మేకలకు గడ్డి.. బంధువులకు స్వీట్లు

ABN , First Publish Date - 2020-04-24T09:10:19+05:30 IST

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కట్టడి ప్రాంతాల్లోని ప్రజల కోరికల చిట్టాలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు.

మేకలకు గడ్డి..  బంధువులకు స్వీట్లు

కట్టడి ప్రాంతాల్లో స్థానికుల కోరికలు

గుట్కాలు, మద్యం తెచ్చివ్వాలని ఫోన్లు

ఓ ఏరియాలో 40 కిలోల చికెన్‌ ఆర్డర్‌

పాలు విరిగాయి.. కొత్త ప్యాకెట్‌ తెచ్చివ్వండని పేచీ


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 23(ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కట్టడి ప్రాంతాల్లోని ప్రజల కోరికల చిట్టాలతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. కరోనా పాజిటివ్‌  కేసులు నమోదైన ఏరియాలను కట్టడి ప్రాంతాలుగా గుర్తించిన ప్రభుత్వ విభాగాలు అక్కడి ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, వారికి కావాల్సిన సరుకులను ఫోన్‌ చేస్తే ఇళ్ల వద్దకే తీసుకువచ్చి ఇస్తామని చెప్పాయి. ఈ మేరకు ఏరియాల వారీగా నోడల్‌ ఆఫీసర్లు, సిబ్బంది నంబర్లు కరపత్రాల్లో రాసి ఇంటింటికి ఇచ్చారు. కట్టడి ప్రాంతాల్లో వారం రోజులుగా ఇళ్లలోనే ఉంటున్న ప్రజల్లో కొందరు అవసరమైన మేరకే కావాల్సినవి అడుగుతుండగా.. ఇంకొందరు జిహ్వ చాపల్యం కొద్దీ రకరకాల ఆహార పదార్థాలను ఆర్డర్‌ చేస్తున్నారు.  


స్వీట్లు బదులు సోంపాపడ్‌.. 

దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ కట్టడి ప్రాంతంలోని పలు కుటుంబాలు ఒకే రోజు 40 కేజీలకు పైగా చికెన్‌ ఆర్డర్‌ చేశాయి. ఆసి్‌ఫనగర్‌కు చెందిన ఓ కుటుంబం.. ఇంట్లో బంధువులున్నారు. స్వీట్లు, బూందీ తెండి.. పనిలోపనిగా విస్తరాకులూ పట్టుకురండి అని కోరారు. స్వీట్‌ షాపులు అందుబాటులో లేకపోవడంతో ఓ సూపర్‌ మార్కెట్‌ నుంచి సోంపాపడ్‌ తీసుకువచ్చి ఇచ్చామని అక్కడి ఓ అధికారి వెల్లడించారు. ఇంట్లో మేకలకు గడ్డి కావాలని.. ఆకలికి అలమటిస్తున్నాయని అల్వాల్‌లోని ఓ వ్యక్తి కోరారు. సిబ్బందిని పంపి వారికి గడ్డి తెచ్చి ఇచ్చారు. మీరు తెచ్చిన పాలు విరిగిపోయాయి. మాకు సంబంధం లేదు. మరో ప్యాకెట్‌ తీసుకురావాలని ఓ ప్రాంతంలో ఉద్యోగులతో మహిళ వాగ్వివాదానికి దిగింది.


మరో ప్రాంతంలో స్థానికుడొకరు గుట్కా కావాలని కోరాడు. పంజాగుట్టలోని ఓ కట్టడి ప్రాంతంలో మద్యం కావాలని అడిగారని అక్కడ విధులు నిర్వర్తించే ఉద్యోగి ఒకరు తెలిపారు. కొందరు బిర్యానీ, వెరైటీ స్నాక్స్‌, ఐస్‌క్రీమ్‌లూ అడుగుతున్నారని చెప్పారు. ‘అందుబాటులో ఉన్నవి తెచ్చేందుకు మాకు అభ్యంతరం లేదు. మద్యం, మాణిక్‌చంద్‌లు వంటివి అడిగితే ఎలా..? ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు సహకరించాలి’ అని ఆయన పేర్కొన్నారు. ఒక్కో కట్టడి ప్రాంతంలో 16 మంది విధులు నిర్వర్తిస్తున్నారు. 24 గంటలూ అందుబాటులో ఉంటున్నారు. 

Updated Date - 2020-04-24T09:10:19+05:30 IST