రేపటి నుంచే ధరణి

ABN , First Publish Date - 2020-10-28T07:03:29+05:30 IST

దాదాపు యాభై రోజులుగా నిలిచిపోయిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అదే రోజు వ్యవసాయేతర

రేపటి నుంచే ధరణి

ఎంసీపల్లిలో పోర్టల్‌ ప్రారంభించనున్న సీఎం

తహసీల్దార్‌ వద్దే వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌

వెంటనే రికార్డుల్లో కొనుగోలుదారుకు మ్యుటేషన్‌

తొలి దశ లో నాలుగు రకాల రిజిస్ట్రేషన్లు 

సీఎం సరేనంటే వ్యవసాయేతర భూములకూ 


హైదరాబాద్‌, అక్టోబరు 27 (ఆంధ్రజ్యోతి): దాదాపు యాభై రోజులుగా నిలిచిపోయిన వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌ గురువారం నుంచి తిరిగి ప్రారంభం కానుంది. అదే రోజు వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యమంత్రి అనుమతిస్తే రెండింటినీ గురువారమే ప్రారంభిస్తారు. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు చేయాల్సిన తహసీల్దార్లకు ఇప్పటికే ధరణిపై శిక్షణ ఇచ్చారు. వ్యవసాయేతర భూముల రిజిస్ట్రేషన్లు చేపట్టే సబ్‌ రిజిస్ట్రార్లకు ఎలాంటి శిక్షణ అవసరం లేదు. అయితే వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ ఎప్పటి నుంచి మొదలు పెట్టాలన్న దానిపై సీఎం కేసీఆర్‌ మంగళవారం వరకు స్పష్టత ఇవ్వలేదు. ఇబ్బందులు ఎదురైతే తొలుత వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు మొదలుపెట్టి, వచ్చే నెల మొదటి వారంలో వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చేపడతారని అంటున్నారు.


రాష్ట్రవ్యాప్తంగా 474 తహసీల్దార్‌ కార్యాలయాల్లో తహసీల్దార్లు జాయింట్‌ సబ్‌ రిజిస్ట్రార్‌ హోదాలో వ్యవసాయ భూములకు రిజిస్ట్రేషన్‌ చేస్తారు. వెనువెంటనే రికార్డుల్లో మ్యుటేషన్‌ చేపడతారు. దీనికోసం ధరణి(సమీకృత భూరికార్డుల నిర్వహణ విధానం)కి శ్రీకారం చుడుతున్నారు. గురువారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరి జిల్లా మూడు చింతలపల్లి మండల కేంద్రంలో మధ్యాహ్నం 12:45  గంటలకు సీఎం కేసీఆర్‌ ఈ పోర్టల్‌ను ప్రారంభిస్తారు. ఈ గ్రామం ముఖ్యమంత్రి ఫాంహౌ్‌సకు సమీపంలోనే ఉంది.


ధరణిలో తొలి దశలో నాలుగు రకాల డాక్యుమెంట్లను మాత్రమే రిజిస్ట్రేషన్‌ చేయడానికి తహసీల్దార్లకు అనుమతినిచ్చారు. సేల్‌డీడ్‌(భూముల విక్రయాలు), పార్టిషన్‌(భూపంపకాలు), సక్సెషన్‌(వారసులకు భూములపై అధికారం), గిఫ్ట్‌ డీడ్‌(బహుమతి)లను తహసీల్దార్‌ కార్యాలయంలో రిజిస్ట్రేషన్‌ చేయనున్నారు. వ్యవసాయ భూములను వ్యవసాయేతర భూములుగా వాణిజ్య అవసరాల కోసం మార్చే అధికారం కూడా తహసీల్దార్లకే కట్టబెట్టడంతో పై నాలుగు రకాల డాక్యుమెంట్ల నమోదుతో పాటు నాలా(వ్యవసాయేతర భూమార్పిడి) అధికారంతో వారు బాధ్యతలు చేపట్టనున్నారు.


ధరణి ఆధారంగా తహసీల్దార్లు రిజిస్ట్రేషన్‌ చేయనుండటంతో దీనికోసం ‘తెలంగాణ భూమి హక్కులు పట్టాదారు పాస్‌ పుస్తకం చట్టం-2020’ను అనుసరించి, రూల్స్‌ను విడుదల చేయనున్నారు. తహసీల్దార్లకు రిజిస్ట్రేషన్‌ అధికారాలు కల్పిస్తూ జీవో కూడా జారీ కానుంది. ధరణి రికార్డులనే ప్రామాణికంగా చేసుకొని రిజిస్ట్రేషన్‌ చేయాలని ప్రభుత్వం ఇదివరకే స్పష్టం చేయడంతో 1.55 కోట్ల ఎకరాల పట్టా భూముల క్రయవిక్రయాలన్నీ తహసీల్దార్‌ కార్యాలయాల్లోనే జరుగనున్నాయి.




స్లాట్‌ బుక్‌ చేసుకుంటేనే 

తహసీల్దార్‌ కార్యాలయంలో భూముల రిజిస్ట్రేషన్‌ జరగాలంటే విధిగా స్లాట్‌ బుకింగ్‌ చేసుకోవాల్సిందే. స్లాట్‌ లేకుంటే రిజిస్ట్రేషన్‌ అస్సలు చెల్లదు.

తొలుత ధరణి వెబ్‌సైట్లోకి వెళ్లి వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్‌ విభాగంపై క్లిక్‌ చేయాలి. 

