సైబర్‌ వారియర్లుగా దివ్యాంగ జవాన్లు

ABN , First Publish Date - 2020-12-11T08:13:46+05:30 IST

‘‘తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి’’ అన్న సినీకవి స్ఫూర్తితో కేంద్ర

సైబర్‌ వారియర్లుగా దివ్యాంగ జవాన్లు

ప్రత్యేక శిక్షణకు ఎన్‌సీడీఈ ఏర్పాటు

ఆటోమొబైల్‌, ఫుడ్‌ప్రాసెసింగ్‌లోనూ శిక్షణ

ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 10 (ఆంధ్రజ్యోతి): ‘‘తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు. నచ్చినట్లుగా నీ తల రాతను నువ్వే రాయాలి’’ అన్న సినీకవి స్ఫూర్తితో కేంద్ర పారామిలటరీ దళం (సీఆర్‌పీఎఫ్‌) యుద్ధరంగంలో దివ్యాంగులైన జవాన్ల సాధికారతకు నడుంబిగించింది. జాతీయ దివ్యాంగుల సాధికార కేంద్రం (ఎన్‌సీడీఈ)ని ఏర్పాటు చేసింది. నక్సల్స్‌, ఉగ్రవాదులు వంటి అంతర్గత శత్రువులతో పోరాడుతూ.. దివ్యాంగులైన జవాన్లకు ఈ కేంద్రంలో ప్రత్యేక శిక్షణ నిస్తారు. యుద్ధరంగంలో వీరులను.. సైబర్‌వారియర్లుగా తీర్చి దిద్దే అధునాతన కోర్సులతోపాటు.. ఐటీ, క్రీడలు, ఆటోమొబైల్‌, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ రంగాలు, స్కిల్‌డెవల్‌పమెంట్‌లో శిక్షణ ఇస్తారు. 


శామీర్‌పేటలోని సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌సలో సువిశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో.. డార్మెటరీలు, వ్యాయామశాల, ఈ-లైబ్రరీ, లాంజ్‌, డైనింగ్‌ హాల్‌, యోగా కేంద్రం, ఇండోర్‌ బ్యాట్మింటన్‌ స్టేడియం, వివిధ క్రీడా ప్రాంగణాలు, కంప్యూటర్‌ ల్యాబ్‌ ఉన్నాయి. ఈ కేంద్రాన్ని గురువారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అంతర్గత శత్రువులతో జరిగిన పోరాటంలో దివ్యాంగులైన వారిని సైబర్‌వారియర్లుగా తీర్చిదిద్దుతామన్నారు.


‘‘ఉగ్రవాదం, తీవ్రవాదంపై పోరుతోపాటు.. అల్లర్లను అదుపు చేయడంలో, ప్రకృతి విపత్తుల సమయంలో సీఆర్పీఎఫ్‌ దళాలు విశేష సేవలందిస్తున్నాయి. ఈ పోరులో అవయవాలు కోల్పోయినవారికి సహకరించేందుకు ప్రధాని, కేంద్ర హోంమంత్రి ఆదేశాలతో ఈ కేంద్రాన్ని ప్రారంభించాం. ఇక్కడ శిక్షణ పొందినవారికి ఉద్యోగాలిచ్చేందుఉ హైదరాబాద్‌లోని ఐటీ సంస్థలు, పలు కంపెనీలు ముందుకు వచ్చాయి. భవిష్యత్‌లో ఈ కేంద్రాన్ని ఐటీ, స్కిల్‌ డెవల్‌పమెంట్‌, క్రీడలకు సంబంధించి సెంటర్‌ ఆఫ్‌ ఎక్సలెన్స్‌గా తీర్చి దిద్దుతాం’’ అని అన్నారు.  


Updated Date - 2020-12-11T08:13:46+05:30 IST