రేపటి నుంచి రూ.1500 పంపిణీ

ABN , First Publish Date - 2020-04-14T09:46:46+05:30 IST

కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 నగదు పంపిణీ బుధవారం నుంచి జరగనుంది. ఈ మేరకు నగదు బదిలీ ప్రక్రియ సోమవారమే మొదలైంది.

రేపటి నుంచి రూ.1500 పంపిణీ

  • 74 లక్షల మంది బ్యాంకు అకౌంట్లు క్లియర్‌
  • ఎస్‌బీఐ, ఎన్‌పీసీఐల ద్వారా నగదు బదిలీ
  • రూ.1112 కోట్లు సర్దుబాటు చేసిన ప్రభుత్వం
  • బ్యాంకు అకౌంట్లు లేనివారికి రెండో విడతలో
  • అకౌంట్లలోకి నేడే డబ్బు జమ: మంత్రి కేటీఆర్‌


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 13 (ఆంధ్రజ్యోతి): కరోనా విపత్తు నేపథ్యంలో రాష్ట్రంలోని తెల్ల రేషన్‌ కార్డుదారులకు ప్రభుత్వం ప్రకటించిన రూ.1500 నగదు పంపిణీ బుధవారం నుంచి జరగనుంది. ఈ మేరకు నగదు బదిలీ ప్రక్రియ సోమవారమే మొదలైంది. మొదటి విడతగా రూ.1112 కోట్లు సర్దుబాటు చేసిన ప్రభుత్వం.. ఈ నిధులను స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాతాలో జమ చేసింది. అక్కడి నుంచి ఎన్‌పీసీఐ (నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా) ‘ఆధార్‌ పేమెంట్‌ బ్రిడ్జ్‌ సిస్టమ్‌’ ద్వారా లబ్ధిదారుల ఖాతాల్లోకి డబ్బులు జమ చేస్తున్నారు. మంగళవారం అంబేద్కర్‌ జయంతి సందర్భంగా బ్యాంకులకు సెలవు కావడంతో.. బుధవారం నుంచి చెల్లింపులు చేయనున్నారు. ఏటీఎం కార్డులు ఉన్నవారు మాత్రం మెసేజ్‌ వచ్చిన వెంటనే డబ్బులు తీసుకోవచ్చు. కరోనా విపత్తు కింద రాష్ట్రంలోని 87.59 లక్షల మంది తెల్లరేషన్‌ కార్డుదారులకు ఒక్కో కార్డుపై రూ.1500 చొప్పున నగదు పంపిణీ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే నిధుల సర్దుబాటు, పంపిణీ ప్రక్రియపై కొద్దిరోజులుగా తర్జనభర్జన జరిగింది. చివరకు సోమవారం నాటికి వ్యవహారం కొలిక్కివచ్చింది. ఎన్‌పీసీఐ వద్ద ఆధార్‌తో మ్యాపింగ్‌ చేసిన బ్యాంకు అకౌంట్ల వివరాలను రాష్ట్ర పౌరసరఫరాల శాఖ తెప్పించుకుంది. ఆ డేటాతో సివిల్‌ సప్లైస్‌ వద్ద ఉన్న డేటాను స్ర్కీనింగ్‌ చేశారు. తెల్లరేషన్‌కార్డుదారుకు బ్యాంకు అకౌంట్‌ ఉంటే ఆ వివరాలు, అకౌంట్‌ లేకుంటే కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరి బ్యాంకు అకౌంట్‌ వివరాలను జోడించి ప్యూరిఫై చేసిన డేటాను ఎస్‌బీఐకి పంపించారు. అక్కడినుంచి ఎన్‌పీసీఐకి పంపారు. ఎన్‌పీసీఐ నుంచి నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు నగదు బదిలీ చేశారు.


అకౌంట్లలోకి నేడే డబ్బు జమ: కేటీఆర్‌

రాష్ట్రంలోని 87.59 లక్షల తెల్లకార్డు హోల్డర్లకుగాను 74,07,486 మంది బ్యాంకు ఖాతాలు క్లియర్‌గా ఉన్నాయి. ఒకవేళ ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు అకౌంట్లు ఆధార్‌ నంబర్‌తో మ్యాపింగ్‌ అయి ఉంటే... ‘‘యునిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌ సిస్టమ్‌’’ ద్వారా ఆధార్‌ నంబర్‌కు మ్యాపింగ్‌ అయి ఉన్న అకౌంట్లలో చివరి ట్రాన్సాక్షన్‌ ఏ అకౌంట్‌తో చేస్తే ఆ అకౌంట్‌కు డబ్బులు వెళ్లిపోతాయి.  లబ్ధిదారుల అకౌంట్లలోకి మంగళవారమే నగదు జమ అవుతుందని మంత్రి కేటీఆర్‌ ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే రేషన్‌కార్డుతో ఆధార్‌ సీడింగ్‌ అయి ఉండి, బ్యాంకు అకౌంట్‌ నంబర్‌ లేనివారికి రెండో విడతలో నగదు బదిలీ చేయాలని పౌరసరఫరాల శాఖ నిర్ణయించింది.

Updated Date - 2020-04-14T09:46:46+05:30 IST