రేపటి నుంచి బియ్యం పంపిణీ

ABN , First Publish Date - 2020-03-25T09:01:28+05:30 IST

లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన తెల్లకార్డుదారులకు బియ్యం పంపిణీ గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు.

రేపటి నుంచి బియ్యం పంపిణీ

కుటుంబానికి 1500 నేరుగా ఖాతాలో 

అధికారులతో సీఎం సుదీర్ఘ సమీక్ష 

హైదరాబాద్‌, మార్చి 24(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం ప్రకటించిన తెల్లకార్డుదారులకు బియ్యం పంపిణీ గురువారం నుంచి ప్రారంభించనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలిపారు. కుటుంబంలో ఒక్కో సభ్యుడికి 12 కిలోల చొప్పున పంపిణీ చేస్తామని సీఎం ఇప్పటికే ప్రకటించారు. కార్డు కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి రూ.1500 చొప్పున అందిస్తామని కూడా పేర్కొన్నారు. ఈ డబ్బును వారి బ్యాంకు ఖాతాలో వేస్తామని మంగళవారం మీడియా సమావేశంలో ప్రకటించారు. ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులపై తీవ్ర ఒత్తిడి ఉందని, ప్రజలు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘రెండు చేతులు జోడించి మీ బిడ్డగా దండం పెట్టి చెబుతున్నా.. ఇంటికే పరిమితమవ్వండి’’ అని కోరారు. ప్రభుత్వ విజ్ఞప్తిని ప్రజలు పాటించకపోవడంతో బయటికి వచ్చినవారికి రష్యా ఐదేళ్లు జైలుశిక్ష ప్రకటించిందన్న విషయాన్ని కేసీఆర్‌ గుర్తుచేశారు. కాగా, రాష్ట్రంలో పరిస్థితిని సమీక్షించేందుకు కేసీఆర్‌ మంగళవారం ఉన్నతాధికారులతో అత్యవసర సమావేశం నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో ప్రారంభమైన ఈ సమావేశం మూడు గంటలు సాగింది. కరోనా వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలు, లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ఉత్పన్నమైన పరిస్థితిని ఈ భేటీలో చర్చించారు.

Updated Date - 2020-03-25T09:01:28+05:30 IST