మాస్కులకు భారీ డిమాండ్‌

ABN , First Publish Date - 2020-03-04T08:59:24+05:30 IST

ఒక్క కరోనా కేసు నమోదుతో హైదరాబాద్‌ వాసులు ఉలిక్కి పడ్డారు. ఉరుకులు పరుగులతో మెడికల్‌ షాపులకు క్యూ కట్టారు. మంగళవారం గంటల వ్యవధిలోనే మెడికల్‌ షాపుల్లో మాస్కులన్నీ అమ్ముడుపోయాయి.

మాస్కులకు భారీ డిమాండ్‌

  • ఒక్క రోజులోనే మొత్తం ఖాళీ..
  • మెడికల్‌ షాపుల్లో అవుటాఫ్‌ స్టాక్‌!
  • వెంటనే ఇవ్వలేమంటున్న డిస్ట్రిబ్యూటర్లు..
  • చైనాకు భారీగా సరఫరా 
  • మాస్కులకు భారీ డిమాండ్‌
  • మిలియన్లలో ఆర్డర్లు.. కోట్లలో ఆదాయం

హైదరాబాద్‌ సిటీ, మార్చి 3 (ఆంధ్రజ్యోతి): ఒక్క కరోనా కేసు నమోదుతో హైదరాబాద్‌ వాసులు ఉలిక్కి పడ్డారు. ఉరుకులు పరుగులతో మెడికల్‌ షాపులకు క్యూ కట్టారు. మంగళవారం గంటల వ్యవధిలోనే మెడికల్‌ షాపుల్లో మాస్కులన్నీ అమ్ముడుపోయాయి. రోజుకు 10-20 మాస్క్‌లు అమ్మడమే ఎక్కువ కాగా, తాజాగా ఒక్కో షాపులో 200-300 వరకు విక్రయించారు. దీంతో చాలా మెడికల్‌ షాపుల్లో మాస్క్‌లు లేవని చెబుతున్నారు. ఎక్కువ మంది ఒకటి రెండు మాస్క్‌లు కాకుండా ఒకేసారి కుటుంబానికి సరిపడా కొనుగోలు చేశారని, దీంతో ఒక్కరోజే స్టాక్‌ అంతా అయిపోయిందని కొందరు మెడికల్‌ షాపుల నిర్వాహకులు తెలిపారు. మాస్క్‌ల కోసం ఆర్డర్లు ఇస్తే.. ఒకట్రెండు రోజుల తర్వాతే ఇస్తామని డిస్ట్రిబ్యూటర్లు చెబుతున్నారన్నారు.


మూడు రకాల మాస్క్‌లు..

కరోనా వైరస్‌ సోకకుండా ఉండేందుకు మార్కెట్లో ప్రధానంగా మూడు రకాల మాస్క్‌లను విక్రయిస్తున్నారు. ఇందులో ఎన్‌-95 ఖరీదైంది. దీని ధర గతంలో రూ.50 వరకు ఉండగా.. ప్రస్తుతం 150కి విక్రయిస్తున్నారు. ఇక 3ఫ్లై, 2ఫ్లై మాస్క్‌లు కరోనా రాకముందు 50పైసల నుంచి ఒక రూపాయి ఉండగా, ప్రస్తుతం రూ. 15-20 వరకు విక్రయిస్తున్నాయి. చైనాతో పాటు ఇతర దేశాలకు పెద్దమొత్తంలో సరఫరా చేయాల్సి ఉండడంతో ఇక్కడ కొరత ఏర్పడుతోందని తయారీదారులు పేర్కొంటున్నారు.


ఎన్‌-95 మాస్కులంటే..

సాధారణ మాస్కులో రెండు పొరలు ఉంటే.. వీటిలో 6 పొరలుంటాయి. ఇందులో శ్వాస వడపోత వాల్వులుంటాయి.

దుమ్ము ధూళి, వైర్‌సలు, బ్యాక్టీరియాలు, సూక్ష్మక్రిములను 95ు దాకా నిరోధిస్తాయి. అందుకే దీన్ని ఎన్‌-95 అంటారు


స్నేహితుడి కోసం చైనాకు మాస్క్‌లు..

హైదరాబాద్‌కు చెందిన నోముల రాజు ఉద్యోగ రీత్యా చైనా వెళ్లొచ్చారు. ఆ సమయంలో ఓ చైనీయుడు స్నేహితుడిగా మారారు. ఇటీవల చైనాలో కరోనా వైరస్‌ సోకడంతో మాస్కుల కొరత ఏర్పడింది. దీంతో రాజు తన స్నేహితుడికి సుమారు 1500 త్రీప్లై మాస్కులను పంపించారు. ఒక్కో మాస్క్‌ను రూ.15 చొప్పున కొనుగోలు చేశారు. వాటిని పంపించేందుకు రూ.25వేలు వెచ్చించారు. ఇక నగరానికి చెందిన వ్యాపారి ఆనంద్‌ 3ఫ్లై మాస్కులను ఎగుమతి చేస్తున్నారు. ఢిల్లీ, బెంగళూరు, ఇతర ప్రాంతాల్లో తయారవుతున్న మాస్కులను కొని జపాన్‌కు పంపిస్తున్నారు.

Updated Date - 2020-03-04T08:59:24+05:30 IST