ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలంటూ ధర్నా
ABN , First Publish Date - 2020-12-16T05:04:52+05:30 IST
ధరణి పోర్టల్‌ను రద్దు చేయాలంటూ ధర్నా

జనగామ టౌన్, డిసెంబరు 15: ధరణి పోర్టల్‌ను రద్దు చేసి పాత పద్ధతిలోనే రిజిస్ట్రేషన్‌లు చేయాలనే డిమాండ్‌తో మంగళవారం జనగామ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట రియల్ ఎస్టేట్ వ్యాపారులు, దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు ధర్నా చేశారు. దాదాపు 200 మంది ధర్నాలో పాల్గొని ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించి ప్రభుత్వం తమ సమస్యలపై స్పందించాలని నినాదాలు చేశారు. దాదాపు 4 గంటల పాటు సాగిన ధర్నాతో కార్యాలయ ప్రాంతం దద్దరిల్లిపోయింది. కాంగ్రెస్ రాష్ట్ర నేత, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతా్‌పరెడ్డి ఆందోళనలో పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ అనాలోచిత నిర్ణయంతో లక్షలాది మంది బతుకులు రోడ్డునపడ్డాయన్నారు. ధరణి పోర్టల్‌ను రద్దుచేసి వెంటనే రిజిస్ట్రేషన్ ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు. రియల్టర్లు, దస్తావేజుల రైటర్ల ఆందోళనకు తమ సంపూర్ణ మద్దతు ప్రకటించారు. కాంగ్రెస్ నాయకులు లింగాజీ, శివరాజ్, బీజేపీ నాయకులు బొట్ల శ్రీనివాస్, పిట్టల సత్యం, పవన్‌శర్మ, నాగారపు వెంకట్, సాదిక్ ఫౌండేషన్ చైర్మన్ ఎండి.సాధిక్ అలీ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఆందోళనలో రియల్టర్ల సంఘం అధ్యక్షుడు అడ్డూరి రమేశ్, ప్రధాన కార్యదర్శి ఎండి.యూసుఫ్, కోశాధికారి పాశం శ్రీశైలం, కాస భాస్కర్, తొట్టె కృష్ణ, మైసయ్య, సతీష్, బిట్ల నవీన్, శ్రీనివాస్, రాంరెడ్డి, కుమార్ పాల్గొన్నారు.