కార్యాలయం కళకళ
ABN , First Publish Date - 2020-07-19T08:19:13+05:30 IST
జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం శనివారం క్రయవిక్రయ దారులతో సందడిగా..

- ఒక్కరోజే 200కు పైగా రిజిస్ట్రేషన్లు
- సోమవారం నుంచి డాక్యుమెంట్ రైటర్ల లాక్‌డౌన్ ఫలితం
హన్మకొండ టౌన్, జూలై 18: జిల్లా రిజిస్ట్రేషన్ కార్యాలయం శనివారం క్రయవిక్రయ దారులతో సందడిగా మారింది. ఒక్కరోజే 200కు పైగా రిజిస్ట్రేషన్లు జరిగాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా డాక్యుమెంట్ రైటర్స్ స్వచ్ఛందంగా లాక్‌డౌన్ ప్రకటించుకున్నారు. సోమవారం నుంచి అగస్టు 2వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లకు సంబంధించి దస్తావేజులు తయారు చేయకూడదని నిర్ణయించుకున్నారు. దీంతో క్రయవిక్రయ దారులు శనివారం పెద్ద ఎత్తున ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఉదయం నుంచి రాత్రి 10గంటల వరకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ సాగింది. ఇద్దరు సబ్ రిజిస్ట్రార్లు ఏమాత్రం రెస్టు తీసుకోకుండా విధులు నిర్వహించారు. దాదాపు వంద డాక్యుమెంట్లు రిటన్ పంపినట్లు శాఖ అధికారులు తెలిపారు. డాక్యుమెంట్లు వస్తే సోమవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేస్తామని శాఖ అధికారులు ప్రకటించినప్పటికీ క్రయవిక్రయ దారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఆస్తుల రిజిస్ట్రేషన్లు చేసుకునేందుకు పోటీపడ్డారు. పైరవీలు చేసుకుని మరీ రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తి చేసుకుని వెళ్లారు.
కరోనా జాగ్రత్తలు గాలికి..
కార్యాలయంలో కరోనా వైరస్ నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టిన దాఖలాలు కనిపించలేదు. పెద్ద ఎత్తున తరలివచ్చిన క్రయవిక్రయ దారులతో ఆవరణ సందడిగా మారింది. భౌతిక దూరం పాటించాలనే నిబంధనలు గాలికి వదిలేశారు. సానిటైజర్లు అందుబాటులో పెట్టినట్లు కనిపించలేదు. ఆస్తుల రిజిస్ట్రేషన్ల కోసం వచ్చిన వారు నిబంధనలు పాటించకపోవగా శాఖ అధికారులు సైతం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విశేషం. అధికారులకు ఆదాయంపై ఉన్న శ్రద్ధ కార్యాలయానికి వచ్చిన వారి ఆరోగ్యంపై లేకపోవడం పలువిమర్శలకు తావిచ్చినట్లు అయింది.