సమాజానికి‌ మంచి‌ మనుషులు అవసరం:ఎస్వీ కృష్ణా రెడ్డి

ABN , First Publish Date - 2020-12-27T21:09:59+05:30 IST

వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు.

సమాజానికి‌ మంచి‌ మనుషులు అవసరం:ఎస్వీ కృష్ణా రెడ్డి

హైదరాబాద్: వింత పొకడలతో పెడదారి పడుతున్న నేటి సమాజానికి మంచి మనస్సున్న మనుషుల అవసరం ఎంతైనా ఉందని ప్రముఖ దర్శకులు ,నిర్మాత ఎస్వీ కృష్ణా రెడ్డి అన్నారు. ఆదివారం ఫిల్ం నగర్ లోని తాజ్ మహాల్ హోటల్ లో గ్రావిటి ఫిల్మ్‌ సంస్థ రూపొందించిన యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కు చెందిన అమ్మ నాన్న అనాధ ఆశ్రమం లోగో, వెబ్ సైట్ ను టీయూడబ్ల్యూజే నేత కె.విరాహత్ అలీతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మనిషి కన్నా మనస్సు చాలా గొప్పదని, మనిషి ఆలోచనలను అది రాకెట్ కన్న వేగంతో పరిగెత్తిస్తుందని అన్నారు. అలాంటి  మంచి మనస్సు కలిగిన సామాజిక సేవకుడు గట్టు శంకర్ అని ఆయన అభినందించారు.  


నిరాశ నిస్పృహల మధ్య  ముందుకు సాగుతున్న యువత వాటికి స్వస్తి పలికి సామాజిక చైతన్యంతో అడుగేస్తేనే సమాజానికి న్యాయం చేసినవారవు తారని , అలాంటి వారి‌ జీవితాలే ధన్యమవుతాయని ఎస్వీ కృష్ణారెడ్డి స్పష్టం చేశారు. మరో అతిధిగా హాజరైన ప్రముఖ నిర్మాత అచ్చిరెడ్డి‌ మాట్లాడుతూ అమ్మ నాన్న సేవ సంస్థ ద్వారా‌ మానవతావాదిగా గట్టు శంకర్ చేస్తున్న సేవకు వెల కట్టలేమన్నారు.నలుగురు సభ్యులు ఉన్న కుటుంబమే దాని పోషణకు నానా‌ ఇబ్బందులు పడే ఈ రోజుల్లో ఏకంగా నాలుగు వందల మంది ఏ దిక్కు లేని అభాగ్యులకు ఆశ్రయం కల్పించి మరో మదర్ థెరిస్సా ‌లా శంకర్ నిలబడడం అభినందనీయమన్నారు. 


శంకర్ సేవను డాక్యుమెంటరీలో చూసి వేదికపైనే ఆయన కన్నీటి పర్యంతం అయ్యారు.గౌరవ అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల‌‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.విరాహత్ అలీ‌ మాట్లాడుతూ సమాజంలో తోటి మనిషిని‌ మనిషిగా గుర్తించని‌వాడు తన దృష్టిలో మనిషే కాదన్నారు. కానీ గట్టు శంకర్ మాత్రం ‌ముంబాయిలో  ఉద్యోగాన్ని వదిలి తన‌ జీవితాన్ని నోరు లేని అభాగ్యుల‌ కోసం అంకితం చేయడం ప్రతి యువతకు స్పూర్తి దాయకం అన్నారు. అమ్మ నాన్న అనాధ ఆశ్రమాన్ని ఆదరించాల్సిన బాధ్యత‌ ప్రతి మానవతావాదిపై ఉంటుందని విరాహత్ అలీ అన్నారు. 


అమ్మనాన్న అనాధ ఆశ్రమం నిర్వాహకులు గట్టు శంకర్ మాట్లాడుతూ, తన నిజ జీవితంలో ఎదురైన కన్నీటి కష్టంతోనే ఆశ్రమం  నిర్వాహించాలనే తపన మొదలైందని, అదే లక్ష్యంతో నలుగురితో మొదలైన ఆశ్రమం ఇప్పుడు 400 మందికి ఆశ్రయం ఇవ్వడం గర్వంగా ఉందన్నారు. తెలిపారు. తమ‌ ఆశ్రమం లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాలలోని మానసిక‌ వికలాంగులు ఆశ్రయం పొందుతున్నారని,  రోడ్ల వెంబడి తిరుగుతూ చెత్త కుండీల్లో ఏరుకొని తినే నోరులేని అభాగ్యులను చేరదీసి వాళ్ళు మనుషులేనని నిరూపిస్తున్నట్లు శంకర్ తెలిపారు.

Updated Date - 2020-12-27T21:09:59+05:30 IST