సన్నాల సెగలు

ABN , First Publish Date - 2020-10-31T09:38:21+05:30 IST

సన్న రకం వరి వేయాలని చెప్పిన ప్రభుత్వం మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ప్రకటించకుండా కొనుగోలు

సన్నాల సెగలు

మద్దతు ధర ఏదని నిలదీస్తున్న రైతులు

వీర్నపల్లిలో పంటకు నిప్పుపెట్టిన అన్నదాత

నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై ధర్నా


(ఆంధ్రజ్యోతి న్యూస్‌ నెట్‌వర్క్‌) 

సన్న రకం వరి వేయాలని చెప్పిన ప్రభుత్వం మద్దతు ధర ఎందుకు ప్రకటించలేదని అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మద్దతు ప్రకటించకుండా కొనుగోలు కేంద్రాలు ఎలా ప్రారంభిస్తారని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్‌లో శుక్రవారం కొనుగోలు కేంద్రం ప్రారంభానికి వచ్చిన ప్రజాప్రతినిధులను రైతులు నిలదీశారు. క్వింటాకు రూ.2,500 ధర ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. వారం రోజుల్లో సర్కారు మద్దతు ధర ప్రకటిస్తుందని ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు. సన్న రకం వరి ధాన్యానికి ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందడంలేదని నిరాశకు గురైన రైతు పంటకు నిప్పు పెట్టాడు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన శంకరయ్య మూడెకరాల్లో సన్నరకం వరి వేశాడు. దోమపోటుతో పంట దిగుబడి తగ్గిపోవడం, సన్నరకాలకు మద్దతు ధర లేకపోవడంతో శుక్రవారం సాయంత్రం పంటకు నిప్పు పెట్టాడు. చన్ని పట్టకుండా ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేస్తూ నిజామాబాద్‌ జిల్లా నవీపేటలో రైతులు రాస్తారోకో చేశారు.


అనంతరం మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట బైఠాయించారు. పంటను అమ్ముకుందామంటే రైస్‌ మిల్లర్లు సిండికేట్‌గా మారి దోచుకుంటున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా వేములపల్లి వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి రహదారిపై రైతులు రాస్తారోకో చేశారు. ప్రభుత్వం చెప్పిన విధంగా సన్నాలు సాగు చేశామని, దిగుబడి వచ్చే సమయానికి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించపోవడంతో గిట్టుబాటు ధర రూ.1,888 లభించడం లేదని వాపోయారు. సీజన్‌ ప్రారంభంలో రూ.2వేలకు పైగా చెల్లించిన మిల్లర్లు, దిగుబడి ఒక్కసారిగా పెరగడంతో సిండికేట్‌గా మారారని ఆరోపించారు.  

Updated Date - 2020-10-31T09:38:21+05:30 IST