భూ పరిహారంలో వివక్ష

ABN , First Publish Date - 2020-03-02T10:03:50+05:30 IST

ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంబిస్తుండటంపై ఉదండాపూర్‌ రిజర్వాయర్‌

భూ పరిహారంలో వివక్ష

అన్ని గ్రామాలకు ఒకేలా పరిహారం ఇవ్వాలి

ఎకరాకు రూ.12.5 లక్షలు అందరికీ చెల్లించాలి

ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితుల డిమాండ్‌

నిర్మాణ పనుల అడ్డగింత.. 5 రోజులుగా దీక్షలు

మహబూబ్‌నగర్‌, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): ప్రాజెక్టుల కింద భూములు కోల్పోయిన రైతులకు పరిహారం విషయంలో ప్రభుత్వం ద్వంద్వ విధానాలు అవలంబిస్తుండటంపై ఉదండాపూర్‌ రిజర్వాయర్‌ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఒకే ప్రాజెక్టులో, ఒకే రిజర్వాయర్‌ కింద ఒక గ్రామ భూ నిర్వాసితులకు ఒక ధర, మరో గ్రామం వారికి మరో ధర చెల్లిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా జడ్చర్ల మండలం ఉదండాపూర్‌ వద్ద 15.91 టీఎంసీల సామర్థ్యంతో నిర్మిస్తున్న రిజర్వాయర్‌కు సేకరించిన భూమి విషయంలో ఈ సమస్య తలెత్తింది. భూ నిర్వాసితుల్లో కొందరికి రూ.12.50 లక్షల పరిహారం చెల్లిస్తుండగా, మరికొందరికి రూ.6.50 లక్షలు చెల్లిస్తున్నారు. ఈ రిజర్వాయర్‌ నిర్మాణానికిగాను ఉదండాపూర్‌, వల్లూరు, పోలేపల్లి, కిష్టారం, తీగలపల్లి, ఖానాపూర్‌, కారూరు, సిద్దోటం గ్రామాల పరిధిలోని 5,107 ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు.


ఈ భూమితో పాటు వల్లూరు, ఉదండాపూర్‌ గ్రామాలు, తుమ్మలకుంటతండా, రాగిడిబట్టితండ, చిన్నగుట్టతండా, మాటుబండతండా, గొల్లోనిదొడ్డితండ, సాధుగుడిసెలు ముంపునకు గురికానున్నాయి. మొత్తంగా రెండు గ్రామాలు, ఏడు గిరిజన తండాల ప్రజలు ముంపు బాధితులు కానున్నారు. కాగా, ఉదండాపూర్‌, వల్లూరు, ఖానాపూర్‌ గ్రామాల్లో నీటి వసతిలేని భూములకు ఎకరాకు రూ.5.50 లక్షలు, నీటి వసతి ఉన్న భూములకు ఎకరాకు రూ.6.50 లక్షల పరిహారమిచ్చేందుకు ఆమోదం తీసుకున్నారు.


ధరలు పెరగడంతో..

రిజర్వాయర్‌ నిర్మించే ప్రాంతంలో ఇప్పటికే చుట్టూ పరిశ్రమలు ఏర్పాటు కావడంతోపాటు ఓవైపు పోలేపల్లి సెజ్‌, మరోవైపు జాతీయ రహదారి, డబుల్‌ రైల్వేలైన్‌, ఇంకోవైపు జడ్చర్ల పట్టణం ఉండడంతో ఈ ప్రాంతంలో ఇప్పటికే రియల్‌ఎస్టేట్‌ వ్యాపారం విస్తరించింది. సాగు భూములకు ధర భారీగా పెరిగింది. దీంతో పరిహారం పెంచాలంటూ ఇక్కడి నిర్వాసితులు ఇప్పటికే పలుమార్లు, పలురకాలుగా ఆందోళనలు చేపట్టారు. ప్యాకేజీ నచ్చని 51 మంది రైతులు మార్కెట్‌ విలువ ప్రకారం ధర చెల్లించాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించారు. పోలేపల్లి రైతులు మాత్రం పట్టు వీడకపోవడంతో ఎకరాకు రూ.11.50లక్షల నుంచి రూ.12.50 లక్షల పరిహారమిచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆగ్రహం చెందిన ఉదండాపూర్‌, వల్లూరు, ఖానాపూర్‌ రైతులు నిర్మాణ పనులను అడ్డుకున్నారు. ఐదు రోజులుగా ధర్నా చేస్తున్నారు

Updated Date - 2020-03-02T10:03:50+05:30 IST