మావోయిస్టులకు సహకరించొద్దు

ABN , First Publish Date - 2020-07-19T07:09:40+05:30 IST

మావోయిస్టులకు ప్రజలు సహకరించొద్దని, తెలంగాణలో నక్సలిజం తగ్గుముఖం పట్టిన తర్వాతే అభివృద్ధి సాధ్యమైందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలోని...

మావోయిస్టులకు సహకరించొద్దు

నక్సలిజం తగ్గాకే తెలంగాణ అభివృద్ధి చెందింది: డీజీపీ మహేందర్‌రెడ్డి

కూంబింగ్‌ ఆపండి: సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ (మావోయిస్టు) కార్యదర్శి ప్రభాత్


ములుగు/మణుగూరు/మంచిర్యాల/హైదరాబాద్‌, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మావోయిస్టులకు ప్రజలు సహకరించొద్దని, తెలంగాణలో నక్సలిజం తగ్గుముఖం పట్టిన తర్వాతే అభివృద్ధి సాధ్యమైందని డీజీపీ మహేందర్‌రెడ్డి అన్నారు. ములుగు జిల్లాలోని తెలంగాణ-ఛత్తీ్‌సగఢ్‌ సరిహద్దు మండలం వెంకటాపురం(నూగూరు)లో ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలకు చెందిన పోలీసు అధికారులతో; భద్రాది కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ఇల్లెందు  క్లబ్‌లో భద్రాది, ములుగు, మహబూబాబాద్‌ జిల్లాల పోలీస్‌ అధికారులతో డీజీపీ శనివారం వేర్వేరుగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు.  అనంతరం మీడియాతో మాట్లాడారు. ఛత్తీ్‌సగఢ్‌లో తలదాచుకున్న మావోయిస్టులు కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఇంజనీర్లకు లెటర్లు రాస్తూ డబ్బు వసూళ్లకు పాల్పడుతున్నారని అన్నారు. మళ్లీ రాష్ట్రంలోకి వచ్చి కార్యకలాపాలను విస్తరించేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. ఛత్తీ్‌సగఢ్‌ గిరిజనుల ద్వారా తెలంగాణ గిరిజనులను ఆకర్షిచేందుకు చూస్తున్నారన్నారు. మావోయిస్టులు తెలంగాణలోకి అడుగుపెట్టకుండా సరిహద్దులోనే తిప్పికొడతామన్నారు.  మావోయిస్టు నేతలు హరిభూషణ్‌, దామోదర్‌ విలాసాలకు అలవాటుపడ్డారని, వారికి ప్రజలు సహకరించొద్దని డీజీపీ కోరారు. కాగా, తెలంగాణలో ఏ ఒక్కరికి హాని తలపెట్టినా మావోయిస్టులకు చావుదెబ్బ తప్పదని ప్రజాస్వామ్య పరిరక్షణ కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు భరత్‌ పేరుతో శనివారం ఆడియో, ప్రకటనను కమిటీ  విడుదల చేసింది. కొవిడ్‌ నేపథ్యంలో కాల్పుల విరమణ పాటిస్తున్నట్లు మావోయిస్టు తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌ ప్రకటించడం అవాస్తవమన్నారు.   మరో వైపు..  కూంబింగ్‌ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు పార్టీ సింగరేణి కోల్‌బెల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు.   కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా తిర్యాణి మండలంలో మావోయిస్టు దళాన్ని డీజీపీ మహేందర్‌రెడ్డి ఆదేశం మేరకు మట్టుపెట్టడానికి జరుపుతున్న కూంబింగ్‌ను నిలిపివేయాలని, లేని పక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. 


ఏరియల్‌ రివ్యూ...

మహదేవపూర్‌: కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని లక్ష్మీబ్యారేజీ, సరస్వతీ బ్యారేజీలను డీజీపీ మహేందర్‌రెడ్డి హెలికాప్టర్‌ ద్వారా పరిశీలించారు. మావోయిస్టుల కదలికలు పెరిగిన నేపథ్యంలో తెలంగాణ-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లో ఏరియల్‌ రివ్యూ చేశారు. 

Updated Date - 2020-07-19T07:09:40+05:30 IST