నాలాల అభివృద్ధి.. ఇకపై వ్యూహాత్మకం!

ABN , First Publish Date - 2020-11-03T08:13:32+05:30 IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికిపోయింది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా భయానక వాతావరణం ఏర్పడింది.

నాలాల అభివృద్ధి.. ఇకపై వ్యూహాత్మకం!

 ఓఎ్‌సడీగా రిటైర్డ్‌ చీఫ్‌ ఇంజనీర్‌ వసంత నియామకం

 ఆక్రమణల తొలగింపు.. నాలాల విస్తరణే లక్ష్యం

 హైదరాబాద్‌ సిటీ, నవంబర్‌ 2 (ఆంధ్రజ్యోతి): ఇటీవల కురిసిన  భారీ వర్షాలకు నగరం చిగురుటాకులా వణికిపోయింది. వందేళ్లలో ఎన్నడూ లేనంతగా భయానక వాతావరణం ఏర్పడింది. కాలనీలు చెరువులయ్యాయి. నగరం సాగరమైంది. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇంతటి విలయానికి కారణం.. నగరంలో నాలాలు, ఫీడర్‌ చానళ్లు కుంచించుకు పోవడమేనని వివిధ విభాగాలు ప్రభుత్వానికి సమర్పించిన ప్రాథమిక నివేదికలో పేర్కొన్నాయి.


దీంతో.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. రహదారుల వ్యవస్థ మెరుగుదలకు గతంలో రూపొందించిన ఎస్‌ఆర్‌డీపీ తరహాలోనే.. వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఎన్‌డీపీ)ని అమలు చేయాలని నిర్ణయించింది. మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జీహెచ్‌ఎంసీ అధికారులు.. దీనికోసం ప్రత్యేకంగా ఓ ప్రాజెక్టుల విభాగాన్ని ఏర్పాటు చేశారు.హైదరాబాద్‌ రోడ్‌ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ చీఫ్‌ ఇంజనీర్‌గా విధులు నిర్వర్తించి పదవీ విరమణ చేసిన వసంతను ఓఎ్‌సడీ (ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ)గా నియమించారు.


నగరంలో వరద ప్రవాహ వ్యవస్థ, నాలాల పరిస్థితులపై అధ్యయనం చేసి.. వాటి అభివృద్ధికి ఈ విభాగం తగిన సూచనలు చేస్తుంది. జీహెచ్‌ఎంసీ.. నీటి పారుదల శాఖ సూపరింటెండెంట్‌ ఇంజనీర్ల నేతృత్వంలో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 15 బృందాలు.. గ్రేటర్‌ శివార్లలోని 192 చెరువులను పరిశీలించాయి. చెరువుల విస్తీర్ణం, బండ్‌ల పరిస్థితి, ఇన్‌లెట్‌లు, అవుట్‌లెట్లతో పాటు ఎగువ, దిగువ ప్రాంతాల్లోని నాలాలు పరిస్థితిని ఈ బృందాల సభ్యులు ప్రత్యక్షంగా చూశారు.

నగరంలోని గొలుసు కట్టు చెరువుల నుంచి దిగువకు వరద నీరు వెళ్లేలా నిర్మించిన నాలాలు, వరద ప్రవాహ వ్యవస్థ చాలా వరకు కుచించుకుపోవడం వల్లే నగరం కల్లోలమైందని ఆ బృందాలు ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించాయి. అభివృద్ధి విస్తరణ క్రమంలో నాలాలు మరింతగా కుచించుకుపోయే ప్రమాదముందని, అలా జరగకుండా.. వాటిని మరింతగా విస్తరించాల్సిన అవసరం ఉందని సూచించాయి.  


సంక్లిష్ట ప్రాంతాల్లో సమస్య పరష్కారానికి..

కొత్తగా ఏర్పాటుచేస్తున్న ఈ ప్రాజెక్టు విభాగంలో ఓ చీఫ్‌ ఇంజనీర్‌, సీనియర్‌ ఇంజనీర్లు, సాగునీటి శాఖ ఇంజనీర్లు, వరద నిపుణులు, సాగునీటి శాఖ నిపుణులు ఉంటారు. వీరంతా నాలాలు, ఫీడర్‌ ఛానళ్ల పరిస్థితి, వాటి ఆక్రమణలను క్షేత్రస్థాయిలో పరిశీలించి.. సంక్లిష్టంగా ఉన్న ప్రాంతాలను గుర్తించి.. వాటి విస్తరణ, అభివృద్ధికి సంబంధించి పరిష్కార మార్గాలు సూచిస్తారు. ఇందుకు సంబంధించి ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ.. పరిస్థితుల్ని వేగంగా చక్కదిద్దేందుకు కృషిచేస్తారు. ఆక్రమణల తొలగింపు సహా వరద సాఫీగా వెళ్లేందుకు ఏం చేయాలో సూచనలిస్తారు. పూర్తి వివరాలతో ప్రభుత్వంత్వరలోనే ఉత్తర్వులు జారీ చేయనుంది. 


Updated Date - 2020-11-03T08:13:32+05:30 IST