డీజీపీ పర్యవేక్షణలో కూల్చివేత పనులు
ABN , First Publish Date - 2020-07-08T08:34:53+05:30 IST
డీజీపీ పర్యవేక్షణలో కూల్చివేత పనులు

పోలీసుశాఖ వ్యూహాత్మకం.. డీసీపీల వరకే సమాచారం
కిలోమీటర్ల మేర ట్రాఫిక్ దారిమళ్లింపు.. వాహనదారుల అవస్థలు
హైదరాబాద్, జూలై 7 (ఆంధ్రజ్యోతి): పాత సచివాలయ భవనాల కూల్చివేతలో పోలీ్‌సశాఖ కీలకంగా వ్యవహరిస్తోంది. పాత సచివాలయ భవనాల కూల్చివేతను విపక్షాలు ముందు నుంచి వ్యతిరేకిస్తూ వస్తున్నాయి. దీంతో కూల్చివేత సందర్భంగా ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. భవనాల కూల్చివేతను సీఎస్ సోమేశ్ కుమార్‌తో కలిసి డీజీపీ మహేందర్‌రెడ్డి స్వయంగా పర్యవేక్షించారు. సీఎ్‌సతో కలిసి ఆయన సోమవారం సాయంత్రం సీఎం కేసీఆర్‌ను ఫాంహౌ్‌సలో కలిశారు. రాత్రి వరకు అక్కడే ఉన్నారు. సీఎం నుంచి ఆదేశాలు అందిన తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. సీపీ నుంచి డీసీపీ స్థాయి అధికారుల వరకు మాత్రమే కూల్చివేతలపై సమాచారం చేరవేశారు. సోమవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో బందోబస్తుకు అవసరమైన సిబ్బందికి యూనిట్ అధికారులు ఎస్‌ఎంఎస్ పంపించారు. రాత్రి 10:30 నిమిషాలకు రిపోర్టు చేయాలని ఎస్‌ఎంఎస్ అందడంతో కిందిస్థాయి సిబ్బంది గందరగోళానికి గురయ్యారు. రాత్రి 11:30 గంటల ప్రాంతంలో సచివాలయ భవనాల కూల్చివేత బందోబస్తు అంటూ డీసీపీ స్థాయి అధికారులు వారికి సమాచారమిచ్చారు. దీంతో వారికి కేటాయించిన పాయింట్లలో సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. భవనాల కూల్చివేత సందర్భంగా కిలోమీటరు దూరం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. మంగళవారం సాయంత్రం 5గంటల వరకు ట్రాఫిక్ నిలిపివేత కొనసాగడంతో తిప్పలు తప్పలేదు.