డిగ్రీ పరీక్షలన్నీ ఒకేసారి

ABN , First Publish Date - 2020-05-13T08:40:22+05:30 IST

డిగ్రీ పరీక్షలన్నింటినీ ఒకేసారి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ముందుగా ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాలని

డిగ్రీ పరీక్షలన్నీ ఒకేసారి

  • జూన్‌ 20 నుంచి నిర్వహణకు ఏర్పాట్లు 
  • ప్రశ్నపత్రంలోనూ మార్పులు

హైదరాబాద్‌, మే 12 (ఆంధ్రజ్యోతి) : డిగ్రీ పరీక్షలన్నింటినీ ఒకేసారి నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి కరోనా నేపథ్యంలో ముందుగా ఫైనలియర్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. కానీ దీనివల్ల పలు ఇబ్బందులు ఎదురవుతుండడంతో ఫస్టియర్‌, సెకండియర్‌ విద్యార్థులకు కూడా పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించి రెండు మూడు రోజుల్లో అన్ని వర్సిటీలకు తెలంగాణ ఉన్నత విద్యా మండలి ఆదేశాలు జారీ చేయనుంది. జూన్‌ 20 నుంచి పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. పీజీ ప్రవేశాలకు డిగ్రీ ఫలితాలకు సంబంధం ఉండడంతో ముందుగా ఫైనలియర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి, వీలైనంత త్వరగా వారి ఫలితాలను విడుదల చేయాలని ఆయా వర్సిటీలు భావించాయి.


అయితే కేవలం ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తే, వారిలో బ్యాక్‌లాగ్స్‌ సబ్జెక్టులు ఉన్న విద్యార్థులకు ఇబ్బందులు ఎదురుకానున్నాయి. ఈ విద్యార్థులు ఒకవేళ ఫైనల్‌ ఇయర్‌లో అన్ని సబ్జెక్టులు ఉత్తీర్ణులైనా.. బ్యాక్‌లాగ్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోతే వారు డిగ్రీ ఉత్తీర్ణులైనట్లు పరిగణించరు. ఈ నేపథ్యంలో ఫైనల్‌ ఇయర్‌ పరీక్షలు నిర్వహించినా ఈ విద్యార్థులకు నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో మూడు సంవత్సరాల విద్యార్థులకు ఒకేసారి పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. 

ప్రశ్నపత్రం మారుతోంది

కరోనా నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగానే ప్రశ్నపత్రంలోనూ మార్పులు చేయాలని నిర్ణయించారు. ప్రశ్నల సంఖ్యను తగ్గించనున్నారు. అదే సమయంలో ఎక్కువ ఆప్షన్లను ఇవ్వనున్నారు. ఒక్కో ప్రశ్నకు గతంలో కన్నా ఎక్కువ మార్కులు కేటాయించనున్నారు. అయితే పూర్తి సిలబస్‌ నుంచి ప్రశ్నలు ఇవ్వనున్నట్లు ఓయూ అధికారులు తెలిపారు.  కరోనా దృష్ట్యా యూజీసీ సూచనల ప్రకారం పరీక్ష సమయాన్ని రెండు గంటలకు తగ్గించనున్నట్లు ఓయూ రిజిస్ట్రార్‌ గోపాల్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2020-05-13T08:40:22+05:30 IST