కోటి మాస్క్‌లు పంపిణీ

ABN , First Publish Date - 2020-04-14T10:03:59+05:30 IST

బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మాస్క్‌లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. తొలిదశలో 50లక్షలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.

కోటి మాస్క్‌లు పంపిణీ

  • అర్ధరాత్రి ఫోన్‌ చేసినా రక్తదానానికి సిద్ధం: బండి సంజయ్‌ 

హైదరాబాద్‌/మల్కాజిగిరి, ఏప్రిల్‌ 13(ఆంధ్రజ్యోతి): బీజేపీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా కోటి మాస్క్‌లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ వెల్లడించారు. తొలిదశలో 50లక్షలు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే 15 లక్షల మాస్క్‌లకు సంబంధించిన మెటీరియల్‌ వచ్చిందని తెలిపారు. పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో స్థానికంగా స్వయం సహాయక సంఘాలతో  మాస్క్‌లు కుట్టించి పంపిణీ చేస్తామన్నారు. సోమవారం రాష్ట్ర పార్టీ కార్యాలయంలో మాస్క్‌ల తయారీ విధానాన్ని పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఒక్కో జిల్లాలో 50వేల మాస్క్‌లు తయారు చేయాలని లక్ష్యంగా నిర్దేశించామని చెప్పారు. అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా మంగళవారం ప్రతీ బీజేపీ నాయకుడు, కార్యకర్త తమ ఇళ్లల్లో సాధ్యమైనన్ని మాస్క్‌లు తయారు చేసి ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. పార్టీ యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా రక్తదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా పార్టీ తరఫున రక్తదానం చేసేవారి ఫోన్‌ నెంబర్లు, వివరాలను స్థానిక వైద్యులకు అందిస్తున్నట్లు చెప్పారు. అర్ధరాత్రి ఫోన్‌ చేసినా తక్షణం వారు రక్తదానం చేస్తారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో 5 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్‌ మల్కాజిగిరిలో పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనూ పాల్గొన్న ఆయన.. ప్రధాని మోదీ కిట్‌లను, నిత్యావసర సరుకులను వలస కార్మికులు, పేదలకు పంపిణీ చేశారు.

Updated Date - 2020-04-14T10:03:59+05:30 IST