ప్రియుడి ఎడబాటు భరించలేక..

ABN , First Publish Date - 2020-12-28T04:43:23+05:30 IST

ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని తన నుంచి వేరు చేశారని మనస్థాపం చెందిన ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన...

ప్రియుడి ఎడబాటు భరించలేక..

యువతి ఆత్మహత్య
కౌన్సెలింగ్‌ సెంటర్‌లో అఘాయిత్యం
జిల్లా కేంద్రంలో ఘటన 

జనగామ టౌన్: ప్రేమించి పెళ్లి చేసుకున్న యువకుడిని తన నుంచి వేరు చేశారని మనస్థాపం చెందిన ఓ యువతి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కొడకండ్ల మండలం ఏడునూతల గ్రామానికి చెందిన మద్దెబోయిన  శ్రీలేఖ (20) జనగామ సమీపంలోని చంపక్‌హిల్స్‌ సఖి సెంటర్‌లోని బాత్‌రూంలో ఆదివారం సాయంత్రం చున్నీతో ఉరి వేసుకుంది. జనగామ సీఐ డి.మల్లేశ్‌, సఖి సెంటర్‌ నిర్వాహకులు, శ్రీలేఖ కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఏడునూతల గ్రామానికి చెంది న మద్దెబోయిన సోమనర్సయ్య - ప్రేమలత దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు ఉండగా పెద్ద కూతురు శ్రీలేఖ డిగ్రీ పూర్తి చేసింది. ఓ యువకుడిని  (20)ని కొద్ది కాలంగా ప్రేమిస్తున్న శ్రీ లేఖ ఈ నెల 15న అతడితో కలిసి ఇంటి నుంచి వెళ్లిపోయి, 16న హైదరాబాద్‌లోని ఓ ఆలయంలో ఇంటర్‌ క్యాస్ట్‌ పెళ్లి చేసుకుంది. యువతీ కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ప్రేమ వివాహం చేసుకొని కర్ణాటక ప్రాంతంలో ఉన్న ఆ జంటను కొడకండ్ల పోలీసులు అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్‌లో కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఆ యువకుడికి 11 నెలలు తర్వాత మైనారిటీ తీరుతుందని, ఆ తర్వాత పెళ్లి చేసుకోవచ్చని ఇద్దరికీ నచ్చజెప్పి శ్రీ లేఖను ఆమె తల్లిదండ్రులకు అప్పగించారు. దీంతో మానసికంగా కుంగిపోయిన శ్రీలేఖను ఎస్సై  సతీష్‌ కౌన్సెలింగ్‌ నిమిత్తం ఈనెల 22న జనగామలోని సఖి సెంటర్‌కు తరలించారు.


కౌన్సెలింగ్‌ పొందుతున్న శ్రీలేఖ ప్రియుడి ఎడబాటును తట్టుకోలేక తీవ్ర మానోవేదనకు గురై సఖి కేంద్రంలోని బాత్‌రూమ్‌లో ఉరివేసుకుంది.  కాగా, టాయిలెట్‌లో దొరికిన సూసైడ్‌ నోట్‌ ఆధారంగా యువకుడు, అతడి తండ్రి, తల్లి ముగ్గురు తన చావుకు కారణమని శ్రీలేఖ తెలుపడంతో ముగ్గురిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ డి.మల్లేశ్‌ తెలిపారు.  శవాన్ని పోస్టుమార్టం కోసం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు.

Updated Date - 2020-12-28T04:43:23+05:30 IST