులు కాకుండా శాఖకు అవసరమైన పనులు గుర్తించి పనులను పూర్తిచేయాలన్నారు. 


పోతన విజ్ఞాన కేంద్రం పునులు ప్రారంభించాలి 

పోతన విజ్ఞాన కేంద్ర భవన పునరుద్ధరణ పనులకు టెండర్‌ ప్రక్రియ వారం రోజుల్లో పూర్తిచేయాలని పోతన విజ్ఞాన కమిటీ సభ్యులు, అధికారులకు కలెక్టర్‌ సూచించారు. పోతన విజ్ఞాన భవన పునరుద్ధరణ కోసం కోసం రూ. కోటి మంజూరైన నేపథ్యంలో అభివృద్ధి పనులను వెంటనే ప్రారంభించాలన్నారు.  గ్రేటర్‌ కమిషనర్‌ పమేల సత్పతి, సీపీవో జడ్‌ రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-07-10T10:24:33+05:30 IST