ఇక జిల్లాల వారీగా సమీక్షలు

ABN , First Publish Date - 2020-07-27T08:06:00+05:30 IST

ఇప్పటి దాకా హైదరాబాద్‌ కేంద్రంగా సమీక్షలు చేసిన మంత్రి ఈటల రాజేందర్‌.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లాల బాట పట్టారు. వైద్యులు, సిబ్బందిలో స్ఫూర్తి

ఇక జిల్లాల వారీగా సమీక్షలు

  • వైద్య సిబ్బందిలో స్ఫూర్తి నింపేందుకే..
  • సీఎం కేసీఆర్‌ ఆదేశం.. రంగంలోకి ఈటల

హైదరాబాద్‌, జూలై 26 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి దాకా హైదరాబాద్‌ కేంద్రంగా సమీక్షలు చేసిన మంత్రి ఈటల రాజేందర్‌.. సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో జిల్లాల బాట పట్టారు. వైద్యులు, సిబ్బందిలో స్ఫూర్తి నింపడమే లక్ష్యంగా సమీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆదివారం కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాల్లో ఆయన పర్యటించారు. కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న వైద్యులతో నేరుగా సమావేశమయ్యారు. అదే సమయంలో కొవిడ్‌ ఆస్పత్రుల్లో సదుపాయాలను పరిశీలించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. జిల్లాల్లోనూ పాజిటివ్‌ల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దీంతో జిల్లా ఆస్పత్రులు, ఏరియా, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లలో కొవిడ్‌ చికిత్స అందిస్తున్నారు.


క్షేత్రస్థాయి పర్యటనల వల్ల వైద్య సిబ్బందికి మనోధైర్యం కలిగించడంతో పాటు అక్కడి పరిస్థితులపై అవగాహన కలుగుతుందన్న భావనలో మంత్రి ఉన్నారు. గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా అధిక సంఖ్యలో డెంగీ కేసులు వచ్చిన సమయంలోనూ మంత్రి ఈటల ఇలాగే క్షేత్రస్థాయి పర్యటనలు చేపట్టారు. కామారెడ్డి, నిజామాబాద్‌ జిల్లాలో ఆదివారం పర్యటించిన మంత్రి ఏజెన్సీల్లో పనిచేసే వైద్యులు, సిబ్బందికి సంబంధించిన పెండింగ్‌ బకాయిలను నెలలోగా చెల్లిస్తామని హామీ ఇచ్చారు.

Updated Date - 2020-07-27T08:06:00+05:30 IST