వచ్చే నెల 3నుంచి డివిజన్‌ యాత్ర

ABN , First Publish Date - 2020-09-06T09:53:00+05:30 IST

వచ్చే నెల 3నుంచి డివిజన్‌ యాత్ర

వచ్చే నెల 3నుంచి డివిజన్‌ యాత్ర

మల్కాజిగిరి పరిధిలో చేపడుతున్నా

కేటీఆర్‌కు ఓట్లడిగే హక్కే లేదు: రేవంత్‌


హైదరాబాద్‌, సెప్టెంబరు 5(ఆంధ్రజ్యోతి): టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విస్మరించిన హామీలపై ప్రజలను చైతన్య పరిచేందుకు వచ్చే నెల 3 నుంచి డివిజన్‌ యాత్ర చేపట్టనున్నట్లు ఎంపీ రేవంత్‌రెడ్డి ప్రకటించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ను ఇస్తాంబుల్‌గా, హుసేన్‌సాగర్‌ నీళ్లను కొబ్బరి నీళ్లలాగా చేస్తామని, లక్ష బెడ్‌రూం ఇళ్లు కట్టిస్తామని అందమైన అబద్ధాలు చెప్పి గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 99 డివిజన్లను గెలుచుకున్న టీఆర్‌ఎస్‌..  ఐదేళ్లలో ఒక్క పని కూడా చేయలేదని విమర్శించారు. సచివాలయం కూల్చుడు, ప్రగతి భవన్‌ కట్టుడు తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. గాంధీభవన్‌లో శనివారం కాంగ్రెస్‌ నేతలు పొన్నం ప్రభాకర్‌, కుసుమకుమార్‌తో కలిసి రేవంత్‌ మాట్లాడారు. మునిసిపల్‌ మంత్రిగా విఫలమైన కేటీఆర్‌కు ఓట్లడిగే హక్కే లేదని అన్నారు. జెట్టి కుసుమ్‌కుమార్‌  మాట్లాడుతూ అయ్యప్ప సొసైటీలో ప్రజలను భయపెట్టి ఓట్లు దండుకున్నారని ఆరోపించారు. బస్తీ దవాఖానాలు ఇన్నేళ్లు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. వీటన్నింటినీ రానున్న ఎన్నికల్లో ఎత్తి చూపుతామన్నారు. పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. 


బడి పంతుళ్లకు బతుకు లేదు

బంగారు తెలంగాణలో బడి పంతుళ్లకు బతుకు లేకుండా పోయిందని రేవంత్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల దినోత్సవం వారి పాలిట బ్లాక్‌డేగా మారిందన్నారు. లేఅవుట్ల క్రమబద్ధీకరణ(ఎల్‌ఆర్‌ఎ్‌స)కు ప్రభుత్వం గత నెల 31న ఇచ్చిన ఉత్తర్వులు లోపభూయిష్టంగా ఉన్నాయని ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్‌రెడ్డి ఆరోపించారు. కాగా.. దుబ్బాక, శాసనమండలి, జీహెచ్‌ఎంసీ, ఖమ్మం, వరంగల్‌ కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశాన్ని ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తామని కుసుమ్‌కుమార్‌ తెలిపారు.

Updated Date - 2020-09-06T09:53:00+05:30 IST