పరిమితుల నడుమే దీపావళి!

ABN , First Publish Date - 2020-11-07T06:53:53+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాప్తి, వాతావరణ కాలుష్యం కారణంగా రాష్ట్రంలో పరిమితుల మధ్యనే ప్రజలు దీపావళి జరుపుకొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ

పరిమితుల నడుమే దీపావళి!

ఇప్పటికే నిషేధం విధించిన పలు రాష్ట్రాలు

తెలంగాణలో నిషేఽధిస్తే మతపరమైన సమస్యలు!

ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు 

హైదరాబాద్‌, నవంబరు 6 (ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ వ్యాప్తి, వాతావరణ కాలుష్యం కారణంగా రాష్ట్రంలో పరిమితుల మధ్యనే ప్రజలు దీపావళి జరుపుకొనేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. బహిరంగ ప్రదేశాల్లో, పెద్దగా శబ్దం వచ్చే టపాసులు కాల్చవద్దని ఇప్పటికే అధికారులు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. టపాసుల విక్రయ దుకాణాల ఏర్పాటుకు అనుమతుల్ని కఠినతరం చేశారు. ఢిల్లీ సహా ఇప్పటికే  పలు రాష్ట్రాలు కరోనా, వాతావరణ కాలుష్యం కారణంగా దీపావళి రోజున టపాసులు కాల్చడంపై నిషేధం విధించాయి.


తెలంగాణలో ఇప్పటి వరకు నిషేధంపై ఎలాంటి అధికారిక ఆదేశాలు వెలువడనప్పటికీ వైరస్‌ వ్యాప్తి, కాలుష్యం కారణంగా ప్రజలు జాగ్రత్తలు పాటించాలని అధికారులు పదేపదే సూచిస్తున్నారు. ఇదిలా ఉంటే పండుగలు ఎలా జరుపుకోవాలో ప్రభుత్వం, అధికారులు ఎలా నిర్ణయిస్తారని హిందూ సంస్థలు ప్రశ్నిస్తున్నాయి.


కాలుష్యం పేరుతో టపాసులు కాల్చడాన్ని నిషేధిస్తున్నారని, రోజూ తింటున్న ఆహారంలో రసాయనాలు ఉపయోగిస్తున్నా వాటిని ప్రభుత్వం, అధికారులు ఎందుకు అడ్డుకోలేకపోతున్నారని విశ్వ హిందూ పరిషత్‌ అధికార ప్రతినిధి శశిధర్‌ ప్రశ్నించారు. దీపావళి అంటే టపాసులు కాల్చడం మాత్రమే కాదని పండ్లు, మిఠాయిలు, ఇతరత్రా కుటీర పరిశ్రమలతో ముడిపడి ఉంటుందని, ఆ రంగాలపై ఆధారపడిన వారి ఉపాధిని దెబ్బకొట్టడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు.


ఆచితూచి వ్యవహరిస్తున్న ప్రభుత్వం

బీజేపీ అధికారంలో ఉన్న కర్ణాటకలోనూ దీపావళి రోజున టపాసులు కాల్చడంపై ఆ రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్న విషయంపై ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. బోనాలు, వినాయక చవితి, దసరా పండుగలను ప్రజలు ఆంక్షల నడుమ జరుపుకొనేలా చేశారు.


అచ్చం అదే తరహాలో ప్రజలు దీపావళి వేడుకలను జరుపుకొనేలా, విమర్శలకు తావులేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటోంది. మరో వైపు కొవిడ్‌-19 రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో ప్రజలు కూడా స్వతహాగానే వేడుకలకు దూరంగా ఉంటున్నారు.


Updated Date - 2020-11-07T06:53:53+05:30 IST