మావోయిస్టులకు సహకరించొద్దు
ABN , First Publish Date - 2020-07-18T08:09:07+05:30 IST
మావోయిస్టులకు సహకరించొద్దు

ఆసిఫాబాద్ రూరల్/హైదరాబాద్/వరంగల్ అర్బన్/మణుగూరు, జూలై 17(ఆంధ్రజ్యోతి): మావోయిస్టులకు ప్రజలు సహకరించొద్దని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం ఆయన ఆకస్మికంగా పర్యటించారు. స్థానిక ఏఆర్‌హెడ్ క్వార్టర్‌లో శాంతిభద్రతలపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడారు. కొన్నేళ్లుగా ప్రశాంతంగా ఉన్న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల కదలికలను గుర్తించామన్నారు. బోథ్ మండలానికి చెందిన భాస్కర్ నేతృత్వంలో ఐదుగురు మావోయిస్టులు తిర్యాణి మండలంలో సంచిరిస్తున్నట్లు తమకు సమాచారం వచ్చిందని చెప్పారు. అందువల్లే ప్రత్యేక పోలీసు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారికి సహకరించవద్దని డీజీపీ సూచించారు.
ప్రతిఘటన తప్పదు: మావోయిస్టు పార్టీ
తమ పార్టీ దళాలపై దాడులు ఆపకపోతే టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులపై ప్రతిదాడులు చేస్తామని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అఽధికార ప్రతినిధి జగన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. తమ పార్టీని నిర్మూలించే లక్ష్యంతోనే వరుస దాడులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. కరోనా నేపథ్యంలో తాము స్వీయ నియంత్రణ పాటిస్తుంటే.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమపై దాడులు చేయడాన్ని ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. తెలంగాణలో దాదాపు 50 మంది ప్రజా సంఘాల నాయకులపై అక్రమంగా ఉపా కేసులు పెట్టి భయబ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వరవరరావు, సాయిబాబాను జైలులోనే చంపాలని చూస్తున్నారన్నారు. వివిధ జైళ్లలో ఉన్న 9 మంది ప్రజాసంఘాల నాయకులను తక్షణమే విడుదల చేయాలని, గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.