దీక్షిత్‌రెడ్డి హత్యకేసు.. సూత్రధారి, పాత్రధారి సాగర్ ఒక్కడే
ABN , First Publish Date - 2020-10-24T08:34:35+05:30 IST
మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు కుసుమ దీక్షిత్‌రెడ్డి హత్యకేసులో.. సూత్రధారి, పాత్రధారి మంద సాగర్ ఒక్కడేనని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు.

అన్ని ఆధారాలు సేకరించిన పోలీసులు
మహబూబాబాద్ క్రైం, అక్టోబరు 23: మహబూబాబాద్‌లో తొమ్మిదేళ్ల బాలుడు కుసుమ దీక్షిత్‌రెడ్డి హత్యకేసులో.. సూత్రధారి, పాత్రధారి మంద సాగర్ ఒక్కడేనని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి వెల్లడించారు. నిందితుడు సాగర్‌ను అరెస్టు చేసినట్లు ప్రకటించారు. ‘‘తొలుత ఈ హత్యలో ఎక్కువ మంది ప్రమేయం ఉందని భావించాం. 50 మందిని విచారించాం. చివరకు నిందితుడు సాగర్ ఒక్కడేనని తేలింది’’ అని కోటిరెడ్డి తెలిపారు. ఈ నెల 18న దీక్షిత్‌రెడ్డిని తన బైక్‌పై తీసుకెళ్లిన మంద సాగర్.. పట్టణంలో ఎక్కడా సీసీ కెమెరాలకు చిక్కకుండా జాగ్రత్త పడ్డాడని ఎస్పీ వివరించారు. ‘‘కేసముద్రం మండలం అన్నారం గ్రామ శివారులోని దానమయ్య గుట్టకు తీసుకెళ్లాడు. చీకటి పడుతుండడంతో దీక్షిత్‌రెడ్డి ఇంటికి తీసుకెళ్లమంటూ ఏడ్చాడు. దీంతో దొరికిపోతానని సాగర్ భయపడ్డాడు. దీక్షిత్‌కు నిద్రమాత్రలు ఇచ్చాడు. ఆ బాలుడు నిద్రలోకి జారుకోగానే.. రుమాలుతో అతడి చేతులను కట్టేశాడు. బాలుడి టీషర్టు తీసి, దాంతోనే మెడకు ఉరి బిగించి, చంపాడు’’ అని ఎస్పీ తెలిపారు.
ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా.. ఓ మొబైల్ యాప్ ద్వారా బాలుడి తల్లి వసంతకు ఇంటర్నెట్ కాల్ చేసి, రూ. 45 లక్షలు డిమాండ్ చేశాడని కోటిరెడ్డి పేర్కొన్నారు. ‘‘మంద సాగర్ ఆ తర్వాత టౌన్‌కు చేరుకున్నాడు. దీక్షిత్ కిడ్నాప్ అయ్యాడని, కిడ్నాపర్లు రూ. 45 లక్షలు డిమాండ్ చేస్తున్నారని స్నేహితుల ద్వారా తెలుసుకుని.. ఏమీ ఎరగనట్లే మిన్నకున్నాడు. తర్వాత దీక్షిత్‌రెడ్డి మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు పెట్రోల్ బాటిల్‌తో మరోమారు హత్యాస్థలానికి వెళ్లాడు. అక్కడ బాలుడి మృతదేహంపై పెట్రోల్ పోసి, కాల్చేశాడు’’ అని వివరించారు. ఇంటర్నెట్ కాల్స్ కావడంతో.. నిందితుడిని గుర్తించడానికి ఆలస్యమైందని కోటిరెడ్డి వెల్లడించారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చూస్తామని ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి పేర్కొన్నారు.