మొబైల్‌ నెంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌ ఫోన్‌కు వచ్చే వన్‌టైమ్‌ పాస్‌వర్డ్‌(ఓటీపీ)ని కూడాను వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలి. కొనుగోలుదారులు, రైతుల ఆధార్‌ కార్డులు, పట్టాదారు పాస్‌ పుస్తకం వివరాలు నమోదు చేసుకోవాలి. కుటుంబ సభ్యుల వివరాలు, కొనుగోలు చేసే విస్తీర్ణం, సర్వే నెంబర్‌ అన్నీ వివరాలు పొందుపరచాలి. ఈ-చలాన్‌ (రిజిస్ట్రేషన్‌, స్టాంప్‌డ్యూటీ, పాస్‌పుస్తకం, మ్యుటేషన్‌ఫీజులు) చెల్లించాల్సి ఉంటుంది. అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి. 

రైతు అంగీకారం లేకుండా ఒక్క అడుగు కూడా వెబ్‌సైట్‌లో పడదు.


వెబ్‌సైట్లోనే దస్తావేజు

రిజిస్ట్రేషన్‌ చేసుకోవడానికి డాక్యుమెంట్‌ రైటర్‌ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. రైతులు నమోదు చేసే వివరాలతో వెబ్‌సైటే డాక్యుమెంట్‌ను జనరేట్‌ చేస్తుంది.


ఆధార్‌ కార్డే ప్రామాణికం

రిజిస్ట్రేషన్‌ చేసే క్రమంలో కొనుగోలుదారుల నుంచి తీసుకునే ఆధార్‌ కార్డులోని వివరాలే రిజిస్ట్రేషన్‌కు ప్రామాణికం కానున్నాయి. ఆధార్‌ కార్డులోని ఫొటోయే భూమిపై ఇచ్చే పట్టాదార్‌ పాస్‌ పుస్తకం తొలిపేజీలో ముద్రిస్తారు. దాంతో ఆధార్‌ కార్డు కీలకంగా మారింది. ఇక రిజిస్ట్రేషన్‌ అనంతరం కొనుగోలుదారుల చిరునామాకే పట్టాదారు పాస్‌పుస్తకం చేరనుంది.

ధరణి వెబ్‌సైట్‌ లో పొందుపరిచిన భూముల విలువలు చూస్తే... పాత విలువలనే ప్రభుత్వం కొనసాగిస్తున్నట్లు తేలింది. సిద్దిపేట జిల్లా మర్కూక్‌ మండలంలో ఒక్కో ఎకరా రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ఉండగా... రిజిస్ట్రేషన్‌ విలువ మాత్రం రూ.1.75 లక్షలుగానే ఉంది.


ఏర్పాట్లు పరిశీలించిన సీఎస్‌ 


మూడు చింతలపల్లిలో స్వాతంత్య్ర సమరయోధుడు కామిడి వీరారెడ్డి స్మారక భవనంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభింంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌ గ్రామానికి వచ్చి అధికారులతో  ఏర్పాట్లను సమీక్షించారు. రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులు పలువురు ఈ సమీక్షకు హాజరయ్యారు. 




రోజుకు 16 డాక్యుమెంట్లు జరిగే అవకాశం

తహసీల్దార్‌ కార్యాలయంలో అరగంటకో రిజిస్ట్రేషన్‌ జరిగే విధంగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 5.30 గంటల దాకా స్లాట్‌ బుకింగ్‌కు అవకాశం ఇచ్చారు. రోజూ 16 రిజిస్ట్రేషన్లకు స్లాట్లు  కేటాయించనున్నారు. రాష్ట్రంలోని 141 సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయాల్లో రోజుకు 6000-7000 వరకు రిజిస్ట్రేషన్లు జరిగేవి. వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్లు 2000 వరకు ఉండేవి. 49 రోజులుగా రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో 5 లక్షలకు పైగా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్‌ కోసం ఎదురు చూస్తున్నాయి. 


ఆస్తుల రిజిస్ట్రేషన్‌కు సన్నద్ధం

ధరణి పోర్టల్‌ను అభివృద్ధి చేయడం కోసం ప్రభుత్వం సెప్టెంబరు 8 నుంచి రిజిస్ట్రేషన్లను అన్నింటినీ నిలిపేసింది. ధరణి పోర్టల్‌తో పాటే రిజిస్ట్రేషన్లను ప్రారంభిస్తారు. వ్యవసాయ భూములను రిజిస్ట్రేషన్‌ చేసే బాధ్యతను తహసీల్దార్లకు, వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ బాధ్యతలను సబ్‌-రిజిస్ట్రార్లకు అప్పగించారు. వీటికి సంబంధించిన రెండు ఆప్షన్లను ధరణి పోర్టల్‌లో పొందుపర్చారు. సర్వం సన్నద్ధమైనందున వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్‌ కూడా ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. 


రైతులతో సీఎం ముఖాముఖి

తెలంగాణ భూమి హక్కులు పట్టాదార్‌ పాస్‌పుస్తకం చట్టం గురించి ముఖ్యమంత్రి కేసీఆర్‌ రైతులతో ముఖాముఖి మాట్లాడనున్నారు. గురువారం మధ్యాహ్నం మూడుచింతలపల్లి మండల కేంద్రంలో ధరణి పోర్టల్‌ను ప్రారంభించిన తర్వాత 1000 మంది రైతులతో సమావేశం అవుతారు. చట్టం ప్రత్యేకతను వివరిస్తారు. రైతులతో ముఖాముఖిగా మాట్లాడి, అభిప్రాయాలు స్వీకరిస్తారు. 2 వేల మంది పట్టేలా కార్యక్రమ ప్రాంగణాన్ని అధికారులు సిద్ధం చేస్తున్నారు.


Updated Date - 2020-10-28T07:03:29+05:30 IST