ఆర్టీసీకి డీజిల్‌ గుదిబండ!

ABN , First Publish Date - 2020-06-23T10:00:06+05:30 IST

రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఆర్టీసీకి గుదిబండగా మారుతున్నాయి. అసలే ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థకు డీజిల్‌ రేట్లు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా మారుతున్నాయి. రోజుకు అదనంగా రూ.33.40 లక్షల భారం

ఆర్టీసీకి డీజిల్‌ గుదిబండ!

  • రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధర
  • సంస్థపై రోజుకు 33.40 లక్షల భారం


హైదరాబాద్‌, జూన్‌ 22 (ఆంధ్రజ్యోతి): రోజు రోజుకూ పెరుగుతున్న డీజిల్‌ ధరలు ఆర్టీసీకి గుదిబండగా మారుతున్నాయి. అసలే ఆర్థిక నష్టాల్లో ఉన్న సంస్థకు డీజిల్‌ రేట్లు మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్లుగా మారుతున్నాయి. రోజుకు అదనంగా రూ.33.40 లక్షల భారం పడుతోంది. సాధారణంగా ఆర్టీసీ వివిధ ఆయిల్‌ కంపెనీల నుంచి డీజిల్‌ను కొంటోంది. ఏడాదికి దాదాపు 20 కోట్ల లీటర్ల డీజిల్‌ను వాడుతూ రూ.1400 కోట్ల మేర వెచ్చిస్తోంది. లాక్‌డౌన్‌కు ముందు అద్దె బస్సులు మినహాయించి 7 వేల పైచిలుకు సొంత బస్సులను వివిధ రూట్లలో తిప్పేది. దాంతో రోజుకు 8 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగమయ్యేది. అయితే.. మే 19 నుంచి తిరిగి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యాయి. అంతర్రాష్ట్ర, సిటీ బస్సులు మినహా జిల్లాల్లో మొత్తం 4,500కు పైగా బస్సులు నడుస్తున్నాయి. వీటికి రోజుకు దాదాపు 4 లక్షల లీటర్ల డీజిల్‌ వినియోగమవుతోంది. డీజిల్‌ రేట్ల పెరుగుదల ప్రారంభం కాక ముందు.. అంటే 12 రోజుల క్రితం లీటరుకు రూ.71 వరకు ఉన్న డీజిల్‌ రేటుతో ఆర్టీసీ రోజుకు రూ.2.50 కోట్లను వెచ్చించేది. 12 రోజులుగా డీజిల్‌ రేట్లు ప్రతి రోజూ పెరుగుతూ వచ్చాయి. సోమవారం డీజిల్‌ లీటర్‌ ధర రూ.79.49కు చేరింది. 12 రోజుల క్రితం ఉన్న ధర కంటే సోమవారం నాటికి రూ.8.35 అదనంగా పెరిగింది. దీంతో ఆర్టీసీ రోజూ వినియోగించే 4 లక్షల లీటర్ల డీజిల్‌పై రూ.33.40 లక్షల అదనపు భారం నమోదవుతోంది. డీజిల్‌ రేట్లు ఇదే స్థాయిలో కొనసాగితే... నెలకు రూ.10 కోట్లు, సంవత్సరానికి రూ.120 కోట్ల అదనపు భారం పడే అవకాశముంది. మున్ముందు అంతర్రాష్ట్ర, సిటీ బస్సులూ ప్రారంభమైతే ఏడాదికి రూ.160 కోట్ల అదనపు భారం పడుతుందని అంచ నా వేస్తున్నారు.   


డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలి

పెట్రోలు, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఆర్టీసీ బోర్డు మాజీ డైరెక్టర్‌ ఎం.నాగేశ్వరరావు డిమాండ్‌ చేశారు. ప్రస్తుతం పెట్రోలు, డీజిల్‌ రాష్ట్ర పరిధిలో ఉండడంతో వాటిపై వ్యాట్‌ను విధిస్తున్నారు. డీజిల్‌పై 27ు వ్యాట్‌ వసూలు చేస్తున్నారు. ఆర్టీసీ వంటి ప్రజా రవాణా సంస్థలకు డీజిల్‌ భారం కాకుండా ఉండాలంటే తక్కువ పన్ను రేటు తో డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తేవాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేశారు.

Read more