ఎదురుతిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు..

ABN , First Publish Date - 2020-12-13T07:15:24+05:30 IST

కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై మరీ ముఖ్యంగా పోలీసులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని పోలీస్‌ అధికారుల

ఎదురుతిరిగే పరిస్థితి తెచ్చుకోవద్దు..

రాజకీయ నాయకుల వ్యాఖ్యలపై పోలీస్‌ అధికారుల సంఘం స్పందన 

హైదరాబాద్‌, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): కొందరు రాజకీయ నాయకులు ప్రభుత్వ ఉద్యోగులపై మరీ ముఖ్యంగా పోలీసులపై తమ ప్రతాపం చూపిస్తున్నారని పోలీస్‌ అధికారుల సంఘం ఆరోపించింది. హీరో ఇమేజ్‌ కోసమేకాకుండా తమ వ్యక్తిగత స్వార్థం కోసం నాయకులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి మండిపడ్డారు. రాజకీయ నాయకుల తీరుతో ప్రజాక్షేత్రంలోనే పోలీసులు అసహనానికి గురై ఎదురు తిరిగితే వారి పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు.


ఇటీవల రాజకీయ నాయకులు పోలీస్‌ అధికారులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పోలీస్‌ అధికారుల సంఘం తరపున గోపిరెడ్డి స్పందించారు. నాయకుల వ్యాఖ్యలతో విధి నిర్వహణలో ప్రజల ముందు హోంగార్డు నుంచి ఉన్నతాధికారి వరకు నిస్సహాయులుగా నిలబడుతున్నారన్నారు. రాజకీయ నాయకుల తీరుతో పోలీస్‌ యూనిఫాంకున్న గౌరవం పోతుందన్నారు.


హీరోయిజం కోసం పోలీసులను తక్కువ చేసి మాట్లాడిన రాజకీయ నాయకుడిపై ప్రజలు నిరసన తెలిపే రోజు రావచ్చని, అప్పుడు సదరు నేత ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంటుందని గోపిరెడ్డి తెలిపారు. పోలీసులు తప్పుచేస్తే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చన్నారు. ప్రతిపక్షంలోకి రాగానే రాజకీయ నాయకులు పోలీసులను చూసే విధానం ఎందుకు మారుతోందని  ప్రశ్నించారు. 

పోలీసుల విశ్వసనీయతను పెంచి రాజకీయ నాయకులు ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలనుకుంటే భారత ప్రభుత్వం వర్సెస్‌ ప్రకాష్‌ సింగ్‌ కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్ని అన్ని రాష్ట్రాల్లో  అమలు చేయించాలన్నారు.


Updated Date - 2020-12-13T07:15:24+05:30 IST